Sunday, July 21, 2024

పల్లెల్లో రానున్నది ప్రగతి విప్లవం

- Advertisement -
- Advertisement -

CM KCR holds meeting with district collectors

 

గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళికను అమలు చేయండి

రూ. 39,594 కోట్ల నిధులతో పల్లెలు దేశానికే ఆదర్శం కావాలి
రెండు నెలల్లో వైకుంఠధామాలు, నాలుగు నెలల్లో రైతు వేదికలు పూర్తి చేయండి ఏడాదిలోగా లక్ష కల్లాలు నిర్మించాలి జూన్ 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం
నరేగా నిధులను మరింతగా వాడుకొని కూలీలను ఆదుకోండి
కరోనాపై పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోండి
జిల్లాల కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో సమీక్షలో
ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్: అవసరమైన నిధులు, విస్తృతమైన అధికారా లు, కావాల్సినంత మంది అధికారులు, స్పష్టమైన విధానాలు, పాలనా సౌలభ్యంగా గ్రామాలు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో నిపల్లెలన్నీ బాగుపడి తీరాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. ఇన్ని అ నుకూలతలున్న ప్రస్తుత పరిస్థితుల్లో కాకపో తే, ఇంకెప్పుడూ గ్రామాలు బాగుపడవని ము ఖ్యమంత్రి అన్నారు. వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, గ్రామీణ ప్రా ంతాల్లో వసతుల కల్పనకు, అవసరమైన పను లు చేసుకోవడానికి నరేగా పథకాన్నివ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని సిఎం చె ప్పారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా రైతుల భూముల్లో లక్ష కల్లాలను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లాల  కలెక్టర్లు, జిల్లా పంచాయ తీ అధికారులతో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రగతి భవన్‌లో మంగళవారం సమావేశమయ్యారు.

పలు అంశాలపై ఆయన సుధీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, ప్రతి గ్రామం… ప్రతి రోజు శుభ్రం కావాల్సిందేనన్నారు. ముఖ్యమంత్రి సహా రాష్ట్రంలో అధికార యంత్రాంగంలో ఎవరికైనా సరే గ్రామాలను పరిశుభ్రంగా ఉంచడానికి మించిన పని మరోటి లేదని సిఎం స్పష్టం చేశారు. రాబోయే రెండు నెలల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో వైకుంఠధామాల నిర్మాణం, నాలుగు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. రాబోయే నాలుగేళ్లలో ఏ గ్రామంలో ఏ పని చేయాలనే విషయంలో ప్రణాళికలు రూపొందించాలని, దానికి అనుగుణంగానే పనులు చేయాలన్నారు. ఈ వివరాలతో డిస్ట్రిక్ట్ కార్డు తయారు చేయాలని సిఎం చెప్పారు.

మంత్రులు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డిజిపి మహేందర్ రెడ్డి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గ్రామాల్లో కలెక్టర్లు, డిపిఒ ఆధ్వర్యంలో జరగాల్సిన పనులపై ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శకం చేశారు. కాగా సుమారు ఏడు గంటల పాటు కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో నిర్వహించిన సమీక్షలో సిఎం కెసిఆర్ పలు ముఖ్యమైన అంశాలపై చర్చించారు. వాటిల్లో ప్రధానంగా గ్రామాభివృద్ధి ప్రణాళిక, ఉపాధి హామీ పథకం, హరితహారం – అడవుల పునరుద్ధరణ, పల్లె ప్రగతి – గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, రైతుబంధు – రైతువేదికల నిర్మాణం, ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ ల ఏర్పాటు, కరోనా – అంటువ్యాధులు, మిడతల దండు, నకిలీ విత్తనాలు, కరెంటు బిల్లుల చెల్లింపు తదితర అంశాలపై కలెక్టర్ల సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల కలెక్టర్లు, సీనియర్ అధికారులు తమ అభిప్రాయాలు చెప్పారు.

గ్రామాలు, పట్టణాలు బాగుపడితేనే రాష్ట్రాభివృద్ధి

గ్రామాలు, పట్టణాలు బాగుపడితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యపడుతుందని సిఎం కెసిఆర్ అన్నారు. ప్లానింగ్ ఆఫ్ టౌన్, ప్లానింగ్ ఆఫ్ విలేజ్ అంటే ప్లానింగ్ ఆఫ్ స్టేట్ అన్నట్లేనని అన్నారు. వనరులు, అవసరాలను బేరీజు వేసుకుని గ్రామాల వారీగా నాలుగేళ్ల ప్రణాళిక తయారు చేయాలని ఆదేశించారు. దాని ఆధారంగా డిస్ట్రిక్ట్ ప్రోగ్రెస్ కార్డు రూపొందించడంతో పాటు దాని ప్రకారమే పనులు జరగాలని సూచించారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ద్వారా ప్రభుత్వం తన వద్ద ఉన్న అధికారాలను వదులుకుని కలెక్టర్లకు పూర్తి అధికారాలు అప్పగించిందన్నారు. గ్రామ కార్యదర్శి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పంచాయతీరాజ్ శాఖలో ఖాళీలు భర్తీ చేసిందన్న విషయాన్ని ఈ సందర్భంగా సిఎం గుర్తు చేశారు. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ప్రతి నెలా రూ. 308 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేస్తున్నదన్నారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి రూ.5 లక్షల కన్నా తక్కువ ఆదాయం కలిగిన గ్రామ పంచాయతీలకు అదనపు నిధులిచ్చి, ఐదు లక్షలకు చేరుకునేట్లు చేస్తామన్నారు.

సంవత్సరానికి రూ.9,916 కోట్ల నిధులు

గ్రామ పంచాయతీలకు ప్రతి సంవత్సరం రూ.9,916 కోట్ల నిధులు సమకూరుతున్నాయని సిఎం కెసిఆర్ తెలిపారు. వాటిల్లో రూ.3,694 కోట్ల ఫైనాన్స్ కమిషన్ నిధులు, మరో రూ.5,885 కోట్ల నరేగా నిధులు, రూ. 337 కోట్లపంచాయతీల సొంత ఆదాయం ఉన్నాయన్నారు. అంతా కలిపితే ఏడాదికి రూ. 9,916 కోట్లు గ్రామపంచాయితీల ఖాజానాలో జమ అవుతున్నాయన్నారు. నాలుగేళ్లలో రూ.39,594 కోట్లు వస్తాయని, ఈ నిధులింకా పెరిగే అవకాశం కూడా ఉందన్నారు. ఈ నిధులతో ఏఏ పనులు చేసుకోవచ్చో గ్రామాల వారీగా ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా చార్టడ్ అకౌంట్ నిర్వహించడంతో పాటు అప్పులు క్రమం తప్పకుండా చెల్లించాలన్నారు. ట్రాక్టర్ల లోన్ రీ పేమెంట్ కూడా చేయాలన్నారు. కరెంటు బిల్లులు ప్రతీ నెలా తప్పక చెల్లించాలని, అలాగే 10 శాతం నిధులు హరితహారానికి కేటాయించాలన్నారు.

గ్రామ వికాసం కోసమే స్టాండింగ్ కమిటీలు

గ్రామ వికాసం కోసం జరిగే చర్యల్లో విస్తృత ప్రజా భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం స్టాండింగ్ కమిటీలు ఏర్పాటు చేసిందని సిఎం అన్నారు. గ్రామాల్లో నాలుగు రకాల స్టాండింగ్ కమిటీలున్నాయన్నారు. వాటిల్లో వర్క్ కమిటీ, శానిటేషన్ కమిటీ, స్ట్రీట్ లైట్ కమిటీ, గ్రీన్ కవర్ కమిటిలలో 15 మంది చొప్పున సభ్యులున్నారన్నారు. ఇలా పంచాయతీల్లో మొత్తం 8,20,727 మంది స్టాండింగ్ కమిటీ సభ్యులున్నారన్నారు. వీరంతా కలిస్తే ఓ సైన్యంగా ఉంటుందన్నారు. ఈ సభ్యులను క్రియాశీలం చేస్తే పల్లెల అభివృద్ధి ఉద్యమంలా సాగుతుందన్నారు. కాగా ప్రజలతో ఎన్నికైన 1,32,973 మంది గ్రామీణ ప్రాంత ప్రజాప్రతినిధులున్నారన్నారు. వీరిలో 32 మంది జెడ్‌పి చైర్మన్లు, 539 మంది ఎంపిపిలు, 539 మంది జెడ్‌పిటిసిలు, 5,758 మంది ఎంపిటిసిలు, 12,751 మంది సర్పంచులు, 1,13,354 మంది వార్డు సభ్యులున్నారు. వీరందరినీ భాగస్వాములను చేస్తూ తెలంగాణ గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సిఎం కెసిఆర్ సూచించారు.

అన్ని స్థాయిల్లో పోస్టుల భర్తీ

గ్రామాభివృద్ధి పనుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అన్ని స్థాయిలో పోస్టులను భర్తీ చేసిందని సిఎం అన్నారు. మొత్తం 13,993 మంది అధికారులు కేవలం గ్రామాభివృద్ధి పనికోసమే ఉన్నారన్నారు. ఇందులో 32 మంది అడిషనల్ కలెక్టర్లు, 32మంది సిఇఒలు, 32 మంది డిపిఒలు, 68 మంది డిఎల్‌పిఒలు, 539 మంది ఎంపిడిఒలు, 539 మంది ఎంపిఒలతో పాటు 12,751 గ్రామ కార్యదర్శులున్నారన్నారు. వీరంతా ప్రతి రోజు తమ విధులు సక్రమంగా నిర్వహిస్తే గ్రామ వికాసం చాలా వేగంగా, అనుకున్న విధంగా జరుగుతుందన్నారు. ప్రస్తుతం గ్రామాలు కూడా చిన్నగా అయ్యాయని, గిరిజన తండాలు, గూడాలు, మారుమూల పల్లెలను కూడా ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా చేశామన్నారు. దీనివల్ల పనుల నిర్వహణ, పర్యవేక్షణ తేలికవుతుందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన, స్పూర్తి కలిగించి ఉద్యమ స్పూర్తితో గ్రామాలను అభివృద్ధి చేసే కార్యక్రమాలను కలెక్టర్లు, జిల్లా పంచాయతీ అధికారులు తమ భుజస్కంధాలపై వేసుకుని నడిపించాలని సూచించారు.

గ్రామాల్లో ఎంతో మార్పు కనబడుతోంది

తెలంగాణ రాకముందు, వచ్చిన తర్వాత పరిస్థితిని పోల్చి చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మార్పు కనిపిస్తున్నదని కెసిఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా పల్లె ప్రగతి వల్ల గ్రామాల్లో పరిస్థితి మారిందన్ననారు. ఈ స్పూర్తి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు. ఇంకా ఎంతో జరగాలని, అప్పటి వరకు విశ్రమించకూడదన్నారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, వైకుంఠ ధామం, నర్సరీ, డంపు యార్డు దేశంలో ఎక్కడా లేవని, కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అవి సమకూరుతున్నాయన్నారు. ఇదొక అద్భుతం, విప్లవం… తెలంగాణ రాష్ట్రం సాధించిన గొప్ప విజయంగా సిఎం అభివర్ణించారు. ఇది రాష్ట్ర ప్రజలకు గర్వకారణమని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అన్ని గ్రామాలకు ట్రాక్టర్లు వచ్చాయని, వాటికి ట్యాంకర్లు, ట్రాలీలు కూడా వస్తున్నాయన్నారు. ఈ నెలాఖరుకు అన్నీ సమకూరుతాయని పేర్కొన్నారు. అన్ని గ్రామాల్లో నర్సరీలు నడుస్తున్నాయని, వాటిల్లో పెద్దఎత్తునమొక్కలను సిద్దం చేస్తున్నామన్నారు. అలాగే డంప్ యార్డులు, వైకుంఠధామాల నిర్మాణం కోసం స్థలాల కేటాయింపు జరిగిందన్నారు. అవన్నీ నిర్మాణ దశలో ఉన్నాయని, రెండు నెలల్లో నిర్మాణ పనులు పూర్తి అవుతాయన్నారు.

ప్రతి రోజు గ్రామాలు శభ్రం కావాల్సిందే

పల్లె ప్రగతి పేరుతో అప్పుడప్పుడు కార్యక్రమం నిర్వహించడం కాదని, ప్రతి రోజు ప్రతి గ్రామం శుభ్రం కావాల్సిందేనని సిఎం కెసిఆర్ అన్నారు. గ్రామాలు శుభ్రంగా ఉంటే, ఆరోగ్య సమస్యలు రావు…. రోగాలు దరిచేరవన్నారు. దీని వల్ల ఆరోగ్యంపై ప్రజలు, ప్రభుత్వం పెట్టే ఖర్చు తగ్గుతుందన్నారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు బాగా జరగాలనే ఉద్దేశ్యంతోనే కరోనా కష్ట సమయంలో కూడా గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బందికి నెలకు ఐదు వేల అదనపు వేతనం చెల్లిస్తున్నామన్నారు. గ్రామాల్లో గుంతలు తొలగించాలి…. పాడు పడిన బావులను పూడ్చాలన్నారు. అలాగే ఉపయోగించని బోర్లను పూడ్చాలని అధికారులకు సిఎం కెసిఆర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

స్వయంగా తనిఖీలు చేస్తా

త్వరలోనే అన్ని గ్రామాల్లో తాను స్వయంగా ఆకస్మిక తనిఖీలు చేస్తానని సిఎం కెసిఆర్ అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏమూలకు పోయి చూసినా అంతా శుభ్రంగా కనిపించాలన్నారు. అప్పుడు ఈ చెత్తా చెదారం, ముళ్ల పొదలు కనిపిస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో పచ్చదనం, పారిశుధ్యం విధుల నిర్వహణలో కానీ, ఇతర అభివృద్ధి పనుల నిర్వహణలో గానీ ఎవరైనా అలసత్వం ప్రదర్శిస్తే ఎట్టి పరిస్థితుల్లో క్షమించవద్దు అని అన్నారు.ఈ విషయంలో జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం పూర్తి అధికారాలు ఇచ్చిందని. ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని మరోసారి స్పష్టం చేశారు.

ఉపాధి హామీ దేశంలోనే మొదటి స్థానం

గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ గా ఉందని సిఎం తెలిపారు. 2020-21 సంవత్సరంలో తెలంగాణకు 13 కోట్ల పనిదినాలను లక్ష్యంగా ఇస్తే, ఇప్పటికే 9.81 కోట్ల పనిదినాలను (75.5 శాతం) పూర్తి చేసి కూలీలకు ఉపాధి కల్పించామన్నారు. దీనివల్ల లక్షలాది మందికి ఉపాధి దొరికిందన్నారు. ఇంత పెద్ద ఎత్తున దేశంలో మరెక్కడా పనులు జరగలేదన్నారు. 53.5 శాతంతో చత్తీస్ గఢ్ రాష్ట్రం రెండో స్థానంలో ఉండగా, దేశ సగటు 26.3 శాతం మాత్రమే ఉందన్నారు. తెలంగాణలో నరేగా పనులను సమర్థవంతంగా నిర్వహించిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, సంబంధిత శాఖ అధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లను ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ అభినందించారు.

ప్రజోపయోగ పనులను నరేగా ద్వారా చేపట్టాలి

నరేగాను మరింత వ్యూహాత్మకంగా వాడుకోవాలని కెసిఆర్ సూచించారు. మన కూలీలకు ఎక్కువ పని కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపయోగపడే పనులు జరిగే విధంగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. ప్రధానంగా నర్సరీలు, మొక్కల పెంపకం పనులు, అన్ని రకాల రోడ్లపై చెట్లు, పొదల తొలగింపు పనులు, చెరువులో, చెరువు కట్టలపై చెట్ల తొలగింపు పనులు, కాల్వల మరమ్మత్తులు, పూడికతీత పనులు, వైకుంఠధామాల నిర్మాణం, డంపుయార్డుల నిర్మాణం, గ్రామాల్లో అంతర్గత రహదారుల నిర్మాణం, అంగన్ వాడీ కేంద్రాల నిర్మాణం, మురుగు నీరు, నిల్వ ఉన్న నీటి తొలగింపు పనులు, పాఠశాలల్లో ఆట స్థలాల ఏర్పాటు, పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణం, కల్లాల నిర్మాణం, వ్యవసాయ భూమిని చదను చేసుకునే పనులు, పంట చేలకు పశువులు రాకుండా ట్రెంచ్ నిర్మాణం, ఇంకుడు గుంతల ఏర్పాటు, గొర్రెల, మేకలు, బర్రెలు, కోళ్ల కోసం షెడ్ల నిర్మాణం, వర్మి కంపోస్టు, కంపోస్టు తయారీ షెడ్ల నిర్మాణం, పాడుపడిన బావుల పూడ్చివేత, మంచినీటి బావుల్లో పూడిక తీత పనులు తదితర ప్రజోపయోగ పనులను చేపట్టాలని సిఎం ఆదేశించారు. అలాగే ప్రధాన రహదారుల వెంట ఉన్న ముళ్ల పొదలు,చెట్ల తొలగింపు పనులు, కాల్వల్లో పేరుకుపోయిన పూడికను, చెట్లను తొలగించడానికి నరేగాను వాడుకోవాలన్నారు.

లక్ష కల్లాల నిర్మాణం పూర్తి అవ్వాలి

వ్యవసాయం లేని పట్టణ నియోజకవర్గాలను మినహాయించి రాష్ట్రంలోని అన్ని గ్రామీణ నియోజకవర్గాల్లో మొత్తం లక్ష కల్లాలను ఈ ఏడాది నిర్మించాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి కల్లాలు కేటాయిస్తామన్నారు. రైతులకున్న భూమి, అవసరాన్ని బట్టి 50, 60, 75 చదరపు అడుగుల విస్తీర్ణాల్లో కల్లాల నిర్మాణానికి అనుమతులు ఇస్తామన్నారు. ప్రతి ఏటా ప్రతి నియోజకవర్గానికి వెయ్యి చొప్పున కేటాయిస్తామన్నారు. ఎక్కువ మంది రైతులు ముందుకొస్తే, లాటరీ ద్వారా ఎంపిక చేయడం జరగుతుందన్నారు. రూ.750 కోట్ల వ్యయం అయ్యే కల్లాల నిర్మాణానికి నరేగా నిధులు వినియోగించాలన్నారు ఎస్‌సి,ఎస్‌టి రైతులకు 100 శాతం సబ్సిడీతో నిర్మించాలన్నారు. మిగతా వారు 10 శాతం లబ్దిదారుడి వాటాగా చెల్లిస్తే, 90 శాతం సబ్సిడీ ఇస్తామన్నారు.

త్వరలో ఎన్‌ఇఒ నియామకం

ఈ సారి ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్, నీటి పారుదల లాంటి ఇంజనీరింగ్ శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో నరేగా పనులు చేయాలని నిర్ణయించినందున నరేగా ఇంజనీరింగ్ ఆఫీసర్స్ (ఎన్‌ఇఒ)ను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించిందని సిఎం కెసిఆర్ వెల్లడించారు. నరేగా ముఖ్య ఉద్దేశ్యమే కూలీలకు ఉపాధి కల్పించడమని, కాబట్టి కూలీలకు చాలా తొందరగా డబ్బులు వచ్చేలా అధికారులు శ్రద్ధ తీసుకోవాలన్నారు. కరోనా, లాక్ డౌన్ నేపథ్యంలో ఆర్థిక సంక్షోభం ఉందని, అయినప్పటికీ రైతులు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశ్యంతో వెంటనే రైతులందరికీ రైతుబంధు డబ్బులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి, ప్రయత్నానికి రైతుల నుంచి మద్దతు లభించిందన్నారు. యాసంగిలో కూడా ఏ పంటలు వేయాలనే విషయంలో ప్రణాళిక రూపొందించి, అందుకు అనుగుణంగా సాగు చేయించాలన్నారు.

అద్భుత వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ

తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అద్భుత వ్యవసాయ రాష్ట్రంగా రూపాంతరం చెందుతున్నదని సిఎం కెసిఆర్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సమయంలో రైతులకు మరింత చేదోడు వాదోడుగా ఉండాలన్నారు. రైతులకు అవసరమైన అవగాహన కల్పించడానికి, రైతులు పరస్పరం చర్చించుకోవడానికి వీలుగా క్లస్టర్ల వారీగా నిర్మిస్తున్న రైతు వేదికలు నాలుగు నెలల్లో పూర్తి కావాలన్నారు. అలాగే నకిలీ, కల్తీ విత్తనాల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసుల సహకారంతో నకిలీ విత్తన వ్యాపారం చేసే వారిని పట్టుకుని, పిడి యాక్టు నమోదు చేయాలన్నారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో నకిలీ, కల్తీ విత్తనాల దందా ఆగిపోవాలన్నారు. రైతుబంధు సమితులు నకిలీ విత్తనాలను అమ్మే వారిని పట్టుకునే విషయంలో చురుగ్గా వ్యవహరించాలన్నారు అలాగే నకిలీ, కల్తీ విత్తనాలు అమ్మే సమాచారం ఇచ్చిన వారికి రూ.5వేల నగదు ప్రోత్సాహం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వారి పేర్లు గోప్యంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు.

వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు పెరగాలి

వ్యవసాయ ఉత్పత్తులు పెరగడంతో పాటు కనెక్టెడ్ ఆక్టివిటి (అనుబంధ ప్రక్రియలు) జరగాలని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. పండిన ధాన్యమంతా బియ్యంగా మారేందుకు అవసరమైన మిల్లింగ్ సామర్థ్యం కూడా పెరగాలని సూచించారు. అలాగే పప్పులు, నూనెలు, పిండి తయారీకోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు కావాలన్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్ లు నెలకొల్పాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ సెజ్ లకు కనీసం 500 మీటర్ల దూరం వరకు నివాస గృహాల నిర్మాణం కోసం లే అవుట్లకు అనుమతి ఇవ్వవద్దు అని సూచించారు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవుతున్నదని, సీతారామ, పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఆదిలాబాద్ ప్రాజెక్టులు పూర్తవుతున్నాయన్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి సౌకర్యం పెరుగుతున్న నేపథ్యంలో ఇందుకు అనుగుణంగా ఇరిగేషన్ నెట్ వర్క్ మ్యాపింగ్ చేయాలన్నారు. జిల్లాల వారీగా నెట్ వర్క్ వివరాలు కలెక్టర్ల దగ్గర ఉండాలని సూచించారు. చెరువుల్లోని పూడిక మట్టిని స్వచ్ఛందంగా రైతులు తీసుకుపోవడానికి అవకాశం ఇవ్వాలన్నారు. దీనివల్ల అటు పంట పొలాల్లో భూసారం పెరగడంతో పాటు ఇటు చెరువుల్లో పూడిక పోతుందన్నారు.

కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హరితహారం

ఈ నెల 25 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించాలని సిఎం కెసిఆర్ సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వైకుంఠధామం, డంపు యార్డుల చుట్టూ ప్రహరీగోడలు కాకుండా, చెట్లు పెంచడంతో పాటు వాటికి గ్రీన్ వాల్ (ఎత్తయిన చెట్లు పెంచడం) నిర్మించాలన్నారు. సామాజిక అడవులు ఎంత పెంచినా, అది సహజ సిద్ధంగా పెరిగే అడవులకు సాటిరాదన్నారు. అందుకే అడవుల పునరుద్ధరణకు ఉన్న అడవులను కాపాడడానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. నిర్మల్, ఆసిఫాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, అచ్చంపేట, మెదక్ తదితర జిల్లాల్లో ఇంకా అడవి ఉందన్నారు. దాన్ని స్మగ్లర్ల నుంచి కాపాడాలన్నారు. వెంటనే స్మగ్లర్లను గుర్తించి, పిడి యాక్టు నమోదు చేయాలని ఆదేశించారు. అధిక జనాభా, అధిక కాలుష్యం, తక్కువ అడవి ఉండే పట్టణ ప్రాంతాల్లో పచ్చదనం మరింతగా పెంచాలన్నారు. మున్సిపాలిటీల్లో పచ్చదనానికి కేటాయించిన పది శాతం నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నారు.రోడ్ల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో చెట్లను పెంచడంతో పాటు, వ్యవసాయ క్షేత్రాల్లోని ఖాళీ జాగాల్లోకూడా చెట్లను పెంచాలన్నారు. తక్కువ సమయంలో, తక్కువ విస్తీర్ణంలోనే ఏపుగా పెరిగే లక్షణం ఉన్న మియావాకి పద్ధతిలో తెలంగాణలో చెట్లను పెంచడంతో పాటు కొండ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాల్లో ఈ పద్ధతి అవలంభించాలన్నారు.

వలస కూలీలకు సహకారం అందించాలి

రైసు మిల్లులలో పనిచేసే హమాలీలు, కూలీలు కరోనా నేపథ్యంలో తమ స్వస్థలాలైన బీహార్ తదితర రాష్ట్రాలకు వెళ్లారని, ప్రస్తుతం వారు మళ్లీ మన రాష్ట్రానికి రావడానికి సిద్ధంగా ఉన్నారని సిఎం తెలిపారు. మిల్లుల యజమానులు వారిని తీసుకొస్తున్నారని ఈ విషయంలో వారికి కలెక్టర్లు అవసరమైన సహకారం అందించాలన్నారు.

మిడతల దండు ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదు

మిడతల దండు ప్రమాదం తెలంగాణ రాష్ట్రానికి పూర్తిగా తొలగిపోలేదని కెసిఆర్ అన్నారు. గతంలో వచ్చిన మిడతల దండులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ మీదుగా వెళ్లిపోయాయని. ప్రస్తుతం మరో దండు వార్దా సమీపంలోకి వచ్చిందన్నారు. తెలంగాణకు వచ్చే అవకాశం కూడా ఉందన్నారు. ఈ నెల25 నుంచి జూలై నెల మరోసారి మిడతల దండు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారన్నారు. కాబట్టి అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, కొత్తగూడెం, నిర్మల్, నిజమాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ జిల్లాల కలెక్టర్లు, పోలీస్ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, వ్యవసాయ అధికారులు, ఫైర్ అధికారులు, ఎంటమాలజీ నిపుణులు నేడు (బుధవారం) సమావేశమై అవసరమైన వ్యూహం ఖరారు చేయాలని ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News