Friday, May 17, 2024

అసోంలో ‘మియా’ల రాజకీయం

- Advertisement -
- Advertisement -

గౌహతి: అసోంలో కూరగాయాల ధరలు ఆకాశాన్నంటడానికి ‘మియా’( బెంగాలీ మాట్లాడే ముస్లిం వ్యాపారులు)లే కారణమంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార, ప్రత్యర్థి పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడుతున్నాయి. గౌహతిలో కూరగాయల ధరలు పెరిగిపోవడంపై రెండు రోజలు క్రితం విలేఖరులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందిస్తూ, కూరగాయల ధరలు పెరగడానికి మియాలే కారణమని విమర్శించారు. అసోం వ్యాపారులు గనుక కూరగాయలు అమ్ముతున్నట్లయితే ఇంతగా ధరలు పెరిగేవి కావని ఆయన అన్నారు. అంతేకాదు గౌహతిలోని ఫుట్‌పాలన్నిటినీ ఖాళీ చేయిస్తానని, తమ వ్యాపారాలు చేసుకోవడానికి అసోం వ్యాపారులు ముందుకు రావాలని కూడా ఆయన అన్నారు. అసోంలో బెంగాలీ మాట్లాడే ముస్లింలు ఎక్కువగా వ్యవసాయ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు.

వీరిని అక్కడ ‘మియాలుగా పిలుస్తారు. అయితే ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్ష ఆలిండియా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎఐయుడిఎఫ్) అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేయడం భావ్యం కాదని, శర్మ వ్యాఖ్యలతో ‘మియా’లు బాధపడుతున్నారని అజ్మల్ అన్నారు. ‘ఇది మతాల మధ్య విభేదాలను సృష్టిస్తుంది. ఏదయినా అవాంఛనీయ ఘటన జరిగితే దానికి రాష్ట్రప్రభుత్వం, ముఖ్యమంత్రే బాధ్యులవుతారు’ అని లోక్‌సభ ఎంపి కూడా అయిన అజ్మల్ అన్నారు. అంతేకాదు కూరగాయల ధరలు మియాల కంట్రోల్‌లో ఉండవని కూడా ఆయన అన్నారు. అస్సామీ యువకులు వ్యవసాయ పనులు చేపడితే తాము సంతోషిస్తామని ఆయన అంటూ, అయితే దానికి ఎక్కువ శ్రమపడాల్సి ఉంటుంది కనుక వారు ఆ పని చేస్తారని తాను అనుకోవడం లేదని కూడా ఆయన అన్నారు.

కాగా వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో శర్మ, అజ్మల్‌లు కుమ్మక్కయి అస్సామీబెంగాలీ వివాదాన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేన్ కుమార్ బోరా దుయ్యబట్టారు. బిజెపి నిరుద్యోగం, ధరల పెరుగుదల,అక్రమ వలసలు లాంటి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని, అందుకే ఆ పార్టీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆయన విమర్శించారు. ముఖ్యమైన సమస్యలనుంచి ప్రజలదృష్టిని మళ్లించడానికేముఖ్యమంత్రి ఇలాంటి మతపరమైన ప్రకటనలు చేస్తున్నారని రాయిజోర్ దళ్ అధ్యక్షుడు, ఎంఎల్‌ఎ అఖిల్ గొగోయ్ విమర్శించారు. తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే బిజెపి ఇలాంటి మతపరమైన రాజకీయాలకు పాల్పడుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి హేమంత ఫుకాన్ కూడా విమర్శించారు.

అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సైతం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశంలో ఒక వరం వారు తమ ఇళ్లలో ఆవు పాలు ఇవ్వకపోయినా, కోడి గుడ్డపెట్టకపోయినా పరోక్షంగా ముస్లింలనే నిందిస్తుంటారంటూ ఆయన పరోక్షంగా బిజెపి నేతలపై మండిపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News