Saturday, May 4, 2024

కార్పొరేట్‌కు.. కరోనా రోగులు.!

- Advertisement -
- Advertisement -
Corona patients are going to corporate hospitals
క్యూ కడుతున్న వైరస్ లక్షణాల బాధితులు

 భారీగా ఫీజులు వసూల్ చేసేందుకు సిద్ధమైన యాజమాన్యాలు
కరోనా స్పెషల్ స్కాన్ పేరిట సిటీ స్కాన్ చేస్తున్న వైనం
ఒక్కో బాధితుడి వద్ద రూ. 20వేలు వసూల్
సాధారణ చికిత్సకు రోజుకు రూ. 80 వేలు , వెంటిలేటర్ రోగులకు
లక్ష30 వేలు ఫీజులు, కార్పొరేట్ యాజమాన్యాల నిలువు దోపిడి..
అందరికీ ఆసుపత్రుల్లో చికిత్స అవసరం లేదంటున్న వైద్యశాఖ
ప్రజలు అవగాహన పెంచుకోవాలని సూచనలు

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా బాధితులు క్రమంగా కార్పొరేట్‌కు వెళ్లేందుకు అడుగులు వేస్తున్నారు. దీన్ని అదనుగా చేసుకొని కొన్ని ఆసుపత్రుల యాజమాన్యాలు ఫీజులను భారీగా వసూల్ చేసేందుకు సిద్ధమయ్యయి. ఇప్పటికే వైరస్ లక్షణాలు ఉన్న వారు సర్కార్ నుంచి అనుమతి పొందిన కార్పొరేట్ ఆసుపత్రుల ముందు క్యూ కడుతున్నారు. దీంతో ఒక్కో ఆసుపత్రి ఒక్కో తీరుగా ఫీజులను తీసుకుంటుంది. ఇటీవల ఓ ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో కరోనా స్పెషల్ స్కాన్ పేరిట సిటీ స్కాన్ చేసి ఒక్కో బాధితుడి నుంచి రూ. 20వేలు వసూల్ చేయగా, వైద్యశాఖ సదరు ఆసుపత్రికి నోటీసులు ఇచ్చింది. మరోసారి ఇలాంటి చర్యలు పునరావృతమైన అనుమతి రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం.

దీంతో పాటు ప్రైవేట్, కార్పొరేట్లలో కరోనా రోగులు చేరితే ఒక రోజుకు సాధారణ రోగులకు రూ. 80వేలు, వెంటిలేటర్ మీద రోగులకు సుమారు రూ. లక్ష 30 వేల వరకు తీసుకుంటున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇటీవల గాంధీ ఆసుపత్రిపై వచ్చిన కొన్ని ఆరోపణలపై ప్రజల్లో కాస్త గందరగోళమైన పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు వైరస్ లక్షణాలు ఉంటే కింగ్‌కోఠి, ఫీవర్, ఉస్మానియాలకు వెళ్లేవారు. అక్కడ అనుమానితులకు శాంపిల్ తీసుకొని టెస్టు నిర్ధారణ తర్వాత పాజిటివ్ వస్తే గాంధీకి లేదంటే హోం ఐసొలేషన్ ఉండాలని వైద్యులు సూచించేవారు. కానీ ప్రభుత్వాసుపత్రుల్లో పెరుగుతున్న రోగులతో వైరస్ వ్యాప్తి మరింత పెరిగే అవకాశం ఉందని చాలా మంది కార్పొరేట్ ఆసుపత్రులను సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో పాటు గాంధీ నుంచి డిశ్చార్జ్ అయిన తీవ్రత లేని రోగుల్లో కూడా కొందరు భయాందోళనతో తిరిగి కార్పొరేట్‌కు పరుగులు పెడుతున్నారని తెలుస్తుంది.

దీనిలో భాగంగా గురువారం ఇద్దరు రోగులు కార్పొరేట్ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు సమాచారం. వాస్తవంగా ఐసిఎంఆర్(ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ అండ్ రీసెర్చ్) నిబంధనల మేరకు తక్కువ, తీవ్రత లేని కరోనా బాధితులను ఆసుపత్రిలో అడ్మిట్ అయిన తర్వాత చివరి మూడు రోజుల్లో వరుసగా జ్వరం లేకుంటే డిశ్చార్జ్ చేయొచ్చని పేర్కొంది. దీనిలో భాగంగానే గాంధీ ఆసుపత్రి నుంచి గత కొన్ని రోజులు మైల్డ్, అసింప్టమాటిక్ కరోనా రోగులను డిశ్చార్జ్ చేస్తున్న విషయం విధితమే. వీరిని ఇళ్ల వద్దనే హోం ఐసోలేషన్‌లో ఉండాలని, కావాల్సిన మందులను వైద్యశాఖ పంపిణీ చేస్తుందని ఆరోగ్యశాఖ సూచిస్తుంది. కానీ వీరిలో కొందరు భయాందోళనతో కార్పొరేట్ ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. ఇళ్ల వద్ద ఉంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంటుంది? దాని కంటే డబ్బులు ఖర్చు అయిన సరే కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తామని కొందరు రోగులు విచిత్రంగా మాట్లాడటం గమనార్హం.

ఈ అంశంపై వైద్యాశాఖ ఉన్నతాధికారులు స్పందిస్తూ గాంధీలో ఇచ్చిన చికిత్సనే మళ్లీ ఆయా ఆసుపత్రుల్లో ఇస్తారని, దీనికి డబ్బులు వృథా చేయడం అవసరం లేదని పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సంభవించిన మరణాల్లో వైరస్ సోకకముందు ఇతర రోగాల ఉన్నవారు మాత్రమే చనిపోయరని అధికారులు తెలుపుతున్నారు. ఈ వైరస్‌తో అందరికీ ప్రమాదం లేదని, కేవలం ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మాత్రమే ఇబ్బందయ్యే అవకాశం ఉందని వైద్యాశాఖ ఉన్నతాధికారుల్లో ఒకరు మన తెలంగాణకు వివరించారు. ఇతర రోగాలు లేని కరోనా రోగులు ఇంటి వద్దనే వైద్యశాఖ సూచించిన నిబంధనలు పాటిస్తూ రోగ నిరోధక శక్తిని పెంచుకునే ఆహారం తీసుకోవాడం వలన వైరస్‌ను సులువుగా జయించవచ్చని వైద్యాధికారులు ప్రజలకు విన్నపిస్తున్నారు.

దోపిడికి సిద్ధమైన కార్పొరేట్ యాజమాన్యాలు..

కరోనా రోగులపై దోపిడి చేసేందుకు కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు సిద్ధమయ్యాయి. రోజురోజుకి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రుల్లో కేవలం అధిక తీవ్రత గల కరోనా రోగులకు మాత్రమే వైద్యం అందింస్తున్నారు. మిగతా వారిని రోగుల ఇళ్లల్లో లేదా, జిల్లా కేంద్రాల్లో ఐసొలేట్ చేసి వైద్యం అందించేందుకు వైద్యశాఖ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. కానీ గత కొన్ని రోజులుగా కోవిడ్ నోడల్ కేంద్రం గాంధీపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ప్రజల్లో గందరగోళం ఏర్పడింది. దీంతో చాలా మంది ఐసిఎంఆర్ అనుమతి ఇచ్చిన కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్తున్నారు.

దీన్ని అదనుగా చేసుకొని కొన్ని కార్పొరేట్ ఆసుపత్రులు భారీగా ఫీజులు వసుల్ చేసేందుకు సిద్ధమయ్యాయి.అదే విధంగా కరోనా టెస్టుతో పాటు వివిధ టెస్టుల పేరిట రోగుల జేబులు గుల్లచేస్తున్నారంటూ చికిత్స పొందిన రోగులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం అనుమతి పొందిన కార్పొరేట్ ఆసుపత్రుల్లో సుమారు 55 మంది వరకు కరోనా బాధితులు చికిత్స పొందుతుండగా, గత రెండు రోజుల నుంచి అనుమానితుల సంఖ్య విపరీతంగా పెరిగిందని ఓ కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

Corona patients are going to corporate hospitals

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News