Friday, April 26, 2024

భారీ స్కామ్.. అయోధ్య రాముడి పేరిట అక్రమం

- Advertisement -
- Advertisement -

హే రామ్ …భారీ స్కామ్
అయోధ్య రాముడి పేరిట అక్రమం
మార్చి 18న రెండుకోట్లకు అమ్మిన భూమి
అదే రోజున రూ 18 కోట్లకు కొనుగోలు
రాముడి ధర్మకర్తల మండలికి అపకీర్తి
భక్తుల చందాల డబ్బులతో భారీ దందా?
న్యూఢిల్లీ/అయోధ్య: రాములోరి భూములలో అవినీతి దందా చివరికి అయోధ్యలోనూ దర్శనమిచ్చింది. అత్యంత ప్రతిష్టాత్మకంగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి బాధ్యత వహించే శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు నిర్వాకంలో సాగిన భూమి కొనుగోలు వ్యవహారం ఇప్పుడు తీవ్రస్థాయి అవినీతికథకు దారితీసింది. భూముల ధరలకు రెక్కలొచ్చిన అయోధ్యలో 12,080 చదరపు మీటర్లస్థలాన్ని రామమందిర ట్రస్టు అత్యంత భారీ రేటు రూ 18.5 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ మొత్తం వ్యవహారం వెనుక భారీస్థాయి భూ భాగోతం సాగిందని కాంగ్రెస్ పార్టీ మండిపడింది. సంబంధిత భూమి కొనుగోలు అంతకు ముందటి అమ్మకాలకు సంబంధించి వెలువడ్డ వార్తలను పరిగణనలోకి తీసుకుని సుప్రీంకోర్టు దీనిపై న్యాయమూర్తి ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రణదీప్ సూర్జేవాలా సోమవారం దేశ రాజధానిలో విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఓ వైపు పవిత్ర ధార్మిక పద్ధతులలో రామాలయ నిర్మాణం జరగాల్సి ఉంది. ఇందుకు ఏర్పడిందే తీర్థ క్షేత్ర మండలి. అయితే ఈ భూమికి ఇంత ధర పెట్టి ఎందుకు కొనుగోలు చేశారు? దేశవ్యాప్తంగా ఆలయ నిర్మాణానికి భక్తుల నుంచి సేకరించిన చందాలల ద్వారా వచ్చిన డబ్బును ఈ విధంగా అక్రమ రీతిలో వాడుతారా? దీని వెనుక భారీ స్కామ్ జరిగిందని దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇచ్చుకోవల్సి ఉందని కాంగ్రెస్ ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఆయన దీనిపై పెదవి విప్పకపోతే దీని వెనుక ఈ జాగా క్రయదార్లకు ఆయన ఆపన్న హస్తంతో కూడిన రక్షణ ఉండాలనుకోవల్సి ఉంటుందా? అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.

ఈ ల్యాండ్ కొనుగోళ్ల పత్రాలను పరిశీలించారు. ఈ మేరకు చూస్తే మార్చి 18వ తేదీన అయోధ్యలోని ఈ స్థలాన్ని కుసుమ్ పాఠక్ అనే వ్యక్తి రూ రెండు కోట్లకు రవితివారీ, సుల్తాన్ అన్సారీలకు అమ్మేశారు. ఇది జరిగిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇదే జాగాను ట్రస్టు వారు రూ 18.5 కోట్లకు కొనుగోలు చేశారని సంబంధిత డీడ్స్‌ను బట్టి తేలుతోందని రణదీప్ సూర్జేవాలా తెలిపారు. ట్రస్టు సభ్యులు అయిన అనిల్ మిశ్రా బిజెపి నేత అని, ఇక అయోధ్య మాజీ మేయర్ అయిన హృషికేష్ ఉపాధ్యాయ ఈ డీల్ విషయంలో పత్రాలపై సంతకాలు చేశారని, ట్రస్టుకు విరివిగా అందిన లక్షల కోట్ల రూపాయలను ఈ విధంగా ఇన్ని కోట్ల అత్యధిక రేటుకు కొనుగోలు చేయడం వెనుక ఎవరి పాత్ర ఉంది? ఏ స్థాయిలో దాదాపు తొమ్మిదిరెట్లు పైబడి ఎక్కువ ధరకు ఈ భూమిని కొంటారు? క్షణాల వ్యవధిలోనే అమ్మకాలు కొనుగోళ్లు ఏ విధంగా జరిగాయి? ఇంత ధనం అందుకున్న వ్యక్తులకు ట్రస్టుతో ఉన్న లోపాయికారి సంబంధాలు ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. పాఠక్ పేరిట ఉన్న స్థలం తివారీ, అన్సారీలకు వెళ్లాయి. ఇది రామబాణంగా వెంటనే అత్యధిక ధరలతో ట్రస్టుకు చేరింది. దేశవ్యాప్తంగా అచంచల విశ్వాసం, జనం మనోభావనలకు ప్రతీక అయిన శ్రీరాముడి పేరిట వెలిసిన ట్రస్టు ధర్మానికి కట్టుబడి ఉండాల్సిన ధర్మకర్తల మండలిని సుప్రీంకోర్టు గత ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన గురుతర బాధ్యతలను కట్టబెడుతూ ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని ప్రధాని మోడీ విస్మరించారా? అని కాంగ్రెస్, ఆప్ ఇతర పార్టీలు నిలదీస్తున్నాయి. జరిగిన దానిలో మహాతప్పిదం కాదు మహా నేరం అక్రమం చోటుచేసుకుందని విమర్శలు వెల్లువెత్తాయి. ఇది నేరం కాదు పాపం అని కాంగ్రెస్ విమర్శించింది. ట్రస్టు ప్రధాన కార్యదర్శి అయిన చంపత్ రాయ్ ద్వారానే ఈ భూమి కొనుగోలు జరిగిందని కాంగ్రెస్ ఆరోపించింది. ట్రస్టు ఏర్పాటు కర్త ప్రధాని మోడీ. ఆయన ఇప్పటివరకూ దీనిపై ఏమి మాట్లాడటం లేదని, దీని వెనుక ఉన్న మర్మం ఏమిటని సూర్జేవాలా ప్రశ్నించారు. రాముడి పేరిట బిజెపి ఇంతటి మహాపరాధం చేస్తుందా? అని నిలదీశారు. ఇప్పటికైతే ఈ విలువతో ఈ ల్యాండ్ కొనుగోళ్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరి ఇటువంటి విలువల్లేని పద్థతులలో ఎన్ని భూములు కొన్నారు? ఈ క్రమంలో ఎవరెవ్వరికి భారీ లాభాలు కట్టబెట్టారు? తెలియాల్సి ఉంది.
ప్రజల విశ్వాసానికి పెను దెబ్బ ః ప్రియాంక
భక్తుల నుంచి సేకరించిన భారీ విరాళాలను ఈ విధంగా అక్రమంగా వెచ్చిస్తారా? ఇదెక్కడి న్యాయం? ధర్మం అని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ విమర్శించారు. మనో విశ్వాసాలకు ఈ వ్యవహారం అవమానకరం అన్నారు. కోట్లాది మంది ఎంతో ఇష్టంగా తమ కానుకలను భగవంతుడి పాదాలకు సమర్పించారు. ఎంతో భక్తభావన ఇందులో ఇమిడి ఉంది. ఇటువంటి ప్రక్రియను ఈ విధంగా దెబ్బతీయడం ఎంతవరకు ధర్మం అన్పించుకుంటుంది? ఇది మహాపాపం. భక్తుల విశ్వాసానికి ముష్టిఘాతం అని ప్రియాంక విమర్శించారు.
రామాలయంతో పరివార్ వ్యాపారం
అపార భక్తివిశ్వాసాలకు ప్రతీక అయిన రాముడి పేరిట వెలిసిన రామజన్మభూమి ట్రస్టు ద్వారా రాముడిని అడ్డుపెట్టుకుని బిజెపి ఆర్‌ఎస్‌ఎస్‌లు వ్యాపారం నిర్వహిస్తున్నాయని సుహల్దేవ్ భారతీయ సమాజ్‌పార్టీ ( ఎస్‌బిఎస్‌పి) అధ్యక్షులు ఓమ్ ప్రకాశ్ రాజ్‌భర్ ఆరోపించారు. ట్రస్టును వారు వ్యాపార సాధనంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. 1.208 హెక్టార్ల భూమిని ట్రస్టు సారధిలో ఒకరు అయిన చంపత్ రాయ్ అయోధ్యలోని బాగ్ బిజైసీ గ్రామంలో రెండు కోట్లకు కొన్నారు. వెంటనే దీనికి ట్రస్టు నుంచి అతి భారీ మొత్తంలో కొనుగోళ్లు జరిగాయి. అక్కడ కొన్న వ్యక్తి ఇప్పుడు కొనుగోళ్లకు దిగిన ట్రస్టులోని పెద్ద మనిషి అని దీని వెనుక ఉన్న విషయం బహిరంగ రహస్యం అయిందని విమర్శించార. ఇది పూర్తిగా మనీలాండరింగ్ వ్యవహారంగా మారిందని సమాజ్‌వాది పార్టీ నేత పవన్ పాండే ఆరోపించారు. వెంటనే దీనిపై సిబిఐ దర్యాప్తు, ఇడి నుంచి విచారణలకు ఆదేశించి కేంద్రం తన నిజాయితీని చాటుకుని తీరాలని ఆప్ నేత సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఇక్కడి వ్యవహారం అంతా కూడా ఏకంగా ప్రధాని మోడీకి తెలిసే స్థానికంగా ఆదిత్యానాథ్ ఇతరుల ప్రమేయంతోనే సాగిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఈ స్కామ్‌పై ట్రస్టు వెంటనే వివరణ ఇచ్చుకోవాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి , ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా డిమాండ్ చేశారు.

Congress allege scam in Ayodhya land deal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News