Monday, April 29, 2024

దారికిరాని చైనా!

- Advertisement -
- Advertisement -

China encroachments in India

 

గత జూన్ 14-15 రాత్రి తూర్పు లడఖ్ సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణకు పాల్పడగా సంభవించిన ఉభయ సైన్యాల ఘర్షణలో మన యోధులు 20 మంది దుర్మరణం పాలైన ఉదంతం తెలిసిందే. నాలుగున్నర దశాబ్దాల పైబడిన దాదాపు ప్రశాంత సరిహద్దుల్లో ఈ ఘటన సంచలనం కలిగించింది. మనతో మంచిగా ఉంటున్నట్టు నటిస్తూనే మన భూభాగాలను ఆక్రమించుకునే దుర్బుద్ధి చైనాలో కరడుగట్టుకుపోయిందనే విషయం సందేహాతీతంగా రుజువైంది. వాస్తవాధీన రేఖపై శాశ్వత ఒప్పందానికి ససేమిరా అని నిరాకరిస్తూనే దురాక్రమణ చర్యలకు పాల్పడుతున్న పొరుగుదేశంతో శాంతిని కాపాడుకోవాలన్న మన మంచితనాన్ని అది అలుసుగా తీసుకుంటున్నదనే అభిప్రాయానికి అవకాశం ఏర్పడుతున్నది. గాల్వాన్ లోయ ఘటన తర్వాత పరిస్థితిని చక్కదిద్దుకోవడానికి రెండు దేశాల సైన్యాధికారుల మధ్య చర్చలు కొనసాగుతూ ఉండడం మంచి పరిణామంగా భావిస్తుండగా అవి ఎప్పటికీ ఒక కొలిక్కి రాకుండా ఉండడానికి వీలుగా చైనా మొండికేస్తున్న తీరు బాధాకరం.

ఆదివారం నాడు జరిగిన 9వ విడత చర్చల్లో కూడా పురోగతి వైపు అడుగులు పడిన సూచనలు లేవు. ఆనాటి కాల్పుల రహిత ఘర్షణలో వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒకరైన కల్నల్ సంతోష్ మన సూర్యాపేటకు చెందినవారే. 72వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా కల్నల్ సంతోష్‌ను మహావీర చక్ర పురస్కారంతో సత్కరించి స్మరించుకుంటున్నాం. పొరుగు దేశం బలగర్వంతో ఎంతటి దూకుడు ప్రదర్శించినా సంయమనం వహించి దానితో సఖ్యతనే కోరుకుంటున్నాం. వాస్తవాధీన రేఖ పొడుగునా జరిగిన ఉల్లంఘనలు, అతిక్రమణలన్నింటి నుంచి రెండు దేశాల సైన్యాలు ఒకేసారి వెనుకకు మళ్లాలన్న మన న్యాయమైన ప్రతిపాదనకు చైనా అంగీకరించడం లేదు. తనకు ప్రయోజనకరంగా ఉండే విధంగా మాత్రమే ఈ ఉపసంహరణ కార్యక్రమం మొదలు కావాలని అది కోరుకుంటున్నట్టు స్పష్టపడుతున్నది. పాంగాంగ్ సరస్సు దక్షిణతీరంలో భారత సైన్యాలు ప్రతివ్యూహంలో భాగంగా ఆక్రమించుకున్న ప్రాంతాల నుంచి ముందుగా అవి వైదొలగాలని పట్టుబడుతున్నది.

ఒకవైపు చర్చల్లో పాల్గొంటూనే మరోవైపు ఎక్కడ సందు దొరికితే అక్కడ మన భూభాగాల్లోకి సైన్యాన్ని పంపించి అదనపు దురాక్రమణలకు ప్రోత్సహించాలని చూస్తున్నది. సిక్కిం సరిహద్దుల్లోని అత్యంత ఎత్తైన నాకూలామ్ ప్రాంతంలో ఐదు రోజుల క్రితం చైనా సేనలు మన భూభాగంలోకి అడుగుపెట్టబోగా మన దళాలు అడ్డుకున్నాయని, ఆ ఘర్షణలో రెండువైపులా స్వల్పంగా గాయపడ్డారని తాజాగా తెలియవచ్చింది. మన సైన్యం నిరంతరం మెలకువగా, మొక్కవోని అప్రమత్తతో ఉంటే తప్ప చైనాతో గల 3500 కి.మీ. పొడవు సరిహద్దుల్లో దాని దూకుడును దురుద్దేశాన్ని విఫలం చేయడం సాధ్యం కాదని బోధపడుతున్నది. ఇటు చర్చల్లోనూ సహకరించక, అటు హద్దుల్లోనూ ఉండక మనను నిత్యం ముళ్ల మీద ఉండే పరిస్థితిలోకి నెట్టడమే చైనా ఉద్దేశమని స్పష్టంగా తెలుస్తున్నది. మన భూభాగాల్లో మనం నిర్మించుకున్న రోడ్లను ఉపయోగించుకొని చొచ్చుకురావడానికి చైనా సేనలు తరచు ప్రయత్నిస్తున్నాయి.

డెంచుక్ రంగంలో ఇటీవల చైనా దళాలు ఇందుకు పాల్పడగా అడ్డుకున్న వీడియో ఒకటి తాజాగా బయటపడింది. అలాగే సరిహద్దుల్లోని మన సంచార జాతుల వారు పశువులు, గొర్రెలను మేపడానికి ఏటా వెళ్లే ప్రాంతాల నుంచి వారిని బెదిరించి చైనా సేనలు వెనుకకు పంపుతున్న వీడియో కూడా ఒకటి బహిర్గతమైంది. గాల్వాన్ లోయ ఘటన తర్వాత సరిహద్దుల పొడుగునా మన సైన్యాన్ని విశేషంగా మోహరించక తప్పలేదు. చర్చలు సఫలమై రెండు దేశాలు తమ హద్దుల్లో తాము నిశ్చింతంగా ఉండే వాతావరణం నెలకొనడం అవసరం. సైనిక అధికారుల స్థాయి చర్చలు సత్ఫలితాలను ఇస్తే రెండు దేశాల అగ్ర నేతల మధ్య సయోధ్య ఏర్పడి అటు ఇటు ప్రజలు హాయిగా ఉండగలుగుతారు.

అమెరికాలో రిపబ్లికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఓటమి, డెమొక్రాటిక్ జో బైడెన్ కొత్త అధ్యక్షుడుగా అధికార పగ్గాలు చేపట్టడం భారత చైనా సంబంధాల మీద సానుకూల ప్రభావం కనపరుస్తుందేమో చూడాలి. పాకిస్తాన్ ప్రయోజనాల కోసం మనను ఇబ్బందుల్లో పెట్టడం కోసమో, అంతర్జాతీయ ఆధిపత్య కాంక్షను నెరవేర్చుకొనే యత్నంలో విశ్వవేదిక మీద మన ప్రాధాన్యాన్ని తగ్గించడం కోసమో, చైనా ఈ దూకుడును ఇలాగే కొనసాగిస్తే ఈ ప్రాంత ప్రగతికి అది తీవ్ర విఘాతం కలిగిస్తుంది. ప్రపంచంలోనే అతి పెద్ద దేశాలైన భారత, చైనాల మధ్య శాశ్వత సామరస్యం విశ్వశాంతికి ప్రాణప్రదమని బీజింగ్ గుర్తించాలి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News