Sunday, April 28, 2024

పెరిగిన భూ విలువలు రిజిస్ట్రేషన్ చార్జీలు

- Advertisement -
- Advertisement -

Land values registration fees increased in Telangana

రేపటి నుంచి అమలు

అన్ని గ్రామపంచాయతీల్లో రిజిస్ట్రేషన్
చార్జీలు 2శాతం గరిష్ట, కనిష్ఠ
విలువల్లో భారీ మార్పులు
రిజిస్ట్రేషన్ సంబంధిత 20రకాల
సేవలపై పెరగనున్న చార్జీలు
ఎనిమిదేళ్ల తర్వాత పెంపు
ఎకరం సాగుభూమిపై కనిష్ఠంగా
రూ.75వేలు పెంపు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులు, భూముల విలువలు, రిజిస్ట్రేషన్ రుసుంలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన మార్కెట్ విలువలు ఈ నెల 22 నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ కమిషనర్‌ను సిఎస్ ఆదేశించారు. రాష్ట్రంలో భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలతో పాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా అందే అన్ని సేవల ఛార్జీలు పెంచాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. భూములు, ఆస్తుల విలువ పెంపునకు సంబంధించిన సాప్ట్‌వేర్‌ను కూడా అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. వ్యవసాయేతర భూముల విలువను ఇప్పటి కన్నా గరిష్టంగా 50 శాతం పెంచాలని రిజిస్ట్రేషన్ శాఖ ప్రతిపాదనలు సిద్ధంచేసింది. ఈ క్రమంలో సాగుభూములు గరిష్ట, కనిష్ట విలువల్లో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. భూముల మార్కెట్ విలువ పెంపుతో పాటు, రిజిస్ట్రేషన్, సంబంధిత 20 రకాల సేవలపై విధించే ఛార్జీలను పెంచనున్నారు.

ఆస్తుల విలువ గరిష్టంగా 50 శాతం…

వ్యవసాయేతర భూములు, ఇతర ఆస్తుల విలువ గరిష్టంగా 50 శాతం పెరగనుండగా ప్రాంతాల వారీ విలువ ఆధారంగా అవి 20 శాతం, 30 శాతం, 40 శాతం మేర పెరగనున్నాయి. ఎనిమిదేళ్ల తర్వాత భూముల విలువ, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించిన నేపథ్యంలో తదనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేశారు. 2020 జనవరిలో స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ సిద్ధం చేసిన నివేదికలోని అంశాలతో పాటు ఏడాదిన్నర వ్యవధిలో చోటుచేసుకున్న పరిణామాలను ప్రాతిపదికగా చేసుకొని భూముల విలువను నిర్ధారించినట్టు సమాచారం. గతంలో ప్రతిపాదనలు రూపొందించినప్పుడు ప్రాంతీయ రింగ్‌రోడ్డు మాట లేదు. తాజాగా అది తెరపైకి రావడంతో దానికి చేరువలో భూముల మార్కెట్ విలువ భారీగా పెరగడాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. విలువలు ఖరారు చేస్తూ తాజాగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎకరానికి రూ.75,000 వేలుగా

వ్యవసాయ భూములకు తక్కువ ధర ఉన్న దగ్గర ఎకరానికి రూ.75,000 వేలుగా ప్రభుత్వం నిర్ధారించింది. వ్యవసాయ భూముల కోసం ప్రస్తుతం ఉన్న విలువలను తక్కువ ధర ఉన్న దగ్గర 50 శాతం, మధ్యరకంగా ఉన్న దగ్గర 40 శాతంగా పెంచారు. అత్యధికంగా ఉన్న దగ్గర 30 శాతం ప్రభుత్వం పెంచింది. ఓపెన్ ప్లాట్ల విషయంలో ఇప్పటివరకు కనిష్ట విలువ చదరపు గజానికి రూ. 100లు ఉండగా, ప్రస్తుతం చదరపు గజానికి రూ.200లకు ప్రభుత్వం పెంచింది. ఓపెన్ ప్లాట్లు తక్కువ ధర ఉన్న దగ్గర 50 శాతం, మధ్యరకంగా ఉన్న భూములకు 40 శాతం అత్యధికంగా ఉన్న దగ్గర 30 శాతంగా ప్రభుత్వం సవరించింది.

ఎక్కువ విలువ ఉన్న దగ్గర 30 శాతంగా

అపార్ట్‌మెంట్‌ల కోసం ప్రస్తుతం ఉన్న అతితక్కువ విలువ ఉన్న దగ్గర ఇప్పుడు ఎస్‌ఎఫ్‌టికి రూ. 1,000లుగా ప్రభుత్వం మార్చింది. తక్కువ విలువ ఉన్న దగ్గర 20 శాతంగా పెంచారు. ఎక్కువ విలువ ఉన్న దగ్గర 30 శాతంగా పెంచారు. కేబినెట్ సబ్ కమిటీ సూచన మేరకు స్టాంప్ డ్యూటీ రేట్లను అమ్మకానికి 6 శాతం నుంచి 7.5 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన మార్కెట్ విలువలు, స్టాంప్ డ్యూటీ రేట్లు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి.

సంతకాలు చేసిన అధికారులు

ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం మార్కెట్ విలువల పెంపు కమిటీల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాల్సి ఉండటంతో ఆ బాధ్యతను ఇటీవల జిల్లా రిజిస్ట్రార్లకు అప్పగించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ఆధారంగా పంచాయతీలు, పట్టణాలు, నగరాల వారీగా విలువలు పెంపునకు ఏర్పాటైన కమిటీలు ఆమోదముద్ర వేశాయి. గ్రామీణ కమిటీలకు ఆర్డీఓలు, పట్టణ కమిటీలకు అదనపు కలెక్టర్ నేతృత్వం వహిస్తుండగా సబ్ రిజిస్ట్రార్లు ఆయా కమిటీలకు కన్వీనర్లుగా వ్యవహారిస్తున్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రాంతాల వారీగా మార్కెట్ విలువలను నిర్ధారిస్తూ కమిటీల్లోని సభ్యులు, చైర్మన్లు, కన్వీనర్లు సంతకాలు చేశారు.

అన్ని గ్రామ పంచాయతీల్లో ఇక నుంచి
రిజిస్ట్రేషన్ చార్జీలు 2 శాతం వసూలు

రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఇక నుంచి రిజిస్ట్రేషన్ చార్జీలు రెండు శాతం వసూలు చేయనున్నారు. దీనికి సంబంధించిన జిఓ 60ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ మంగళవారం విడుదల చేశారు. ఈ చార్జీలు గురువారం నుంచి అమల్లోకి రానున్నాయి. సాధారణంగా పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చార్జీ అరశాతం వసూలు చేస్తారు. కాకపోతే 1.5 శాతం రుసుమును ట్రాన్స్‌ఫర్ డ్యూటీ పేరిట తీసుకుంటారు. గ్రామ పంచాయతీల్లో ట్రాన్స్‌ఫర్ డ్యూటీని వసూలు చేసే అవకాశం లేనందున రెండు శాతం రిజిస్ట్రేషన్ చార్జీలను వసూలు చేయనున్నట్టుగా సమాచారం. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల పంచాయతీల్లో ఇంటి రిజిస్ట్రేషన్ ఖరీదైన వ్యవహారంగా మారుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News