Monday, May 6, 2024

మోడీ పాలనలో విరోధాభాసలు

- Advertisement -
- Advertisement -

Contradictions in Modi rule

లక్నోలో రూపొందించిన సుందరమైన పేటికలలో అరుదైన అత్తరు సీసాలను ఫ్రెంచి అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌కు భారత ప్రధాని మోడీ బహుమతిగా ఇచ్చారు అని ది టైమ్స్ ఆఫ్ ఇండియా, జూన్ 29, 2022 న ఒక వార్త ప్రచురించింది.
‘ఇదిగో ఇంకా రక్తపు వాసన ఉంది. అరేబియాలోని సుగంధద్రవ్యాలన్నీపూసినా ఈ చేతినిసుపరిమళ భరితం చేయలేవు‘ (షేక్ స్పియర్: మక్ బెత్).

పై రెండు అంశాలను ఒకే చోట చదివితే అవి మోడీ కపట రాజకీయాలను బొమ్మకట్టి వివరిస్తాయి. విదేశాలలో సువాసన గల పరిమళ ద్రవ్యాలను పంచడం, దేశంలోనేమో ముస్లింలు, దళితులు, పేదలపై బుల్డోజర్ కూల్చివేతలతో ‘రక్తపు వాసన’ వ్యాప్తి చేయడం. షేక్స్పియర్‌ని కొద్దిగా మార్చి, ‘లక్నోలోని సుగంధ ద్రవ్యాలన్నీ వాడినా అతని చేతుల రక్తపు వాసన పోదు అని మనం అనవచ్చు. 2002లో గుజరాత్‌లో ముఖ్యమంత్రిగా ఆయన పాలనలో జరిగిన ముస్లిం వ్యతిరేక మారణహోమంలో మరణించిన వారి రక్తపు మరకలు, ఆ వాసన ఇంకా తొలగిపోలేదు. జర్మనీలో జరిగిన జి- 7 సదస్సులో మోడీ తాజా ప్రదర్శన ఆయన ద్వంద్వ ముఖ రాజకీయాలకు మరో ఉదాహరణ.జి -7 ఇతర నాయకులతో కలిసి, అతను’ ప్రజాస్వామ్యాన్ని స్థిరీకరించడం, స్వేచ్ఛాయుత నిష్పాక్షిక ఎన్నికలకు కట్టుబడి వుండటం, భావప్రకటనా స్వేచ్ఛ ను రక్షించడం, లింగ సాధికారతను సాధించడం వంటి లక్ష్యాలను సమర్థిస్తూ ఒక ప్రకటనపై సంతకం చేశారు.

ఆ సమయంలో, దేశంలో అతని పోలీసులు తీస్తా సెతల్వాడ్, ముహమ్మద్ జుబేరి వంటి భావప్రకటనా స్వేచ్ఛ ప్రతిపాదకుల వెంటపడి వేధిస్తున్నారు. విదేశీ ప్రముఖులకు తనను తానుగొప్పగా చూపుకోవటానికి అంతర్జాతీయ వేదికలపై ఆయన చేసే ప్రయత్నాలు నవ్వు పుట్టిస్తాయి. భారతదేశంలో తను వెదజల్లిన దుర్గంధం, విదేశాలకు వ్యాప్తి చేయాలనుకుంటున్న సువాసనను మింగివేస్తుంది.

ఇటీవల పాలక బిజెపి అధికార ప్రతినిధులు మహమ్మద్ ప్రవక్తకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పశ్చిమాసియా ఇస్లామిక్ దేశాలలోఆగ్రహావేశాలకు దారితీశాయి. నరేంద్ర మోడీ పాలనలో గత కొన్నేళ్లుగా, భారతదేశంలోని ప్రవక్త అనుచరులు తమ మతానికి వ్యతిరేకంగా విద్వేష ప్రచారానికి, సంఘ్ పరివార్ గూండాల నుండి భౌతిక హింసకు కూడా గురవుతున్నారు. ఇప్పటి వరకు పశ్చిమాసియా ఇస్లామిక్ రాజ్యాల పాలకులు భారతదేశంలోని తమ సహ- మతస్థులపై జరుగుతున్న ఈ దురాగతాలపై శీతకన్ను వేశారు. మతపరమైన బాధ్యతల కంటే వాణిజ్య సంబంధాల లాభదాయకతకు వారు ప్రాముఖ్యత నిచ్చారు. కాని వారు తమ పవిత్ర ప్రవక్తపై దాడి జరిగినప్పుడు, మౌనంగా ఉండలేరు. మౌనం వహిస్తే వారు తమ సొంత ముస్లిం ప్రజలలో తమ పట్టును కోల్పోయేవారు.

అయితే, మోడీ పార్టీ నాయకుల దురుసు ప్రవర్తనకు వ్యతిరేకంగా ఇస్లామిక్ రాజ్యాలు చేపట్టిన తాజా నిరసన ఒక ఉదాహరణ మాత్రమే. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్, అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు కొన్నిఅంతర్జాతీయ సంస్థ లు, ప్రఖ్యాత విద్యావేత్తలు గత కొన్నేళ్లుగా ఆయన పనితీరును విమర్శిస్తున్నారు. 2002లో గుజరాత్‌లో ముస్లింల ఊచకోత తర్వాత ఆయనను అమెరికాలోకి ప్రవేశించడాన్ని నిషేధించినప్పుడు అతను ప్రపంచ రాజకీయాల్లో ఒక వక్రామార్కునిగా పరిగణించబడిన విషయం ఎవరూ మరిచిపోలేదు. మానవ హక్కుల ఉల్లంఘన, చెత్తాచెదారం, దుర్వాసనతో కూడిన దేశంగా ప్రపంచవ్యాప్తంగా అపఖ్యాతిని మోసింది భారతదేశం. ఐక్యరాజ్యసమితి, ఇతర ప్రపంచ సంస్థలు విశ్వవ్యాప్తంగా నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా అంచనా వేసిన మోడీ ప్రభుత్వ రికార్డును పరిశీలిస్తే, దాని పనితీరు అత్యల్పస్థాయికి పడిపోయినట్లు మనకు తెలుస్తుంది. మోడీ పాలనలో ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీల హత్యలు, పౌరహక్కులు, ప్రజాస్వామిక హక్కులను అణచివేయడం వంటి దుర్మార్గపు రోజువారీ నివేదికలతో ఈ అంతర్జాతీయ సంస్థల దర్యాప్తు ప్రతినిధులు ముక్కున వేలేసుకుంటున్నారు.

పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి కింద పన్ను విధింపు, సిఎఎ కింద పౌరులపై వివక్ష వంటి దుష్ప్రభావ చర్యల నుంచి భారీగా దుర్వాసన వెదజల్లే చెత్తను భారత ప్రధాని తన ప్రజలపై పడేశారు. సైన్యంలో తాత్కాలిక ప్రాతిపదికన యువకులను నియమించడానికి ప్రవేశపెట్టిన అగ్నిపథ్, అగ్నివీర్ (అగ్గివీరులు) విధానం మోడీపైనే బూమరాంగ్ అయ్యింది. సైనిక ఉద్యోగాల కోసం యువ ఔత్సాహికులు అదే అగ్నిని (ఫైర్ పవర్) ఆశ్రయించారు. రిక్రూట్‌మెంట్లో ఈ కొత్త పద్ధతుల ద్వారా వచ్చిన అడ్డంకులతో విసుగు చెందివారు అనేక చోట్ల రైలు బోగీలు, ప్రభుత్వవాహనాలు, పాలకరాజకీయ నాయకుల ఇళ్ళు, సంస్థలు ఇతర చిహ్నాలను పరుశురామ ప్రీతి చేశారు. ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచిక ప్రకారం భారతదేశం సగటు ఆదాయం, విద్య, ఆరోగ్యపరమైన ప్రమాణాలలో దిగజారిపోయింది. ఆకలి, పిల్లల్లో ఎదుగుదల, పోషకాహార లోపాన్ని కొలిచే గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో, పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌ల కంటే వెనుకబడింది. మహిళల సాధికారత, సమానత్వం విషయంలో, వరల్డ్ ఎకనామిక్ ఫోరం (దావోస్) జారీ చేసిన గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ప్రకారం, భారతదేశం 26 స్థానాలు పడిపోయింది.

మోడీ పాలనలో మానవ హక్కులు

మానవ హక్కులను అణచివేయడం, మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలను హింసించడం మోడీ ప్రభుత్వం మరొక అపఖ్యాతి గల రికార్డు. ఇది ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్, అంతర్జాతీయ సంస్థలు, విద్యా సంస్థల నుండి మాత్రమే కాకుండా, యుఎస్‌ఎకు ప్రాతినిధ్యం వహించే అధికారిక సంస్థ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ నుండి కూడా అభిశంసనకు గురిఅయ్యింది. 2021లో మైనారిటీ వర్గాల సభ్యులపై భారతదేశంలో జరిగిన బెదిరింపుల దాడులు, హత్యలు, భౌతిక దాడుల వివరాలను నివేదిక ప్రస్తావించింది.

అమెరికాకు చెందిన ఫ్రీడమ్ హౌస్ వరల్డ్ ఇండెక్స్ అంచనాలో భారతదేశం ‘స్వేచ్ఛ’ నుండి ‘పాక్షికంగా స్వేచ్ఛ వున్న’ స్థాయికి దిగజారిపోయిందని, కశ్మీర్‌లో స్వతంత్రం లేదు’ అని ర్యాంకింగ్ చేశారు. మన విదేశాంగ శాఖ అధికారులు దాన్ని తోసిపుచ్చారు. అయితే కశ్మీరులోను, బయటా ఉన్న భారత జనాభాలోని అధిక సంఖ్యాకులు తాము ‘స్వతంత్రులం కాము’ అని కఠోర అనుభవాల ద్వారా తెలుసుకొన్నారు. ఢిల్లీ, అలహాబాద్ (ఇప్పుడు ప్రయాగ్ రాజ్‌గా పేరు మార్చబడింది) మరికొన్ని భారతీయ నగరాలలో ఇటీవలి బుల్డోజర్ డ్రైవ్‌ల బాధితులు ప్రధానంగా ముస్లింలు. వారి దుస్థితి ఐక్యరాజ్యసమితి దృష్టిలో పడింది. ఐక్యరాజ్యసమితి నియమించిన ముగ్గురు ప్రత్యేక రిపోర్టర్లు గృహనిర్మాణం, మైనారిటీ సమస్యలు, మత స్వేచ్ఛ కోసం 2022 జూన్ 9న భారత ప్రభుత్వానికి రాసిన లేఖలో పేదల ఇళ్లను బుల్డోజ్ చేసిన ఘటనలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.

మోడీ పాలనలో జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల దుస్థితి

మోడీ ప్రభుత్వం నిరసన ప్రదర్శనలను అణచివేయడమే కాకుం డా వీటిని ప్రజల దృష్టికి తీసుకు రావడానికి ధైర్యం చేసి రాసే పాత్రికేయుల గొంతులను కూడా అణచివేస్తోంది. భారతదేశంలోఅధికార, అధికారేతర ఏజెన్సీలు జర్నలిస్టులను చంపడం, ఖైదు చేయడం, వేధించడం వంటి కేసులను పరిగణనలోకి తీసుకొని, అంతర్జాతీయ జర్నలిస్టుల ఫోరం, రిపోర్టర్స్ సాన్స్ ఫ్రాంటియర్స్, మే, 2022లో ప్రచురించిన నివేదికలో మోడీ నేతృత్వంలోని భారతదేశాన్ని అత్యంత బాధాకరమైన పదాలతో వర్ణించింది: ‘ప్రతి సంవత్సరం వారి పనికి సంబంధించి సగటున ముగ్గురు లేదా నలుగురు పాత్రికేయులు చంపబడ్డారు, మీడియాకు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో భారత్ ఒకటి. పత్రికా స్వేచ్ఛను ఉల్లంఘించే రాజ్యాల ర్యాంకింగ్‌లో భారతదేశం పడిపోయిందని నివేదిక పేర్కొంది. అటువంటి ఉల్లంఘనకు తాజా ఉదాహరణ, న్యూస్ ఏజెన్సీ ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబైర్‌ను అరెస్టు చేయడం. హిందుత్వ సమూహాలు వ్యాప్తి చేసే నకిలీ వార్తలను, బిజెపి నాయకుల ద్వేషపూరిత ప్రసంగాలను ఆయన బహిర్గతం చేస్తున్నారు.

మానవ హక్కుల ఉల్లంఘనల బాధితులను సమర్థించే న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు మోడీ ప్రభుత్వానికి మరొక గురి. 2002 నాటి గుజరాత్ ముస్లింల ఊచకోత సమయంలో హిందూ మూక చేతిలో హత్యకు గురైన కాంగ్రెస్ నేత ఎహ్సాన్ జాఫ్రీ భార్య జకియా జాఫ్రీకి న్యాయం చేయడానికి గత ఇరవై ఏళ్లుగా తీస్తా సెతల్వాద్ ప్రయత్నిస్తుండటంతో ఇతర అభియోగాలు మోపి ఆమె ను అరెస్టు చేయడం మరో ఉదాహరణ. తీస్తా సెతల్వాద్ అరెస్టు వెనుక, ఒక ఎలుక సుప్రీంకోర్టు మెట్లపైకి పాకుతున్న వాసన మనకు కనిపిస్తుంది. జూన్ 24న సుప్రీంకోర్టు బెంచ్ జారీ చేసిన వింత ఉత్తర్వులను అనుసరించి ఆమెను అరెస్టు చేశారు. ఇది ఫిర్యాదుదారుడిని నిందితుడిగా మార్చింది. అసహనంతో కూడిన పరిపాలనతో భారతీయ న్యాయవ్యవస్థ చేసుకున్న ఈ వికారమైన అంగీకారాన్ని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తప్పుపట్టింది. జూన్ 25న విడుదల చేసిన ఒక ప్రకటనలో భారత అధికారులు తీస్తా సెతల్వాడ్ను అరెస్టు చేయడం, ‘వారి మానవ హక్కుల రికార్డును ప్రశ్నించడానికి సాహసించే వారిపై ప్రత్యక్ష ప్రతీకారం’ అని ఖండించి ఆమెను విడుదల చేయాలని కోరింది.

అదే విధంగా, ఆల్ట్‌న్యూస్ సహవ్యవస్థాపకుడు మొహమ్మద్ జుబైర్ (నకిలీ వార్తలను తొలగించడం ద్వారా తప్పుడు సమాచారాన్ని సవాలు చేయడానికి ప్రసిద్ధి చెందారు) కొంతకాలం క్రితం అరెస్టు చేయబడినప్పుడు, దేశంలోని జర్నలిస్ట్ సంస్థలు (ఎడిటర్స్ గిల్డ్, ప్రెస్‌క్లబ్ ఆఫ్ ఇండియా మొదలైనవి) విదేశాలలోని జర్నలిస్ట్ సంస్థలు అన్యాయమైన అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ ప్రకటనలతో ముందుకు వచ్చాయి. భారతదేశం నుంచి, విదేశాల నుంచి తనను దూషించే ఈ స్వరాలను వినడానికి మన ప్రధాన మంత్రి సుముఖంగా ఉన్నారా? లేక తన విధానాల నుండి ఉద్భవించిన దుర్వాసనను ఆయన వాసన చూడగలడా? అతను నాయకత్వం వహించే ప్రభుత్వం వినికిడి లోపం, వాసన కోల్పోవడం అనే రుగ్మతలతో బాధపడుతున్నట్లు అనిపిస్తుంది.

మోడీ పాలన పట్ల విచిత్రమైన ద్వంద వైఖరి

ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు ఎన్ని నిందారోపణలు చేసినప్పటికీ, నరేంద్ర మోడీ తన విదేశీ సంబంధాలలో ప్రపంచ శక్తుల విస్తారమైన శ్రేణి నుండి మద్దతును అనుభవిస్తున్నారు. యుఎస్, యూరోపియన్ యూనియన్లకు తన ప్రభుత్వం లాభదాయకమైన వాణిజ్య భాగస్వామి అని హామీ ఇస్తాడు. ఆ దేశాలను సవాలు చేస్తూ దక్షిణాసియాలో పెరుగుతున్న చైనా ఉనికికి కౌంటర్‌గా తాను అవసరం అని వారితో చేతులు కలుపుతాడు. జి-7 శిఖరాగ్ర సదస్సుకు ఇటీవల ఆయనకు వచ్చిన ఆహ్వానం, పాశ్చాత్య దేశాలు తమ ఆటలో అతనిని పావుగా వాడుకోవటానికి ప్రయత్నిస్తున్న తీరుకు సూచిక. మానవ హక్కులు తదితరాలపై ఆ దేశాలు కార్చేవి మొసలికన్నీళ్లే. వారికి తమ ఆర్ధిక, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. దానికి మోడీ పూర్తిగా సహకరిస్తున్నారు. దేశీ రంగంలో కూడా, నోట్ల రద్దు, కొవిడ్ వ్యాప్తి, లాక్ డౌన్ అణచివేత, వంటి వినాశకరమైన చర్యలు, విధ్వంసం సృష్టించిన అగ్నిపథ్ వంటి వినాశకరమైన చర్యలు ఎన్ని ఉన్నప్పటికీ మోడీ ప్రజాదరణను అనుభవిస్తున్నారు (ఎన్నికల ఫలితాల ద్వారా చూస్తే). ప్రజానీకాన్ని ఆయన ఎలా ఆకర్షిస్తున్నారు? ఒక ప్రధాన కారణం ఏమంటే మారుమూల గ్రామానికి కూడా చేరుకునే సోషల్ మీడియా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మోడీకి ఉత్తమ పరిచారికగా పని చేస్తోంది.ఆయన ప్రభుత్వం ప్రజలపై బురద జల్లుతుంటే, అది పన్నీరు అని మీడియా చెబుతుంది !

(సుమంత బెనర్జీ ఒక రాజకీయ వ్యాఖ్యాత, రచయిత. ఇన్ ది వేక్ ఆఫ్ నక్సల్బరీ’, ది పార్లర్ అండ్ ది స్ట్రీట్స్: ఎలైట్ అండ్ పాపులర్ కల్చర్ ఇన్ నైన్టీన్త్ సెంచరీ కలకత్తా; ‘మెమోయిర్స్ ఆఫ్ రోడ్స్: కలకత్తా ఫ్రమ్ కలోనియల్ అర్బనైజేషన్టు గ్లోబల్ మోడర్నైజేషన్’. ఈయన ప్రసిద్ధ రచనలు. ప్రైమ్ మినిస్టర్ మేక్స్ ఇండియా స్టిన్క్ ఇన్ వరల్డ్ పబ్లిక్ ఒపీనియన్ అన్న 19/07/2022 వ్యాసం, కౌంటర్ కరెంట్స్, ఆర్గ్ సౌజన్యంతో)

జతిన్ కుమార్
9849806281

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News