Monday, April 29, 2024

దద్ధరిల్లిన తెలంగాణ అసెంబ్లీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : తెలంగాణ ఆర్ధిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేసే అంశంపై జరిగిన చర్చ సందర్భంగా అసెంబ్లీ దద్ధరిల్లింది. ఈ నేపథ్యంలో విపక్షాలకు సిఎం రేవంత్ రెడ్డి గట్టి కౌంటరిచ్చారు. శ్వేతపత్రంపై అక్బరుద్దీన్ ఒవైసీ అనుమానం వ్యక్తం చేశారని తాము వాస్తవ పరిస్ధితులను ప్రజల ముందు వుంచే ప్రయత్నం చేశామని చెప్పారు. శ్వేతపత్రం విడుదలపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్వేతపత్రం ఎవరినో కించపరచడానికి కాదని, తాము ఎవరినీ నిందించే ప్రయత్నం చేయలేదన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఆలోచించడం లేదని స్పష్టం చేశారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ పదేళ్లు తెలంగాణ కోసం పని చేసిన అధికారులను అవ మానించేలా హరీశ్ రావు మాట్లాడారని విమర్శించారు. ప్రభుత్వం సరైన ఉద్ధేశ్యంతో నిధులను ఖర్చు చేసిందా? లేదా? అనేది కాగ్ చెబుతుం దన్నారు. అయితే ఈ శ్వేతపత్రం మేమిచ్చిన హామీలను ఎగవేసేందుకు కాదని స్పష్టం చేశారు.

బిఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన ప్రారంభంలో ఆర్‌బిఐ వద్ద 303 రోజుల మిగులు నిధులు ఉండేవని, ఈ పదేళ్లలో ఏకంగా ముప్పై రోజులకు పడిపోయిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రుణాలు పుట్టని పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆదాయం, అవసరాలకు సంబంధించి ఆర్‌బిఐ సమాచారం ఇస్తుందని తెలిపారు. ఆర్‌బిఐ, కాగ్ సమాచారం తీసుకున్నామన్నారు. తెలంగాణను బలమైన రాష్ట్రంగా నిలవడమే తమ లక్ష్యమన్నారు. సిద్ధాంత విభేదాలు ఉన్నప్పటికీ ప్రధాని నరేంద్రమోదీని కలిసేందుకు తాను కిషన్ రెడ్డిని అడిగానని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మేం ఏం చేయాలనుకున్నా దానిని సభ ముందు పెడతామని హామీ ఇచ్చారు. తెలంగాణను ప్రపంచంతో పోటీ పడేలా చేయాలన్నదే తమ లక్ష్యమ న్నారు.
అఖిలపక్షం సలహాలు తీసుకుంటాం
సచివాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చామని, త్వరలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే ఎంఎల్‌ఎలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. శ్వేత పత్రాన్ని వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన అవసరంలేదన్నారు. ‘మా ప్రభుత్వంలో ఏకపక్ష నిర్ణయాలు ఉండవు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతీ నిర్ణయానికి ముందు అఖిలపక్షం సలహాలు, సూచనలు తీసుకుంటాం‘- అని సిఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News