Friday, April 26, 2024

‘శీతాకాలం’ సమాప్తం

- Advertisement -
- Advertisement -

Parliament Winter Session ends

ఒక రోజు ముందుగానే నిరవధికంగా వాయిదా పడిన పార్లమెంటు
సభలు నడిచింది అంతంత మాత్రమే
వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు సహా 11 బిల్లులకు ఆమోదం

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిశాయి. నవంబర్ 29న ప్రారంభమైన ఈ సమావేశాలు నిర్దేశించిన దానికన్నా ఒక రోజు ముందే (బుధవారం) నిరవధికంగా వాయిదా పడ్డాయి. 12 మంది విపక్ష ఎంపిల సస్పెన్షన్‌ను నిరసిస్తూ విపక్షాలు చేపట్టిన ఆందోళనలతో ఈ సారి ఉభయ సభలూ దద్దరిల్లాయి. అధిక ధరలు, లఖింపూర్ ఖేరీ ఘటనపై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఈ సారి ఉత్పాదకత( ప్రొడక్టివిటీ) బాగా తగ్గింది. లోక్‌సభ ప్రొడక్టివిటీ 82 శాతం కాగా, రాజ్యసభ ఉత్పాదకత 48 శాతం మాత్రమేనని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. ప్రతిపక్షాలు పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడమే ప్రధాన వ్యూహంగా వ్యవహరించినప్పటికీ సమావేశాలు విజయవంతమయ్యాయని మంత్రి చెప్పగా ‘ఎలాంటి చర్చ, కనీసం నోటీసు కూడా’ లేకుండా ప్రభుత్వం బిల్లులను ఆమోదింపజేసుకుందని విపక్షాలు ఆరోపించాయి.

శీతాకాల సమావేశాల్లో లోక్‌సభలో 83.2 గంటలు కార్యకలాపాలు సాగగా, అందులో బిల్లులపై 26.5 గంటలు మాత్రమే చర్చ జరిగింది. రాజ్యసభలో సైతం 45.4 గంటలు కార్యకలాపాలు జరగ్గా అందులో 21.7 గంటలు మాత్రమే బిల్లులపై చర్చ జరగడం గమనార్హం. వ్యవసాయ చట్టాల రద్దు బిల్లుపై లోక్‌సభలో రెండు నిమిషాలు, రాజ్యసభలో 8 నిమిషాలు మాత్రమే చర్చ జరిగింది. హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలకు సంబంధించిన వేతనాలు, సర్వీస్ నిబంధనల బిల్లుపై అత్యధికంగా 9 గంటల 37 నిమిషాలు చర్చ జరగడం గమనార్హం. వీటితో పాటుగా వాతావరణ మార్పులు, ఒమిక్రాన్ వేరియంట్ అంశాలు పార్లమెంటులో చర్చకు వచ్చాయి.లోక్‌సభలో 12, రాజ్యసభలో ఒక బిల్లు కలిపి మొత్తం 13 బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టినట్లు ప్రహ్లాద్ జోషీ చెప్పారు.ఆమోదం పొందిన కీలక బిల్లుల్లో వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, ఎన్నికల సంస్కరణల సవరణ బిల్లు, మాదక ద్రవ్యాల నిరోధక చట్ట సవరణ బిల్లు,సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సవరణ బిల్లు, ఢిల్లీ స్పెషల్ పోలీసు ఎస్టాబ్లిష్‌మెంట్ సవరణ బిల్లు, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల (వేతనాలు, సర్వీస్ కండిషన్) సవరణ బిల్లు, సరోగసీ బిల్లు( రెగ్యులేషన్), ఆనకట్టల భద్రత బిల్లు ఉన్నాయి.

విపక్షాల వల్లే: ప్రహ్లాద్ జోషీ

విపక్షాల వైఖరి కారణంగానే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు అనుకొన్న స్థాయిలో ఉత్పాదకత సాధించలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ దుయ్యబట్టారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ సహా ఇతర పక్షాలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాయని, అందుకే సభా కార్యకలాపాలకు అడ్డుతగులుతున్నాయని ఆరోపించారు. సమగ్ర చర్చ జరగాలన్న ఉద్దేశంతోనే వివాహ వయసుకు చెందిన బిల్లుతో సహా ఆరు బిల్లులను ప్రభుత్వం పార్లమెంటరీ కమిటీకి పంపించినట్లు చెప్పారు. బిల్లులపై అధ్యయనం చేసేందుకు తమకు తగినంత సమయం ఇవ్వలేదన్న విపక్షాల ఆరోపణలను ప్రహ్లాద్ జోషీ తోసిపుచ్చారు. చర్చ జరగాలంటే విపక్షాలు సభ జరగనివ్వాలిగా అని ఆయన అన్నారు. స్పీకర్, చైర్మన్ ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినప్పటికీ అవి ఉపయోగించుకోలేకపోయాయని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు.

ప్రభుత్వ మొండి వైఖరే కారణం : విపక్షాలు

అయితే ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వ మొండి వైఖరికారణంగానే పార్లమెంటులో కీలక అంశాలపై చర్చ జరిపేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆరోపించాయి. ‘ప్రతి రోజు కూడా ప్రభుత్వం విపక్షాలకు ప్రధాన అంశాలను లేవనెత్తే అవకాశం లేకుండా చేసింది. ప్రజాస్వామ్యాన్నిఈ విధంగా ఖూనీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు ప్రెస్‌మీట్‌లు పెట్టి దాన్ని సమర్థించుకుంటోంది. ప్రతిపక్షాలకు అరుదుగా సమయం లభించినప్పుడు రూల్‌బుక్‌నుంచి ప్రభుత్వానికి మాస్టర్ క్లాస్ ఇచ్చాం’ అని పార్లమెంటు నిరవధిక వాయిదా పడిన తర్వాత టిఎంసి ఎంపి డెరిక్ ఒబ్రియాన్ ఒక ట్వీట్‌లో వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News