Saturday, April 27, 2024

గాల్లోకి తూటాలు… చర్చల మాటలు

- Advertisement -
- Advertisement -

 తిరిగి బరితెగించిన చైనా బలగాలు
 భారత జవాన్ల పూర్తి సంయమనం
 సరిహద్దుల్లో మళ్లీ ఉద్రిక్తత


న్యూఢిల్లీ: సరిహద్దుల్లోని ఈస్టర్న్ లద్ధాఖ్‌లో చైనా సైన్యం మరోసారి బరితెగించింది. మంగళవారం ఇక్కడ చైనా బలగాలు గాలిలో కాల్పులు జరిపాయి. భారతీయ భూభాగంలోని స్థావరాలకు వద్దకు దూసుకురావడానికి యత్నించాయని సైనిక అధికార వర్గాలు తెలిపాయి. ఓ వైపు కాల్పులకు దిగుతూ మన సైనికులను భయభ్రాంతులు చేసేందుకు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పిఎల్‌ఎ) వ్యూహం పన్నినట్లు వెల్లడైంది. చైనా బలగాల కవ్వింపులు, దుందుడుకు చర్యతో ఈ సరిహద్దులలో తిరిగి తీవ్రస్థాయి ఉద్రిక్తత రాజుకుంది. ఒక్కరోజు క్రితమే ఇదే ప్రాంతంలో చైనా బలగాలు ఎల్‌ఎసి వెంబడి ముందుకు చొరబడి వచ్చాయి. అయితే తాము ఇటువంటి దుస్సాహాసం ఏదీ చేయలేదని చైనా వర్గాలు అధికారికంగా తెలిపాయి. ఈ ఖండన పర్వం జరిగి రోజు కూడా గడవకముందే తిరిగి చైనా డ్రాగన్ బలగాలు తూర్పు లద్థాఖ్‌ను మరింత హింసాత్మకం చేసే విధంగా ఉన్నట్లుండి గాలిలోకి గాల్పులకు దిగినట్లు వెల్లడైంది. ఈ క్రమంలో భారత భూభాగాన్ని కైవసం చేసుకునేందుకు చాలా ముందుకు వచ్చినట్లు వెల్లడైంది. పాంగాంగ్ లేక్‌కు సమీపంలోనే చైనా బలగాలు ఈ విధంగా గాలిలోకి తూటాలను పేల్చడం ద్వారా తమ కవ్వింపులు హుంకరింపుల చర్యలను మరో మారు చాటుకున్నాయి. చాలా విచక్షణారహితంగా చైనా బలగాలు వ్యవహరించాయని, ఇష్టం వచ్చినట్లుగా గాలిలోకి కాల్పులు జరపడం ద్వారా ఇప్పటివరకూ ఉన్న ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీశాయని అధికారులు ఢిల్లీలో ధృవీకరించారు. పాంగాంగ్ లేక్, తూర్పు లద్థాఖ్‌లోని అత్యంత సున్నితమైన వ్యూహాత్మక భౌగోళిక ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా సరిహద్దులలో తమ సత్తా చాటుకుని తీరాలని, ఈ విధంగా తాము అజేయ భారతీయ సైన్యం కన్నా పైచేయిగా నిలవాలని చైనా వ్యూహరచనకు దిగుతోంది. అయితే ఎప్పటికప్పుడు భారతీయ నిఘా సమాచార వ్యవస్థ స్పందన, అందుకు అనుగుణంగా భద్రతా బలగాలు అన్ని వాతావరణాలను తట్టుకుని చైనా బలగాల దుష్ట యత్నాలను అడ్డుకుంటూ రావడంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పుడు తిరిగి గాలిలో కాల్పులతో చైనా తమ దూకుడు పెంచేందుకు యత్నించింది.

45 ఏండ్ల తరువాత తిరిగి తూటా బాట
ఎల్‌ఎసి వెంబడి ఇష్టారాజ్యంగా మారణాయధాలను ప్రయోగించడం ద్వారా చైనా బలగాలు ఈ సరిహద్దులలో ఉద్రిక్తతలను రెచ్చగొట్టడం ఇంతకు ముందు కూడా జరిగింది. ఈ అప్రకటిత సరిహద్దు వద్ద చైనా సైనిక బలగాలు 1975లో ఇదే విధంగా గాలిలో తూటాలు పేల్చాయి. కయ్యానికి కాలు దువ్వినట్లు చేస్తూ కబ్జాకు యత్నించాయి. రష్యాలో నాలుగు రోజుల క్రితమే షాంఘై సదస్సు వేదికగా భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెంగే మధ్య సరిహద్దుల సమస్యపై ఇష్టాగోష్టిగా చర్చలు జరిగాయి. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుని తీరాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాల్సి ఉందని ఇరువురు నేతలు మాట్లాడుకున్నారు. అయితే సరిహద్దులలో గత నాలుగురోజులుగా ఇరు దేశాల మధ్య స్వల్ప ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కాల్పులకు దిగుతున్నట్లు పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నారు. తమ బలగాలు ఏ దశలోనూ ఎల్‌ఎసి రేఖ దాటి వెళ్లలేదని, ఎటువంటి అతిక్రమణ అడుగు వేయలేదని భారతీయ సైన్యం అధికారికంగా తెలిపింది. కాల్పులు వంటివి తమ నైజం కాదని, భారతీయ బలగాలే కాల్పులకు దిగినట్లు పిఎల్‌ఎ చెప్పడం వాస్తవ విరుద్ధం అని భారత సైనిక ప్రతినిధి స్పష్టం చేశారు. చైనా బలగాలు ఈ ప్రాంతంలో తరచూ కవ్వింపుల విన్యాసాలకు దిగుతున్నాయని, ఓ వైపు భారత్‌తో సైనిక దౌత్యస్థాయి, రాజకీయ నాయకత్వ దశ సంప్రదింపులు అంటూనే ఇప్పుడు గాలిలోకి కాల్పులకు దిగడం ఎంతవరకూ సబబు అని భారతీయ సైనిక ప్రకటనలో నిలదీశారు. భారతీయ సైన్యాన్ని బెదిరించేందుకు ఈ విధంగా చైనా బలగాలు కాల్పులకు దిగడం వారి వైఖరి ఏ విధంగా ఉందనేది తెలియచేసుకున్నట్లు అయిందని తెలిపారు. చైనా బలగాలు ఎటువంటి కవ్వింపులకు దిగుతూ వస్తూ ఉన్నా తమ బలగాలు సంయమనం పాటిస్తూ వస్తున్నాయని, ఎంతో పరిణతితో బాధ్యతాయుత తరహాలో తాము నడుచుకుంటున్నామని భారత దేశం తెలియచేసింది. చైనా ఎప్పటికప్పుడు తమ అంతర్గత వ్యవహారాల నుంచి అంతర్జాతీయ స్థాయిలో వస్తున్న విమర్శల నుంచి దృష్టి మళ్లించేందుకు ఎప్పటికప్పుడు ఈ విధంగా సరిహద్దుల వద్ద ఉద్రిక్తతల నెగళ్లు రాజేసుకుంటూ పోతోందని విమర్శించారు. భారతదేశం సైన్యం ఉపసంహరణకు, శాంతియుత పరిస్థితుల పునరుద్ధరణకు కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఉద్రిక్తల సడలింపునకు తమ దేశం యత్నిస్తోందన్నారు. అయితే ఇందుకు భిన్నంగా చైనా ఎప్పటికప్పుడు కవ్వింపులకు దిగుతూ ఉద్రిక్తతలు రాజుకునేలా చేస్తోందని అన్నారు. చైనా అధినాయకత్వానికి ఏదో విధంగా ఎదురవుతోన్న రాజకీయ ప్రతికూలతల నుంచి దృష్టి మళ్లించుకునేందుకు ఈ విధంగా చేస్తున్నట్లుగా భావించాల్సి వస్తోందన్నారు. ఇప్పుడు సోమవారం అర్థరాత్రి దాటిన తరువాత ఎల్‌ఎసిదాటి భారతీయ సైన్యం చైనా ప్రాంతంలోకి వచ్చిందని పిఎల్‌ఎ వెస్టర్న్ విభాగపు కమాండ్ అధికార ప్రతినిధి సీనియర్ కల్నల్ జాంగ్ షుయిలీ చేసిన ఆరోపణలను భారతదేశం తీవ్రంగా ఖండించింది. సరిహద్దులలో గస్తీ విధులలో ఉన్న భారతీయ జవాన్లను చెదరగొట్టేందుకు చైనా బలగాలు కావాలనే కవ్వింపు చర్యలకు దిగాయని, అయితే వారికి సర్ది చెప్పేందుకు మన సైన్యం యత్నించినా వినకుండా కాల్పులకు దిగినట్లు తెలిపారు.

China opening fire at indian border after 45 years

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News