Friday, April 26, 2024

మర్కజ్ యాత్రికులపై సిఎం ఆరా

- Advertisement -
- Advertisement -

KCR

 

మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి, మర్కజ్ కేసులు, లాక్‌డౌన్ అమలుపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బుధవారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. సుమారు నాలుగు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో కరోనాకు సంబంధించిన అంశాలపై కూలంకషంగా చర్చించారు. విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండటం, మర్కజ్ వెళ్లొచ్చిన వారి వివరాలపై సమావేశంలో సిఎం ఆరా తీశారు. అందులో ఎంతమందికి పాజిటివ్ వచ్చింది.. వారి కుటుంబ సభ్యులకు ఎవరికైనా పాజిటివ్ వచ్చిందా.. వైరస్ లక్షణాలు ఉన్నాయా అనే దానిపై చర్చించారు. ఈ దశలో ఏ రకంగా ముందుకు వెళ్లాలనే దానిపై అధికారులతో సమాలోచనలు జరిపారు. గాంధీ ఆసుపత్రిలో వైద్యుడిపై దాడి జరగడం పై కూడా సిఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వైరస్ బాధితుల కోసం వైద్యు లు ప్రాణాలు లెక్క చేయకుండా చికిత్స చేస్తున్నారని, అటువంటి వారిపై దాడి చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని తగిన చర్యలు తీసుకోవాలని డిజిపి మహేందర్ రెడ్డిని ఆదేశించినట్లు తెలిసింది.

అలాగే మర్కజ్ వెళ్లొచ్చిన వారిలో 160 మంది వివరాలను వీలైనంత త్వరగా ట్రేస్ చేసి వారికి పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వెంటిలేటర్ల ఏర్పా టు, ఐసొలేషన్ వార్డుల పెంపు,చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యస్థితిని వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడితో గురువారం జరిగే ముఖ్యమంత్రుల వీడియోకాన్ఫరెన్సులో చర్చించాల్సిన అంశాలు, చేయాల్సిన సూచనలపై చర్చించారు. కాగా బుధవారం నుంచి బియ్యం పంపిణీ ప్రారంభమైనందున, వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని సూచించారు. రెండు, మూడు రోజుల్లో లబ్ధిదారులైన కుటుంబాలకు రూ.1500 చొప్పున బ్యాంకు ఖాతాలకు జమ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో ఎటువంటి ఇబ్బందులు ఉండరాదని, కేంద్రాలలో తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

 

CM KCR highest level conference on Markaz cases
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News