Friday, April 26, 2024

డ్రాగన్ దుస్సాహసం

- Advertisement -
- Advertisement -

China built another Village on border of Arunachal Pradesh

 

అరుణాచల్‌ప్రదేశ్ సరిహద్దుల్లో మరో గ్రామాన్ని నిర్మించిన చైనా

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనా ఆగడాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా డ్రాగన్ మరో దుస్సాహసానికి దిగింది. అరుణాచల్ ప్రదేశ్ వెంబడి భారత భూభాగంలోకి 4.5 కిలోమీటర్ల మేర చొచ్చుకు రావడమే కాకుండా అక్కడ ఏకంగా ఒక గ్రామాన్నే నిర్మించింది. దాదాపు 101 ఇళ్లున్న ఈ గ్రామం శాటిలైట్ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతున్నాయి. గత ఏడాది నవంబర్‌లో చైనా డోక్లాం ఘర్షణ స్థావరానికి అతి దగ్గర్లో ఒక గ్రామాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా వాస్తవ సరిహద్దుకు కేవలం 4.5 కిలోమీటర్ల దూరంలోనే మరో గ్రామాన్ని ఏర్పాటు చేయడం ఆందోళన కలిగిస్తోంది. అయితే దీనిగురించి అధికారికంగా ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఇక తాజాగా చైనా నిర్మించిన గ్రామం భారత్, చైనాల మధ్య వివాదాస్పదంగా ఉన్న ఎగువ సుబన్సురి జిల్లాలోని సారిచు నది ఒడ్డున ఏర్పడింది. ఇక్కడ ఎల్లప్పుడూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉంటాయి.

ఇక ప్రస్తుతం చైనా ప్రస్తుతం గ్రామాన్ని ఏర్పాటు చేసిన ప్రాంతానికి సంబంధించి 2019 ఆగస్టు నాటి శాటిలైట్ ఫోటోల్లో అక్కడ ఎలాంటి నిర్మాణాలు లేకపోగా 2020 నవంబర్ నాటి ఫోటోల్లో వరసగా ఉన్న ఇళ్లు దర్శనమిచ్చాయి. అంటే ఏడాది వ్యవధిలోనే ఇక్కడ గ్రామాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ ఫోటోలను బట్టి స్పష్టమవుతోంది. ఇందుకు సంబంధించి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించగా స్పష్టమైన సమాధానం రాలేదు. ‘సరిహద్దు ప్రాంతాల్లో చైనా చేపడుతున్న నిర్మాణం పనులను భారత్ జాగ్రత్తగా గమనిస్తోంది.

గత కొన్నేళ్లుగా చైనా సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల నిర్మాణాలు చేపడుతోంది’ అని మాత్రమేవ్యాఖ్యానించింది. ఇక అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా చేపట్టిన నిర్మాణాల గురించి గత ఏడాది నవంబర్‌లోనే ఆ రాష్ట్ర బిజెపి ఎంపి తపిర్ గావో ప్రస్తావించారు. లోక్‌సభలో చైనా చొరబాట్ల గురించి ప్రత్యేకించి ఎగువ సుబన్సిరి జిల్లా గురించి హెచ్చరించారు. గత ఏడాది గల్వాన్ ఘర్షణ అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిసితులు నెలకొన్న విషయం తెలిసిందే.యథాతథ పరిస్థితులపునరుద్ధరణకు ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News