Friday, April 26, 2024

ప్రపంచంపై చైనా ప్రభావం!

- Advertisement -
- Advertisement -

గ్లోబల్ టైమ్స్ 17 డిసెంబర్ 2022న విడుదల చేసిన ఒక సర్వే నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా పాల్గొన్న వారిలో 62% పైగా చైనా ప్రభావం పెరుగుతోందని తమ అభిప్రాయం వెలిబుచ్చారు. అమెరికా ప్రభావం పెరుగుతోందని నమ్మే సంఖ్యకు ఇది రెట్టింపు ఉంది. చైనా- అమెరికాల మధ్య సంబంధాలలో ఉద్రిక్తతలు సడలించడం కంటే సంఘర్షణగా మారే అవకాశం ఉందని ఎక్కువ మంది భావిస్తున్నారు. కొవిడ్- 19 మహమ్మారిపై ఆందోళన కంటే ద్రవ్యోల్బణం, యుద్ధం, ఇంధనం, ఆహార భద్రతా సంక్షోభంపై ఆందోళనలు ఎక్కువగా వున్నాయి. రష్యా- ఉక్రెయిన్ సంఘర్షణ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపిందని, ప్రపంచానికి అత్యవసర సమస్యలను తీసుకు వచ్చిందని విశ్లేషకులు అంటున్నారు. మూడవ సంవత్సరంలోకి ప్రవేశించిన మహమ్మారి ప్రభావం గురించి చాలా దేశాలు, ప్రజలు తక్కువ ఆందోళనను చూపుతున్నారు. వైరస్ తక్కువ హానికరంగా మారినందున ఆందోళన తక్కువ స్థాయిలో వుంది.

ఈ సర్వేను గ్లోబల్ టైమ్స్ రీసెర్చ్ సెంటర్ ఏటా విడుదల చేస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ 29 నుంచి డిసెంబర్ 6 వరకు చైనా- అమెరికా సంబంధాలు, ప్రపంచ భద్రత, అభివృద్ధికి సంబంధించిన 30 ప్రశ్నలను కవర్ చేసిన ఈ సర్వేలో చైనా, అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యుకె, జర్మనీ, సౌదీ అరేబియా, టర్కీ, ఈజిప్ట్, నైజీరియా, కెన్యా, పాకిస్తాన్, భారత దేశం, బ్రెజిల్, అర్జెంటీనా, మెక్సికో, జపాన్, సింగపూర్, వియత్నాం, ఇండోనేషియా, దక్షిణ కొరియా సహా ప్రపంచ వ్యాప్తంగా 33 దేశాల నుండి 36,000 కంటే ఎక్కువ సర్వే నమూనాలను స్వీకరించారు. చైనా అభివృద్ధి, చైనా ఆధునీకరణలను ప్రపంచం స్వాగతిస్తోందని, చైనా ఆధునీకరణపై బలమైన విశ్వాసం నెలకొని ఉందని; అమెరికా, దాని మిత్ర దేశాలు చైనా అభివృద్ధి ప్రపంచానికి ముప్పు అనే సిద్ధాంతాన్ని వ్యాప్తి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, అమెరికా ఆధిపత్యంలో ఉన్న ప్రపంచీకరణపై ఎక్కువ మంది విశ్వాసం కోల్పోతున్నారని విశ్లేషకులు తెలిపారు.

ఎవరు ఎక్కువ ప్రభావం చూపుతున్నారు?

‘ఇటీవలి కాలంలో యుఎస్ లేదా చైనాల అంతర్జాతీయ ప్రభావం ఎలా మారింది?’ అనే ప్రశ్నకు ప్రపంచ వ్యాప్తంగా పాల్గొన్న వారిలో 30 శాతానికి పైగా యుఎస్ ప్రభావం పెరుగుతోందని అన్నారు. మరి అంతే సంఖ్యలో యుఎస్ ప్రభావం తగ్గుతోందని అన్నవారున్నారు. చైనా ప్రభావం పెరుగుతోందని 62 శాతం మంది అభిప్రాయపడ్డారు. కెన్యా, దక్షిణాఫ్రికా, నైజీరియా, ఆస్ట్రియా, పోలాండ్, ఇండియా వంటి దేశాల్లో అమెరికా ప్రభావం తగ్గటం లేదని అది పెరుగుతోందని ఎక్కువ మంది భావిస్తున్నారు. అమెరికాలో 32% మంది తమ దేశ అంతర్జాతీయ ప్రభావం పెరుగుతోందని, మరో 32% మంది అమెరికా ప్రభావం తగ్గుతోందని భావిస్తున్నారు. చైనా ప్రభావం పెరుగుతోందని అమెరికాలో 56% మంది అభిప్రాయపడ్డారు.
నిజమైన జాతీయ బలం అనే కోణం నుండి చూస్తే సైనిక, ఆర్థిక వ్యవస్థలలో, సైన్స్, టెక్నాలజీ పరంగా అమెరికా ఇప్పటికీ పైచేయిగా ఉంది.

కానీ మానవాళి పంచుకునే విలువలకు ప్రాతినిధ్యం వహించే నాయకుడిగా లేదా ఇతర దేశాలలో ప్రజాదరణ, సానుకూలత గల నాయకుడిగా ‘అంతర్జాతీయ ప్రభావాన్ని’ చూసినట్లయితే, అమెరికా ప్రభావం ఖచ్చితంగా తగ్గుతోంది’ అని ఫుడాన్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పబ్లిక్ అఫైర్స్ ప్రొఫెసర్ షెన్ యి అన్నారు. చైనీస్ అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్‌కు చెందిన అంతర్జాతీయ సంబంధాల నిపుణుడు లూ జియాంగ్ గ్లోబల్ టైమ్స్‌తో మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది చైనా ప్రభావం పెరుగుతోందని నమ్మడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది, చైనా స్థిరమైన, వేగవంతమైన అభివృద్ధి వల్ల ఏర్పడిన శక్తివంతమైన జాతీయ బలం; రెండవది, ప్రపంచ అభివృద్ధి, భద్రతల కోసం చైనా ఆలోచనలు. ఇవి ప్రపంచ వ్యాప్తంగా బాగా ఆమోదించబడుతున్నాయి. చైనాలో ఈ సూత్రాలు చాలా కాలం క్రితమే నిర్వచించబడ్డాయి. ఇతర దేశాలపై ఆధిపత్యం కూడదని, వారి అంతర్గత విషయాలలో జోక్యం చేసుకోరాదని చైనా విదేశాంగ విధాన ప్రధాన సూత్రాలు, అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి నిలబడాలనేది చైనా విధానం. చైనా బలహీనమైనది గాను, ఒక అభివృద్ధి చెందని దేశంగానూ ఉన్నప్పుడు, ఇతర దేశాలు చైనా చెప్పిన వాటిని నిజంగా పట్టించుకోలేదు అని ఆ నిపుణుడు చెప్పారు.

ఈ రోజు చైనా జాతీయ బలంతో ప్రధాన ప్రపంచ శక్తిగా మారిందని, ఆధిపత్యాన్ని కోరుకోబోమని ఇచ్చిన తన వాగ్దానాన్ని చైనా నిస్సందేహంగా నిలబెట్టుకుంటోందని అనేక దేశాలు విశ్వసిస్తున్నాయి అనిలూ అన్నారు. చైనా ప్రతిపాదించిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రపంచవ్యాప్తంగా చైనా భాగస్వాములకు నిరంతరం ప్రయోజనాలు కలిగిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా యుఎస్ ఆధిపత్యం వల్ల కలిగే విధ్వంసాలను, అస్థిరతలను పోల్చి చూస్తే అది అభివృద్ధిని తీసుకు వచ్చింది. అందువల్ల పెరుగుతున్న చైనా ప్రభావంపై ప్రపంచ వ్యాప్తంగా దేశాలు మరింత సానుకూలంగా ఉండటం చాలా సహజమైన పరిణామం- అని లూ పేర్కొన్నారు.

కెన్యా, దక్షిణాఫ్రికా, నైజీరియా వంటి ఆఫ్రికా దేశాలతో పాటు పోలాండ్, ఆస్ట్రియా వంటి కొన్ని యూరోపియన్ దేశాలలో కొందరు ప్రజలు అమెరికా ప్రభావం పెరుగుతున్నదని నమ్ముతున్నప్పటికీ, ఈ దేశాలలో కూడా ఎక్కువ మంది (పోలాండ్ లో 56%, ఆస్ట్రియాలో 70 % నుండి, దక్షిణాఫ్రికాలో 78%, కెన్యాలో 76% వరకు) చైనా ప్రభావం పెరుగుతోందని గట్టిగా నమ్ముతున్నారు. పెరుగుతున్న చైనా అంతర్జాతీయ ప్రభావాన్ని రెండు కోణాల నుండి అర్థం చేసుకోవచ్చని షెన్ అన్నారు. ఒకటి, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న దేశాలు చైనా గురించి మంచి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాయి. చైనాతో సంబంధాల నుండి ప్రయోజనం పొందినందున భవిష్యత్తులో చైనా మరింత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని వారు ఆశిస్తున్నారు. అమెరికా ఆధిపత్యం తెచ్చిన ప్రతికూల ప్రభావాలను సమతుల్యం చేయడానికి చైనా మరింత శక్తివంతంగా ఉండాలని వారు కోరుకుంటున్నారు.

కొన్ని పాశ్చాత్య దేశాలలో మాత్రం, ముఖ్యంగా వాషింగ్టన్‌ను అనుసరించే అమెరికా మిత్ర దేశాలలో, చైనా ప్రభావం పెరుగుతోందని నమ్మడానికి కారణం తమ దేశాలలో ‘చైనా ముప్పు’ సిద్ధాంతం దీర్ఘకాలిక ప్రచారమూ, ప్రపంచ వ్యాప్తంగా చైనానూ ఆక్రమణ శక్తిగ తాము రూపొందిస్తున్న చిత్రమూ కలిసి చైనా ప్రభావాన్నిపెంచుతున్నదేమోనని సందేహపడుతున్నారు.

ఇప్పుడు అమెరికా తన జీవితంలో ప్రధానమైన దశలో లేదు, అందమైన, సొగసైన, యాక్షన్లోనూ, ప్రతిస్పందనలోనూ వేగంగా ఉండే హాలీవుడ్ యాక్షన్ చిత్రాల కథానాయకులు ఇప్పుడు లేరు. నేటి అమెరికా వయసుడిగిన మాఫియా బాస్ లాగా ఉంది. ఒక పక్క అతను నడవలేని స్థితిలో వున్నాడు కాని గ్యాంగ్ స్టర్లపై ఇంకా ప్రభావం చూపగల శక్తిని కలిగి ఉన్నాడు అనిరెన్మిన్ విశ్వవిద్యాలయంలోని స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ అసోసియేట్ డీన్ జిన్ కాన్రోంగ్ అన్నారు.
చైనా- అమెరికా సంబంధాలు

చైనా- అమెరికాల మధ్య ఉద్రిక్తతలపై ప్రపంచం ఆందోళన చెందుతోందని సర్వే చూపిస్తుంది. అమెరికాతో సహా 19 దేశాలలో సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది చైనా -అమెరికా సంబంధాలు ‘యధాతథ స్థితిని’ కొనసాగిస్తాయని ఆశిస్తున్నారు. 45 శాతం మంది చైనా – అమెరికా ఉద్రిక్తత తగ్గుతుందని, 39 శాతం మంది యథాతథస్థితి కొనసాగుతుందని ఆశిస్తున్నారని సర్వే ఫలితాలు చూపిస్తున్నాయి. అయితే అమెరికాలో 11 శాతం మంది మాత్రమే భవిష్యత్తులో ఇరు పక్షాలు ఉద్రిక్తతలను తగ్గిస్తాయని భావిస్తున్నారు. 44 శాతం మంది యథాతథ స్థితి మారదని భావిస్తున్నారు. చైనా ఇప్పుడు అమెరికా వ్యతిరేక ప్రచారం చేయటం లేదని, చైనా -అమెరికా సంబంధాలకు సంబంధించిన అన్ని వార్తా నివేదికలు నిష్పక్షపాతంగా వాస్తవాలను పరిచయం చేస్తున్నాయని, మంచి సంకల్పం ఆధారంగా చైనా -అమెరికా సంబంధాలను అర్థం చేసుకోవడానికి ప్రజలకు మార్గనిర్దేశం చేయడానికి ప్రయత్నిస్తున్నాయని లూ అన్నారు.

‘కానీ అమెరికాలో, రెండు ప్రధాన పార్టీలు చైనాను శత్రువుగా చిత్రించడానికి తమ వంతు కృషి చేస్తున్నాయి. అంతర్గత వ్యవహారాలలో తమ అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి సినోఫోబియాను (చైనా పట్ల వ్యతిరేకతను) ఉపయోగించుకుంటున్నాయి. అమెరికా ప్రధాన స్రవంతి మీడియా నివేదికలు- రాజకీయాలలో లేదా ఆర్థిక వ్యవస్థలో ప్రతి రోజూ అమెరికా – చైనాల మధ్య సంఘర్షణను హైప్ చేసి, ప్రేరేపిస్తున్నాయని గమనించవచ్చు. కాబట్టి ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేసే చైనా- అమెరికా సంబంధాలకు యుఎస్ రాజకీయ నాయకులూ, మీడియా నే బాధ్యత వహించాలి‘ అని లూ పేర్కొన్నారు.

33 దేశాల నుండి సేకరించిన నమూనాలలో, చైనా -అమెరికా మధ్య సంభావ్య సంఘర్షణకు కారణం ‘చైనా యుఎస్‌పై ప్రతీకారం తీర్చుకోనే వైఖరి అవలంబించడమే’ అని 23% మంది అభిప్రాయపడ్డారు. సుమారు 22% మంది ఇది ‘తైవాన్ వేర్పాటువాదులు సృష్టిస్తున్న ఇబ్బంది’ అని నమ్ముతున్నారు. 19% మంది ‘చైనాకు వ్యతిరేకంగా అమెరికా తన నియంత్రణ వ్యూహాన్ని బలోపేతం చేయాలని ప్రయత్నించడం కారణం’ అని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత పరిస్థితి పై నియంత్రణ కోల్పోకుండా తమ మధ్య విభేదాలు, పోటీలను అదుపులో వుంచుకోవటం ఆ రెండు దేశాలకు అత్యంత ఆవశ్యకం. ఉద్రిక్తతలను పూర్తిగా తగ్గించడం చాలా కష్టమని చైనా విశ్లేషకులు తెలిపారు. చైనా- అమెరికా సంఘర్షణ ప్రమాదం గురించి అమెరికా ఉన్నత వర్గాలు తెలుసుకోవాలి. ముఖ్యంగా తైవాన్ సమస్య వంటి సున్నితమైన వ్యవహారాలలో, రెండు ప్రధాన శక్తులు సంఘర్షణను ఎంత వరకు నివారించగలవు అనేది చైనా పట్ల అమెరికా వైఖరిపై ఆధారపడి ఉంటుంది. అమెరికా, చైనాను కట్టడి చేసే తన వ్యూహాన్ని నిలిపివేస్తే, చైనాకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం వుండదని నిపుణులు నొక్కి చెప్పారు.

ప్రపంచీకరణ భవిష్యత్తు రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సంఘర్షణ ప్రమాదం గురించి ప్రపంచం ఎక్కువగా ఆందోళన చెందుతోందని సర్వే ఫలితం చూపిస్తుంది. అయితే చాలా మంది ప్రపంచీకరణను అభివృద్ధి చేయడానికి ప్రపంచం ఒక కొవిడ్ కొత్త లేదా మెరుగైన మార్గాన్ని కనుగొనాల్సిన అవసరం ఉందని నమ్ముతున్నారు. ‘రాబోయే 10 సంవత్సరాలలో సంతృప్తికరమైన ప్రపంచీకరణను సాధించగలము’ అని చైనాలో ఇంటర్వ్యూ ఇచ్చిన వారు చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ‘యుద్ధం’, ‘ధరల పెరుగుదల’, ‘ఆహారం, ఇంధన సంక్షోభాలు’ వంటి సమస్యలపై ఇతర దేశాల భాగస్వాముల కంటే వారు తక్కువ ఆందోళన చెందుతున్నారు.

ఇటీవలి సంవత్సరాలలో ప్రపంచం కొవిడ్ అల్లకల్లోలంతో బాధపడుతున్నప్పుడు చైనా ప్రభుత్వం తన ప్రజలను బాగా రక్షించిందని ఇది చూపిస్తుందని నిపుణులు చెప్పారు. చైనా ప్రజలపై ప్రస్తుత ప్రపంచీకరణ ప్రతికూల ప్రభావం తక్కువగా వుంది. ఉమ్మడి సవాళ్లను అధిగమించడానికి తన జ్ఞానాన్ని, అనుభవాలనీ ప్రపంచంతో పంచుకోవడానికి చైనా అర్హత సాధించుకున్నది. సమస్యాత్మక ప్రపంచ క్రమాన్ని సంస్కరించడానికి, ప్రజావసర వస్తువులను అందించడంలో చైనా మరింత చురుకుగా ఉండాలని ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఆశిస్తున్నారు.

జతిన్ కుమార్
9849806281

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News