Saturday, April 27, 2024

మళ్లీ గొర్రెల పంపిణీ

- Advertisement -
- Advertisement -

CM KCR review on second phase Sheep distribution

రూ.6,000 కోట్లతో రెండో విడతకు సిఎం కెసిఆర్ గ్రీన్‌సిగ్నల్

రూ.5వేల కోట్లతో చేపట్టిన మొదటి విడత గొర్రెల పంపిణీ అద్భుతమైన ఫలితాలిచ్చింది రెండు విడతలకు కలిసి రూ.11వేల కోట్లు అవుతున్నది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు బిసిల జీవితాలలో వెలుగులు
నింపుతున్నాయి ఒక్కొక్క యూనిట్‌లో 20+1 గొర్రెల సంఖ్యను కొనసాగిస్తాం యూనిట్ ధరను రూ.లక్షా75వేలకు పెంచుతున్నాం ఇప్పటికే డి.డిలు కట్టిన 14వేల మంది అర్హులకు పెంచిన ధర
వర్తింపజేస్తాం సబ్బండ వర్గాలను ఆదుకోవడమే లక్షంగా రాష్ట్ర ప్రభుత్వ పథకాలు సమైక్య పాలనలో ధ్వంసమైన వృత్తులను తీర్చిదిద్దడమే మా లక్షం : ప్రగతిభవన్ సమీక్షలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో ప్రారంభించనున్నామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 6వేల కోట్లను వెచ్చించనుందని తెలిపారు. బిసిల జీవితాల్లో వెలుగులు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు దేశం మొత్తానికి ఆదర్శంగా మారుతున్నాయని అన్నారు. మొదటి విడత ద్వారా రూ. 5వేల కోట్ల ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో రెండో విడత పంపిణీ కోసం మరో రూ. 6వేల కోట్లను కేటాయిస్తున్నట్టు పేర్కొన్నారు. అందుకు కావాల్సిన నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖను సిఎం ఆదేశించారు. దీంతో మొదటి, రెండవ విడతలను కలుపుకుని రాష్ట్రంలో గొర్రెల పంపిణీ కార్యక్రమాల కోసం మొత్తంగా రూ.11వేల కోట్లను కేటాయించినట్లవుతుందన్నారు.

రాష్ట్రంలో వృత్తి కులాలైన బిసి వర్గాల అభ్యున్నతి..- ప్రభుత్వ కార్యాచరణ…- రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం తదితర అంశాలపై ప్రగతి భవన్‌లో మంగళవారం సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. రాష్ట్రంలో రెండవ విడత గొర్రెల పంపిణి కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, సంబంధిత అధికారులను సిఎం కెసిఆర్ ఆదేశించారు. రాష్ట్రంలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతున్నదన్నారు. కుల వృత్తులన్నీ బిసి వర్గాలే నిర్వహిస్తున్ననేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించి కార్యాచరణ చేపట్టిందన్నారు. అందులో భాగంగా అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచి బిసి వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు.

వ్యవసాయం అంటే పాడి పంట అని… పంటలతో పాటు పాల ఉత్పత్తిలో తెలంగాణ అగ్రగామిగా అభివృద్ధి దిశగా పయనిస్తుందని తెలిపారు. పాల ఉత్తత్తి దారులకు ప్రభుత్వం సబ్సిడీలు అందించడంతో పాటు పలు విధాలుగా అండదండలందిస్తున్నదన్నారు. ప్రభుత్వం నడిపించే విజయాడైరీతో పాటు కరీంనగర్ డైరీ వంటి పాల ఉత్పత్తి సంస్థలు ప్రతిభావంతంగా పనిచేస్తున్నాయని సిఎం తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, టిఆర్‌ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, సిఎం ముఖ్య కార్యదర్శి నర్సింగ్ రావు, సిఎం కార్యదర్శులు స్మితా సబర్వాల్, భూపాల్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రిసిపల్ సెక్రెటరీ రామకృష్ణ రావు తదితరులు పాల్గొన్నారు.

పెరిగిన గొర్రెల యూనిట్ ధర

ప్రస్తుతం అందిస్తున్న గొర్రెల యూనిట్ (20+1)ను అదే సంఖ్యతో కొనసాగించనునున్నట్లు సిఎం కెసిఆర్ తెలిపారు. మొదటి విడతలో ఇప్పటికే 3.74 లక్షల యూనిట్లను పంపిణీ చేసామని, అదే పద్దతిలో యూనిట్ కు 20 గొర్రెలు 1 పొట్టేలు చొప్పున రెండో విడతలో 3.5 లక్షల గొర్రెల యూనిట్లను పంచనున్నట్టు సిఎం తెలిపారు. ప్రస్తుతం ధరలు పెరిగిన నేపథ్యంలో గొర్రెల యూనిట్ ధరను రూ. 1,75,000 కు పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. కాగా ఇప్పటికే డిడిలు కట్టిన 14 వేల మంది అర్హులకు కూడా పెంచిన ధరను వర్తింప చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

సబ్బండ వర్గాలను ఆదుకోవడమే లక్ష్యంగా ప్రణాళికలు

రాష్ట్రంలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని, కుల వృత్తులన్నీ బిసి వర్గాలే నిర్వహిస్తున్ననేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచించి కార్యాచరణ చేపట్టిందని సిఎం కెసిఆర్ తెలిపారు. అందులో భాగంగా ప్రభుత్వం అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచి బిసి వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని సిఎం కెసిఆర్ తెలిపారు. నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ, గాడిన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరామ కృషి ఫలితంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతోందన్నారు. రాష్ట్ర సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని సిఎం కెసిఆర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని సిఎం పేర్కొన్నారు.

గ్రామీణ జీవన ముఖ చిత్రం కుప్పకూలిపోయింది

సమైక్య పాలనలో తెలంగాణ వ్యవసాయాన్ని,అనుబంధ కులవృత్తులను నిర్లక్ష్యం చేసి ధ్వసం చేశారని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. నాడు తెలంగాణలో గ్రామీణ జీవన ముఖ చిత్రం కుప్ప కూలిపోయిన పరిస్థితి ఉండేదన్నారు. నాటి పాలకులకు తెలంగాణ సబ్బండ వర్గాల వృత్తి జీవనం లోని ప్రత్యేకత, వైవిధ్యం అర్థం కాలేదన్నారు. వారికి ఆ సోయి కూడా లేదని వ్యాఖ్యానించారు. అద్భుతమైన వృత్తి నైపుణ్యం కలిగిన బిసి వర్గాలను అల్లుకొనే తెలంగాణలో కుల వృత్తుల జీవనం కొనసాగిందన్నారు. ఉత్పత్తి, సేవా రంగాల్లో భాగస్వామ్యమైన సబ్బండ వర్గాలు కొనసాగించే కుల వృత్తులతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ముడిపడి ఉంటదన్నారు. అవన్నీ కూడా వ్యవసాయాన్ని అల్లుకొని కొనసాగుతాయన్నారు. ఉత్తర భారత దేశంలో మాదిరి కాకుండా వృత్తి కులాలన్నీ బిసి వర్గాలే అధికశాతం నిర్వహించడం తెలంగాణకు ప్రత్యేకమన్నారు. ఆ ప్రత్యేకతను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారి అందరికీ అండగా నిలిచిందన్నారు.

కుల వృత్తుల పునరుజ్జీవనమే లక్ష్యంగా పాలన

మిషన్ కాకతీయ పథకం ప్రారంభంతో రాష్ట్రంలో మొదలైన టిఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రస్థానం, తాగు నీరు..సాగు నీరు వ్యవస్థలను మెరుగుపరిచిందని సిఎం కెసిఆర్ తెలిపారు. గ్రామానికి అదేరువుగా ఉన్న చెరువును నిత్య జలాలతో నింపి సజీవంగా ఉంచి ధ్వంసమైన కుల వృత్తుల పునరుజ్జీవనమే లక్ష్యంగా ఏడేండ్ల పాటు రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నదన్నారు. అద్భుతమైన ఫలితాలు రాబడుతూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని సిఎం వివరించారు.

రాష్ట్రంలో గొల్ల కురుమలు,యాదవులకోసం అమలు చేస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమం, బెస్తలు ముదిరాజుల కులవృత్తి అభివృద్ధికోసం అమలు చేస్తున్న చేపల పెంపకం కార్యక్రమాలు ఇప్పటికే అద్భుతాలను నమోదు చేశాయని సిఎం తెలిపారు. వ్యవసాయం తరువాత పెద్ద ఎత్త్తున ఆధారపడిన కుల వృత్తి చేనేత రంగమన్నారు. ఒకనాడు బ్రాహ్మణులతో సమానంగా ప్రజలనుండి గౌరవాన్ని పొందిన పద్మశాలి వర్గం నాటి సమైక్య పాలనలో ఆకలి చావులకు ఆత్మహత్యలకు బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

చేనేత ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది

వలస పాలకుల వరుస నిర్లక్ష్యంతో అవసాన దశకు చేరుకున్న చేనేత వృత్తి , ప్రభుత్వ చిత్తశుద్ధితో, మంత్రి కెటిఆర్ కార్యదక్షతతో ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుకున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. గాయాల పాలైన చేనేత వృత్తి ప్రస్తుతం గాడిన పడుతున్నదని సిఎం వ్యాఖ్యానించారు. రైతు బీమా మాదిరి పటిష్టంగా చేనేత కార్మికుల కోసం బీమా పథకాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినందున అందుకు సంబంధించి పటిష్ట కార్యాచరణ కోసం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదే సందర్భంలో కల్లు గీత వృత్తి ద్వారా జీవనం సాగిస్తున్న గౌడ్‌లతో సహా నాయి బ్రాహ్మణ రజక తదితర వృత్తి కులాల అభ్యున్నతికి వినూత్న పథకాలను అమలు చేస్తూ వారిని తెలంగాణ ప్రభుత్వం అభివృద్ది పథాన నడిపిస్తున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు.

చేపల ఉత్పత్తిలో దేశంలోనే నంబర్‌వన్

రాజస్తాన్‌ను అధిగమించి, చేపల ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్ స్థానానికి చేరుకున్నదని సిఎం కెసిఆర్ తెలిపారు. చేపల పెంపకం వృత్తిని నిర్వహించే బెస్తలు, గంగపుత్రులు ముదిరాజ్‌ల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఫలితంగా మత్స్య సంపద రోజు రోజుకు అభివృద్ది చెందుతూ విస్తరిస్తున్న దన్నారు. కాళేశ్వరం తదితర ప్రాజెక్ట్ల నిర్మాణం తర్వాత రాష్ట్రంలోని రిజర్వాయర్‌లు నిండి చెరువులు కుంటలు జలకలను సంతరించుకున్నాయన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న ఉచిత చేపల పంపిణీ అద్భుత ఫలితాలను సాధిస్తున్నదన్నారు. ప్రతి గ్రామం లోని చెరువులో మత్స్య సంపద పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిందని తెలిపారు. గతం లో ఇతర ప్రాంతాల్లో నుంచి తెలంగాణ కు చేసుకునే చేపల దిగుమతి తగ్గిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుల వరస క్రమం అంతా నిరంతరం నీటితో లైవ్ లో ఉంటుందని, కృష్ణా గోదావరీ నదుల పరీవాహక ప్రాంతంలో నీటి నిల్వ నిరంతరం ఉంటుందని సిఎం తెలిపారు.

మిషన్ భగీరథ ఇన్‌టేక్ వెల్స్ సహా నీటి నిల్వ ఉండే ప్రతి అవకాశాన్ని చేపల పెంపకం కోసం సద్వినియోగం చేసుకోవాలని సిఎం అధికారులకు సూచించారు. గతంలో ఇతర ప్రాంతాల్లో నుంచి తెలంగాణ కు చేసుకునే చేపల దిగుమతి తగ్గిందన్నారు. చేపల పెంపకంలో అత్యాధునిక సాంకేతిక విధానాలు అవలంబించాలని మంచి చేపల విత్తనాలను ఎంపిక చేసుకోవాలన్నారు .సముద్ర ప్రాంతాలకు దూరంగా వున్న దేశంలోని పలు పట్టణాలు నగరాల్లో చేపల ఎగుమతి కోసం చర్యలు చేపట్టాలని సిఎం ఆదేశించారు. గ్రామాల్లో చెరువుల్లో చేపల ఉత్పత్తి ప్రక్రియను మత్స్య శాఖ పర్యవేక్షణలోనే ఉంటుందన్నారు.చేపల పెంపకం సొసైటీ లో 18 ఎండ్లు నిండిన అర్హులైన యువకులకు అవకాశం కల్పించాలని సిఎం ఆదేశించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News