Saturday, April 27, 2024

రాహుల్ సరికొత్త ‘గ్యారంటీ’

- Advertisement -
- Advertisement -

కేంద్రంలో ‘ప్రభుత్వం మారగానే&’ ప్రజాస్వామ్యం విధ్వంసకులపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర చర్య తీసుకుంటుందని పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం వాగ్దానం చేశారు. ఇది తన ‘గ్యారంటీ’ అని ఆయన ప్రకటించారు. పార్టీ రూ. 1800 కోట్ల మేరకు ఆదాయపు పన్ను (ఐటి) నోటీస్ అందుకున్న అనంతరం రాహుల్ ఆ వాగ్దానం చేశారు. ఐటి నోటీస్‌ను ‘పన్ను ఉగ్రవాదం’గా పార్టీ అభివర్ణించింది. ఐటి శాఖ తాజా పన్ను నోటీస్ 2017-18 నుంచి 2020—21 వరకు మదింపు సంవత్సాలకు సంబంధించినది. దానిలో జరిమానా, వడ్డీ కూడా చేరి ఉన్నాయి. ‘ప్రభుత్వం మారినప్పుడు ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తున్నవారిపై కచ్చితంగా చర్య ఉంటుంది. ఎవ్వరూ మళ్లీ ఇటువంటిది చేసేందుకు ధైర్యం చేయలేని రీతిలో చర్య ఉంటుంది. ఇది నా గ్యారంటీ’ అని రాహుల్ ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలిపారు. ఐటి అధికారులు రూ. 200 కోట్ల జరిమానా విధించి, పార్టీ నిధులను స్తంభింపచేసిన తరువాత కాంగ్రెస్ ఇప్పటికే నిధుల కొరత ఎదుర్కొంటున్నది.

పార్టీకి హైకోర్టు నుంచి ఎటువంటి ఉపశమనమూ లభించలేదు. లోక్‌సభ ఎన్నికలకు సరిగ్గా కొన్ని వారాల ముందు కాంగ్రెస్ ఈ విషయమై సుప్రీం కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఐటి వంటి కేంద్ర శాఖలు బిజెపి ప్రేరణతో పని చేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. కాగా, పన్ను డిమాండ్ల రద్దుకు గాను సుదీర్ఘ న్యాయ పోరాటానికి కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది. బిజెపికి గత కొన్ని సంవత్సరాలలో వేలాది మంది నుంచి విరాళాలు అందాయని, వారి ఆదాయపు పన్నును కూడా లెక్కించవలసి ఉంటుందని కాంగ్రెస్ కోశాధికారి అజయ్ మాకెన్ అన్నారు. బిజెపి కూడా ఆదాయపు పన్ను చట్టాలను బాగా ఉల్లంఘించిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ విలేకరులతో చెప్పారు. బిజెపికి రూ. 4617.58 కోట్ల మేరకుపన్ను డిమాండ్ జారీ చేయాలని ఐటి శాఖకు రమేష్ విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు 24ఎ ఫారమ్ నింపవలసి ఉంటుందని, అందులో దాతల పేర్లు, చిరునామాలు వంటి మౌలికమైన, ముఖ్యమైన రెండు రకాల సమాచారం ఇవ్వవలసి ఉంటుందని అజయ్ మాకెన్ సూచించారు. ఎన్నికల కమిషన్‌కు బిజెపి ఇచ్చిన వివరాలను మేము విశ్లేషించాం. ఆ పార్టీ ప్రతి ఏడాది తప్పిదం చేస్తోంది’ అని మాకెన్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News