Monday, April 29, 2024

ఎవరెన్ని మాట్లాడినా.. కెసిఆర్‌ను ఆపలేరు

- Advertisement -
- Advertisement -

CM KCR Speech at Sircilla District

 

చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, కార్యశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే
త్వరలో రూ.5లక్షలతో చేనేత బీమా
దళితుల కోసం రూ.45 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నాం
కాళేశ్వరం గంగనే 500 మీటర్లు పైకి తెచ్చినం.. దళితులను పైకి తేలేమా!
వచ్చే నెల నుంచే 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు
నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ భారీగా పెంపు
త్వరలో రెండవ విడత గొర్రెల పంపిణీ
సిరిసిల్లకు మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలు
వేములవాడ ఆలయానికి మహర్దశ
రాజన్న సిరిసిల్ల పర్యటనలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ /రాజన్నసిరిసిల్ల: చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, కార్యశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమే అని… ఎవరెన్ని మాట్లాడినా..కెసిఆర్ ప్రయాణాన్ని ఆపలేరని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు వ్యాఖ్యానించారు. ఎన్నో ఏళ్లుగా కంటోన్న కల.. త్వరలోనే పరిపూర్ణం కాబోతోందని అన్నారు. లక్ష్యం ఏర్పాటు చేసుకుని ఆ లక్ష్యం దిశగా పోతున్నామని, ఎటు చూసినా కాకతీయ, కాళేశ్వరం నీళ్లతో కళకళలాడుతూ.. పచ్చదనంతో పరిఢవిల్లుతూ.. ధా న్యపు రాశులతో విలసిల్లుతోందని సిఎం కెసిఆర్ చెప్పారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. తంగళ్లపల్లి మండలం మండేపల్లిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను సిఎం ప్రారంభించారు. లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందజేశారు. అన్నల దాసు రుచిత శ్రీహరి లబ్దిదారునితో సిఎం కెసిఆర్ స్వయంగా గృహ ప్రవేశం చేయించారు. అనంతరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్, సర్దాపూర్‌లో మార్కెట్ యార్డును, ప్రభుత్వ నర్సింగ్ కాలేజ్ హాస్టల్‌ను కెసిఆర్ ప్రారంభించారు.

సిరిసిల్లలో సకల సౌకర్యాలతో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు. సర్వమత ప్రార్థనలతో కలెక్టర్ కృష్ణ భాస్కర్ కుర్చిలో ఆసీనులయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కెటిఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి, పువ్వాడ అంజయ్‌కుమార్, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఎంఎంఎలు, ఎంఎల్‌సిలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సిఎస్ సోమేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లాలో సకల సౌకర్యాలతో సమీకృత కలెక్టరేట్ ఏర్పాటవడం చాలా సంతోషమని అన్నారు. జిల్లా వాసుల కు అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో కడుతున్న అద్భుత సమీకృత కలెక్టరేట్ నిర్మాణాలకు డిజైన్ చేసింది మన తెలంగాణ బిడ్డ, ఆర్కిటెక్ట్ ఉషారెడ్డి అని, తెలంగాణ ఇంజినీరు గణపతిరెడ్డి అని సిఎం పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పాటు కాక ముందు తెలంగాణ వారికి ఏదీ చేతకాదని దుర్మార్గంగా వాదించేవారని గుర్తుచేశారు. చిత్తశుద్ధి, లక్ష్యశుద్ధి, కార్యశుద్ధి ఉంటే ఏదైనా సాధ్యమేనని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు.

ఎటు చూసినా ధాన్యపు రాశులే…
రాష్ట్రంలో ఎక్కడ చూసినా పచ్చదనం పరిఢవిల్లుతోందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. గత ఆరేళ్లలో తెలంగాణలో వ్యవసాయ రంగంలో అద్భుతాలు జరిగాయని పేర్కొన్నారు. వ్యవసాయం చేసే పరిస్థితులు లేక వలసపోయిన అన్నదాతలు స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారని చెప్పారు. ఇది ఒక అద్భుతమైన మార్పు అని వ్యాఖ్యానించారు. 92 లక్షల టన్నుల ధాన్యం ఎఫ్‌సిఐకి ఇచ్చినం అని, ఎక్కడ చూసినా ధాన్యపు రాశులు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. వలస వెళ్లిన రైతులందరూ వాపస్ వస్తున్నారని తెలిపారు. పాత ఇళ్లను సర్ధుకుంటున్నామని అన్నారు. రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టి గొర్రెలు పంపిణీ చేస్తున్నామని, ఇప్పటికే నాలుగు వేల కోట్లతో గొర్రెల పంపిణీ చేశామని చెప్పారు. ఇంకో నాలుగు వేల కోట్లతో త్వరలోనే రెండవ విడతలో గొర్రెల పంపిణీ చేయనున్నామని తెలిపారు. తెలంగాణ రాకముందు అధ్వానంగా ఉన్న మత్యకారుల పరిస్థితి… ఇప్పుడు మెరుగైందని చెప్పారు. తెలంగాణ తన పునాదిని తాను బలంగా చేసుకుంటోందని సిఎం వ్యాఖ్యానించారు.

57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పింఛన్లు
గతంలో ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధాప్య పింఛన్ ఇస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు.. వచ్చే నెల నుంచి 57 ఏళ్లు నిండిన వారికి వృద్దాప్య పింఛన్లు ఇస్తామని ప్రకటించారు. గోదావరినే 500 మీటర్లు పైకి తెచ్చా…ఎస్‌సిలను పైకి తేలేమా అని సిఎం అన్నారు. ఎస్‌సిల కోసం రాబోయే నాలుగేళ్లలో రూ.45 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నామని కెసిఆర్ వెల్లడించారు.

వచ్చే విడతలో సిరిసిల్లకు వైద్య కళాశాల
కరోనా మహమ్మారితో ప్రజలందరూ ఇబ్బంది పెడుతున్నారని సిఎం కెసిఆర్ అన్నారు. రూ.10 వేల కోట్లతో వైద్య వ్యవస్థను పెంచాలని నిర్ణయించామని చెప్పారు. అందులో భాగంగానే మెడికల్ కాలేజీలను నిర్మిస్తున్నామని తెలిపారు. రామారావు ఏమి అడగా చెప్పి, ఇక్కడికి వచ్చినంక మెడికల్ కాలేజీ దుకాణం పెట్టిండని చెప్పారు. 100 శాతం రాజన్న సిరిసిల్లకు మెడికల్ కాలేజీ వస్తుందని సిఎం ప్రకటించారు. అయితే ఈ సంవత్సరం కాకుండా వచ్చే విడతలో రాజన్న సిరిసిల్లకు కచ్చితంగా వైద్య కళాశాల వస్తుందని అన్నారు. జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తామని పేర్కొన్నారు. నర్సింగ్ విద్యార్థులకు స్టైఫండ్ పెంచుతున్నామని ప్రకటించారు. మొదటి సంవత్సరం నర్సింగ్ విద్యార్థులకు రూ.1,500ల నుంచి రూ.5 వేలు, రెండవ సంవత్సరం విద్యార్థులకు రూ.1,700ల నుంచి రూ.6 వేలు, మూడవ సంవత్సరం విద్యార్థులకు రూ.1,900ల నుంచి రూ.7 వేలు స్టైఫండ్ ఇస్తామని తెలిపారు.

నర్సింగ్ విద్యార్థులు బాగా చదువుకుని సమాజానికి సేవ చేయాలని తెలిపారు. రాజరాజేశ్వరి జలాశయం దగ్గర 243 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, దానిని వెంటనే టూరిజం శాఖకు అప్పగిస్తామని వెల్లడించారు. దానిని వెంటనే టూరిజం ప్యాకేజీ చేస్తారని తెలిపారు. అనంతగిరి గ్రామం దగ్గర గొప్ప 240 ఎకరాల ప్రభుత్వం స్థలంతో పాటు 40 ఎకరాల ఐల్యాండ్ కూడా ఉందని పేర్కొన్నారు. ఈ రెండింటినీ కలిసి టూరిజం కార్పోరేషన్‌కు అప్పగించి ప్రత్యేకంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని అన్నారు. త్వరలోనే రాజన్న ఆలయం స్థాయిని పెంచేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. వేములవాడ ఆలయాన్ని అద్భుతమైన కళాఖండంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. సిరిసిల్ల కమ్యూనిటీ హాలు కోసం రూ.5 కోట్లు మంజూరు చేస్తున్నా అని సిఎం కెసిఆర్ ప్రకటించారు.

మిషన్ కాకతీయ వారి ఆలోచనే…
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డాక మొదలు పెట్టిన తొలి కార్యక్రమం మిషన్ కాకతీయ అని సిఎం పేర్కొన్నారు. మిషన్ కాకతీయ అనే పేరు తెలంగాణ వ చ్చాక పెట్టింది కాదని, ఆ పేరు పెట్టిన ఇద్దరు మహానుభావులు స్వర్గస్తులయ్యారని తెలిపారు. ఒక రు ప్రొఫెసర్ జయశంకర్ కాగా, మరొకరు ఆర్.విద్యాసాగర్ అని చెప్పారు. వారితో కలిసి తెలంగాణ గు రించి పరితపిస్తున్న సమయంలో అర్ధరాత్రనక, అపరాత్రనక.. తెలంగాణ గురించి చర్చించేవాళ్లమని, ఆ సమయంలో ఇద్దరు చెప్పిన మాటల స్ఫూర్తితోనే మిషన్ కాకతీయకు శ్రీకారం చుట్టామని తెలిపారు.

భూగర్భజలాలు పెరిగాయి
రాష్ట్రంలో గత రెండేళ్లలో 135 శాతం ఎక్కువ వర్షాలు పడ్డాయని సిఎం కెసిఆర్ తెలిపారు. మిషన్ కాకతీయలో చేపట్టిన ఏ ఒక్క చెరువు గట్టు తెగలేదని అన్నారు. చెరువులన్నీ కళకళలాడుతున్నాయని చెప్పారు. పొలాలకు నీళ్లందుతున్నాయని అన్నారు. భూగర్భజలాలు మీటర్లకు మీటర్లే పెరుగుతున్నాయంటే దానికి కారణం మిషన్ కాకతీయనే అని పేర్కొన్నారు. రూ.15 వేల కోట్లు అయినా కాళేశ్వరం కడతానని అసెంబ్లీలో చెప్పానని….ఇప్పుడు అది సుసాధ్యం చేసి ప్రశ్నించిన వాళ్లకు సమాధానం చెప్పామని కెసిఆర్ వ్యాఖ్యానించారు. రాబోయే కొద్ది రోజుల్లోనే కరీంనగర్ సజీవ జలధారగా తయారవుతుందని చెప్పినప్పుడు… ఎవరూ నమ్మలేదని, ఇప్పుడు అది నిజమైందని సిఎం అన్నారు. ఎగువమానేరు నుంచి మధ్యమానేరు, కరీంనగర్, మంథని వద్ద గోదారిలో కలిసే సుమారు 175 కిలోమీటర్లు వరకు సజీవ జలధారగా మారిందని చెప్పారు. ఏప్రిల్‌లో అప్పర్ మానేరు నిండుతుందని ఎవరూ అనుకోలేదని తెలిపారు. వరద కాలువతో బాల్కొండ నుంచి చొప్పదండి వరకున్న 110 కిలోమీటర్ల వరకు సాగు నీళ్లందుతున్నాయని అన్నా రు.

కెటిఆర్ అడిగిన చెక్‌డ్యాంల మంజూరు
పాలమూరు ప్రాజెక్ట్ పూర్తయితే.. ఆ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. మంత్రి కెటిఆర్ అడిగిన చెక్‌డ్యామ్‌లను మంజూరు చేస్తున్నామని తెలిపారు. మూలవాగుపై 12 చెక్‌డ్యాంల నిర్మాణానికి అనుమతులు మంజూ రు సిఎం ఆదేశాలు జారీ చేశారు.

మస్తు పైసలేసినా…
గోదావరిలో తాను వెసినన్ని నాణేలు ఎవరు వేసి ఉండరని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. అటు వెళ్లేటప్పుడు.. ఇట్టు పోయేటప్పుడు… అమ్మా గోదారమ్మా… మా ఊర్లళ్లకు ఎప్పుడు వస్తావమ్మా అని వేడుకునే వాడినని తెలిపారు. నీళ్లల్ల నాణేలేస్తే పుణ్యమని చిన్నప్పుడు తమ పెద్దలు చెప్పారని..అందుకే మొక్కి పైసలేసేవాడినని పేర్కొన్నారు. ఇప్పుడు అందుకేనేమో గోదారమ్మ మన తెలంగాణను ముద్దాడుతోందని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు.

రైతు బీమా మాదిరే ‘చేనేత’కు బీమా
గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా ఏవిధంగానైతే రూ.5 లక్షలు బీమా అందజేస్తున్నామో అదేవిధంగా చేనేత కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందేలా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వెల్లడించారు. రైతు బీమా మాదిరే రాబోయే రెండు మూడు నెలల్లో చేనేత కార్మికులకు కూడా బీమా ప్రకటిస్తామని అన్నారు. కార్మికుడు చనిపోతే ఆ కుటుంబం బజారున పడకుండా, వాళ్లు పరేషాన్ కాకుండా వాళ్లకొక ఆధారంగా ఉంటుందని చెప్పారు.ఇది ఆ కుటుంబానికి కొంత ఊరట ఇస్తుందని చెప్పారు. చేనేత విషయంలో, మరమగ్గాల విషయంలో కూడా కొంత డబ్బును కార్పస్ ఫండ్‌గా పెట్టి ప్రభుత్వం ఓ కార్యక్రమం చేపడుతుందని అన్నారు.

కెసిఆర్ ఛలోక్తులు

రామారావు ఏమీ అడగనని చెప్పి అడిగిండు
రామారావు ఏమి అడగా అని చెప్పి, ఇక్కడికి వచ్చినంక మెడికల్ కాలేజీ దుకాణం పెట్టిండని ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రి కెటిఆర్‌ను ఉద్దేశించి అన్నారు. తమ జిల్లాకు మెడికల్ కాలేజీ కావాలని రామారావు అడిగారని,వంద శాతం రాజన్న సిరిసిల్లకు మెడికల్ కాలేజీ వస్తుందని సిఎం ప్రకటించారు. అయితే ఈ సంవత్సరం కాకుండా వచ్చే విడతలో రాజన్న సిరిసిల్లకు కచ్చితంగా వైద్య కళాశాల వస్తుందని అన్నారు. జిల్లాకు ఇంజనీరింగ్ కళాశాలను మంజూరు చేస్తామని పేర్కొన్నారు.

నమస్తే పెట్టి పంపిస్తరా.. అన్నం పెడతరా
తమకు నమస్తే పెట్టి పంపిస్తరా లేక అన్నం పెట్టి పంపిస్తరా అని కెసిఆర్ అక్కడి ప్రజలకు అడగడంతో ఒక్కసారి సమావేశంలో నవ్వులు పూశాయి. తనకు గతంలో ఎదురైన ఓ సంఘటన సిఎం కెసిఆర్ గుర్తు చేసుకున్నారు. గతంలో ఓసారి పనిలో పడి తాము అన్నం విషయం మరిచిపోయామని, నాలుగు గంటల వరకు తమతో పనిచేయించుకుని తమకు నమస్తే పెట్టి పంపించామని అన్నారు. అన్నం విషయంలో వాళ్లు మరిచిపోయిన్రు..మేం మర్చిపోయామని, మేం కారెక్కిన తర్వాత మాకు గోకుతాందని చెప్పారు. ఓ గొల్లతల్లి మంచిగ పెరుగన్నం పెట్టిందని కడుపునింపిదని చెప్పారు. వరంగల్‌లో రఘునాథపల్లి దగ్గర యశ్వాంతాపురం అనే ఒక వాగు దగ్గర తమకు ఓ గొల్లామే పెరుగన్న పెడితే తినొచ్చామని గుర్తు చేసుకున్నారు.

సిరిసిల్లలో సైకిల్ మీద తిరిగినా, మోటర్ సైకిల్ మీద తిరిగినా…
సిరిసిల్ల రోడ్ల మీద తిరుగుతుంటే నాకు కడుపు నిండినట్లుగా ఉందని సిఎం కెసిఆర్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదే సిరిసిల్లలో నేను పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అనేక రూపాలలో తిరిగానని అన్నారు. సిరిసిల్లలో సికిల్ మీద తిరిగినా, స్కూటర్ మీద తిరిగినా, నడిచి తిరిగినా అని చెప్పారు. సిరిసిల్లలో చాలా ప్రాంతాలలో తమకు బంధువులు ఉంటారని, అందుకే ఇక్కడికి వచ్చే వాడినని అన్నారు. ఈ ప్రాంతంతో నాకు అనుబంధం ఉందని చెప్పారు. అప్పుడు బస్సులు ఉండేవి కాదు..రోడ్లు కూడా సరిగ్గా ఉండేవని కాదని అన్నారు. సిరిసిల్ల చాలా చిన్న కుగ్రామం కింద ఉండేదని, ఇప్పుడు సిరిసిల్లలో రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని అన్నారు. ఈ ప్రగతి మరింత పరుగులు పెట్టాలని ఆకాంక్షించారు.

పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని అకుంఠిత దీక్షతో చేయాలి
రాష్ట్రంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిని, హరితహారం కార్యక్రమాలను అకుంటిత దీక్షతో చేయాలని ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. గతంలో చెట్లు కొట్టుడు తప్ప పెట్టుడు లేదని విమర్శించారు. హరితహారం కార్యక్రమం ఒక ఉజ్వలమైన కార్యక్రమం అని అన్నారు. ముందు తరాలకు మనం ఇచ్చే గొప్ప ఆస్తి ప్రకృతి సంపద, జల సంపద అని పేర్కొన్నారు. 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే 12,769 ట్రాక్టర్లు ఉన్నాయని, గ్రామాలలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. అద్భుతమైన ఆకుపచ్చ తెలంగాణ కోసం అందరూ కృషి చేయాలని చెప్పారు. ఈ నెల 10 తర్వాత ఆకస్మిక తనిఖీలు చేస్తానని, ఎక్కడ ఏ పనులు చేశారో పరిశీలిస్తానని సిఎం కెసిఆర్ తెలిపారు.

కత్తెర మరిచిన అధికారులు… సిఎం అసహనం
సిరిసిల్ల పర్యటనలో అధికారుల తీరుతో సిఎం కెసిఆర్ తీవ్ర అసహనానికి గురయ్యారు. కత్తెరతో చేయాల్సిన రిబ్బన్ కటింగ్‌ను చేత్తోనే చేశారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల శంకుస్థాపన, గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేద్దామనుకునే సరికి కత్తెర లేకుండా పోయింది. అందరూ కత్తెర… కత్తెర.. అంటూ అటూ ఇటూ చూడడం మొదలు పెట్టాడంతో కెసిఆర్ కొంత అసహనానికి గురయ్యారు. వెంటనే సిఎం కెసిఆర్ తనే చేతితో రిబ్బన్‌ను లాగారు. అనంతరం లబ్దిదారులతో కలిసి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు.

CM KCR Speech at Sircilla District

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News