Friday, April 26, 2024

నగరంలో నేరాలు తగ్గాయి

- Advertisement -
- Advertisement -

Crime rate down in Hyderabad Says CP Anjani Kumar

21శాతం తగ్గిన క్రైం రేట్
మహిళల ప్రాధాన్యత పెరిగింది
అత్యాచారం 95శాతం కేసులు పెరిగాయి
228 కేసుల్లో బాలికలు బాధితులు
205మందిపై పిడి యాక్ట్ నమోదు

హైదరాబాద్: నగరంలో ఈ ఏడాది 21శాతం నేరాలు తగ్గాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. హుస్సేన్‌సాగర్‌లోని బుద్దుడి విగ్రహం వద్ద బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ మాట్లాడుతూ ఇతర నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో నేరాలు తగ్గాయని తెలిపారు. కరోనా, లాక్‌డౌన్ వల్ల 2019లో జరిగన నేరాలతో పోల్చి నివేదికను రూపొందించామని తెలిపారు. నగరంలో ఏరియాలను బట్టి పోలీసులకు శిక్షణ ఇచ్చామని తెలిపారు. బంజారాహిల్స్ పోలీసులకు, ఇతర పోలీస్ స్టేషన్ సిబ్బందికి వేర్వేరుగా శిక్షణ ఇచ్చామని తెలిపారు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు నడుచుకునేలా సిద్ధం చేశామని తెలిపారు. పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఉమెన్ పోలీసుల ప్రాధాన్యత పెరిగిందని, వారికి ఒక సీనియర్ ఆఫీసర్‌ను కేటాయించి వారితో శిక్షణ ఇప్పిస్తున్నామని తెలిపారు.

ప్రతి ఒక్కరూ తమ తండ్రికంటే పోలీసులను తండ్రిగా, పోలీసులు తమ కుటుంబం వలే భావించే విధంగా చేయాలని 2022ను టార్గెట్‌గా పెట్టుకున్నామని తెలిపారు. దేశంలోని కొచ్చి నేరాల్లో మొదటి స్థానంలో ఉందని, రెండో స్థానంలో ఇండోర్, మూడో స్థానంలో గ్వాలియర్, హైదరాబాద్‌లో లక్షమందికి 49 నేరాలు మాత్రమే జరుగుతున్నాయని తెలిపారు. హత్యలు ఎక్కువ దేశంలో మీరట్, పాట్నా, రాంచీ, ఢిల్లీ జరుగుతున్నాయని హైదరాబాద్ కింద నుంచి మూడోస్థానంలో ఉందని తెలిపారు. హత్యాయత్నం కేసుల్లో అహ్మదాబాద్ దేశంలో మొదటి స్థానం, హైదరాబాద్ కింది నుంచి నాలుగో స్థానంలో ఉందని అన్నారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 16,000మంది పోలీసులు పనిచేస్తున్నారని తెలిపారు. 2020లో కోవిడ్ సమయంలో నాలుగు నెలలు అన్ని మూసివేశారని తెలిపారు. ఈ సమయంలో పోలీసులు చాలాబాగా పనిచేశారని తెలిపారు.

నేరాలు చేసిన వారిలో 48 శాతం మందికి శిక్షలు పడ్డాయని తెలిపారు. నగరంలో 70,000లకు పైగా సిసి కెమెరాలు ఏర్పాటు చేశామని, హైదరాబాద్‌లో మొత్తం 4.4లక్షల కెమెరాల ఏర్పాటు చేశామని తెలిపారు. 192 కిడ్నాప్ కేసులు, 21 ప్రాపర్టీ కేసులు, రూ.11కోట్లు ప్రాపర్టీ రికవరీ చేశామని తెలిపారు. డ్రగ్స్ కేసులు 246 నమోదయ్యాయని, డ్రగ్స్ తీసుకున్న 600మందిని అరెస్టు చేశామని తెలిపారు. వివిధ నేరాలు చేసిన 205 మందిపై పిడి యాక్ట్ పెట్టామని తెలిపారు. హత్యకేసులు 7శాతం, ఆటోమోబైల్ కేసులు 16శాతం పెరిగాయని తెలిపారు. నేరాలు చేసిన వారిలో ఒకరికి 30 ఏళ్ల జైలు శిక్ష, తొమ్మిది మందికి 20 ఏళ్ల జైలు, ఒకరికి 25 ఏళ్లజైలు, ఒకరికి 13 ఏళ్లు, పదిమందికి జీవిత ఖైదు, పదిమందికి పదేళ్ల జైలు, ఒకరికి 12 ఏళ్లు జైలు శిక్ష పడిందని తెలిపారు.

అయిన వారే అత్యాచారం…

నగరంలో నమోదైన అత్యాచారం కేసుల్లో ఎక్కువగా బాధితులకు సంబంధించిన బంధువులే నేరస్తులుగా ఉన్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2021లో 328 కేసులు నమోదయ్యాయని, 2019లో 281, 2020లో 265 నమోదయ్యాయని అన్నారు. ఏడు కేసులు తప్ప అన్ని బాధితుల బంధువులే నిందితులుగా ఉన్నారని తెలిపారు. అత్యాచారం కేసులు 95శాతం పెరిగాయని తెలిపారు. నగరంలో 2019లో మూడు, 2020లో మూడు, 2021లో ఏడు హత్య కేసులు నమోదయ్యాయని తెలిపారు.

హెల్మెట్ పెట్టుకోవడంలేదు….

రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే వాహనదారులు మృతిచెందుతున్నారని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం వల్లే మృతిచెందుతున్నారని తెలిపారు. బైక్‌పై భార్యభర్త వెళ్తే ఒకరు మాత్రమే హెల్మెట్ పెట్టుకుంటున్నారని తెలిపారు. ఈ ఏడాది హెల్మెట్ పెట్టుకోకుండా వాహనాలు నడిపిన 53 లక్షల మంది వాహనదారులపై జరిమానా విధించామని తెలిపారు. ట్రిపుల్ రైడింగ్ చేసిన 1,16,000 మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. రేసింగ్, ఓవర్ స్పీడ్ వాహనదారులు 90,000మందిపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ ఏడాది మహిళలు, యువతులు, బాలికలపై వేధింపులకు పాల్పడిన 1,414మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.

పెరిగిన సైబర్ నేరాలు…

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 65 శాతం సైబర్ నేరాలు పెరిగాయని, ఇందులో 45 శాతం ఆర్థిక నేరాలు ఉన్నాయని అదనపు పోలీస్ కమిషనర్ శిఖాగోయల్ తెలిపారు. ఇందులో ఎక్కువగా యూపిఐ కేసుల్లో క్యూఆర్ కోడ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. డబ్బులు తీసుకోవడానికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఓటిపిని ఎవరికీ చెప్పవద్దని, బ్యాంక్, ఇతర సంస్థల అధికారులు ఓటిపిని అడుగరని తెలిపారు. 2021లో 5,000కుపైగా సైబర్ క్రైం నేరాలు నమోదయ్యాయని తెలిపారు. లోన్ యాప్‌ల కేసులో 16మందిని అరెస్టు చేశామని, ఇందులో విదేశాలకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉందని తెలిపారు. దాదాపుగా రూ.7.4 కోట్లు దోచుకున్నారని తెలిపారు. 16 క్రిప్టో కరెన్సీ కేసులు నమోదయ్యాయని, ఎవరైనా హాక్‌ఐ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఇంట్లో పనిమనుషులుగా చేర్చుకునేవారు ముందుగా హాక్‌ఐలో దరఖాస్తు చేసుకుంటే వారి గురించి విచారణ చేసి చెబుతామని, అప్పటి వరకు గుర్తుతెలియని వ్యక్తులను పనిలో పెట్టుకోవద్దని తెలిపారు.

ఇప్పటి వరకు చేపట్టిన ఆపరేషన్‌లో 2,000 కిలోలకు పైగా గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మహిళలు, యువతులు, బాలికలపై జరిగిన నేరాల విచారణ రెండు నెలల్లో పూర్తి చేయాలని చట్టం ఉందని, దానిని పాటిస్తున్నామని తెలిపారు. సైబర్ నేరస్థులకు వెంటనే డబ్బులు వెళ్లకుండా ఉండేందుకు బ్యాంకుల్లో ఫ్రీజ్ చేస్తున్నామని తెలిపారు. దీని వల్ల చాలామంది బాధితుల డబ్బులు పేమెంట్ గేట్ వే వద్ద ఆగిపోవడంతో తిరిగి వచ్చాయని తెలిపారు. సైబర్ నేరాలు చేసిన 265మందిని అరెస్టు చేశామని, ఇందులో 13మంది విదేశీయులు ఉన్నారని తెలిపారు. బ్యాంక్ ఖాతాల్లో ఉన్న రూ.80.54 కోట్లు ఫ్రీజ్ చేశామని తెలిపారు.

నగరంలో పెరిగిన వేగంః విజయ్‌కుమార్, ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్

దేశంలోని మిగతా నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో వాహనాల వేగం గంటకు 25 కిలో మీటర్లు పెరిగిందని నగర అదనపు పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ విజయ్‌కుమార్ అన్నారు. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అవయదానానికి సాయం చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈ ఏడాది 58లక్షల కేసులు నమోదు చేశామని తెలిపారు. 25,453మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇందులో 10,109మందిపై కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశామని తెలిపారు. 206మంది మందుబాబులకు జైలు శిక్ష పడిందని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మందుబాబులకు రూ.10.49 కోట్లు జరిమానా విధించామని తెలిపారు. 25మంది డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేశామని, ఈ ఏడాది 1,961 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో 278మంది మృతిచెందగా, 88మంది పాదచారులు ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News