Saturday, April 27, 2024

గులాబ్‌తో జర పైలం

- Advertisement -
- Advertisement -

CS Somesh Kumar alerted district collectors in wake of heavy rains in Telangana

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి
ఢిల్లీ నుంచి టెలీ కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్లకు సిఎస్ సోమేష్‌కుమార్ ప్రత్యేక ఆదేశాలు

అన్ని కలెక్టరేట్లలో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయాలి
ఉత్తర తెలంగాణకు రెడ్ అలెర్ట్, దక్షిణ తెలంగాణకు ఆరెంజ్ అలెర్ట్ హెచ్చరిక జారీ చేసిన వాతావరణ శాఖ
తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై నిఘా ఉంచాలి
అవసరమైతే ఎన్‌డిఆర్‌ఎఫ్ సేవలు తీసుకోవాలి

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లను సిఎస్ సోమేశ్ కుమార్ అప్రమత్తం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌తో పాటు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన అక్కడి నుంచే జిల్లా కలెక్టర్లతో పాటు రోడ్లు భవనాల శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, విపత్తుల నిర్వహణశాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, పంచాయితీ రాజ్, జర పైలం ఇంధనశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియాలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆదివారం రాత్రి నుంచి ఎల్లుండి వరకు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు. రెండు రోజుల పాటు రాష్ట్రంపై గులాబ్ తుఫాను ప్రభావం ఉంటుందని తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టరేట్లలో సహాయక చర్యల కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు.

వాతావరణశాఖ ఉత్తర తెలంగాణ జిల్లాలకు రెడ్ అలర్ట్, దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించినట్టు తెలిపారు. జిల్లాల్లో పోలీసు, ఇతర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తెగడానికి అవకాశం ఉన్న చెరువులపై ప్రత్యేక నిఘా ఉంచి, ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైతే ఎన్‌డిఆర్‌ఎఫ్ సేవలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం వరంగల్, హైదరాబాద్, కొత్తగూడెంలో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రతి మండలంలో ప్రత్యేక అధికారులను నియమించి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలని సిఎస్ పేర్కొన్నారు.

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి ‘గులాబ్’ ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గులాబ్ తుఫాను కేంద్రీకృతమైందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈ తుఫాను పశ్చిమ దిశగా కదులుతూ.. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలను తాకనున్నట్లు తెలిపింది. నేడు అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ సంచాలకులు తెలిపారు. తీరం దాటే సమయంలో గాలి వేగం అధికంగా 95 కిలోమీటర్లు ఉంటుందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వచ్చే 24గంటల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అధికారులు వెల్లడించారు. రాగల 24 గంటల్లో ఒడిశా, ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు తెలంగాణ, విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్ కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్ రూంను 040 23202813 ఏర్పాటు చేశారు.

29న పశ్చిమ బెంగాల్ తీరానికి

రాగల 24 గంటల్లో ఈశాన్య, పరిసర తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఆవర్తన ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో తదుపరి 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, ఈ అల్పపీడనం వాయువ్య దిశగా ప్రయాణించి పశ్చిమ బెంగాల్ తీరానికి 29వ తేదీకి చేరుకునే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12.6 సె.మీ.

శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కురిసిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం మామకన్నులో 12.6 సెంటిమీటర్లు, పోచంపల్లి (కరీంనగర్)లో 6.3, కూనారం (పెద్దపల్లి)లో 6, ఆవునూరు (రాజన్న సిరిసిల్ల జిల్లా)లో 6, సంగారెడ్డిలో 8.5, రంగారెడ్డిలో 10.3, హైదరాబాద్‌లో 9.3, నల్లగొండలో 8.5, సూర్యాపేటలో 8.1, మేడ్చల్ మల్కాజిగిరిలో 7.2, యాదాద్రి భువనగిరిలో 6.6, వికారాబాద్‌లో 3.8, కామారెడ్డిలో 2.8, మహబూబ్‌నగర్‌లో 2.5, నిజామాబాద్‌లో 2.5, నాగర్‌కర్నూల్‌లో 2.4, మహబూబాద్‌లో 2.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు తెలిపారు.

ఉత్తర తెలంగాణపై అధిక ప్రభావం

ఈ తుఫాన్ ఎఫెక్ట్ ఉత్తర తెలంగాణపై ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. అవసరమైతే తప్ప జనం ఎవరూ బయటకు వద్దని వారు సూచించారు.

పెంచికలపేట ప్రధాన రహదారిపై

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం పెంచికలపేట ప్రధాన రహదారిపై సులుగుపల్లి సమీపంలోని తీగల ఒర్రె భారీ వర్షానికి ఉప్పొంగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాకాలంలో వరదలతో ప్రతి ఏడాది తీగల ఒర్రె ఇలాగే ఉప్పొంగడంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. 2013లో వరద ఉధృతికి ఆర్టీసీ బస్సు బోల్తా పడింది.

వరదనీరు కాకరవాణి ప్రాజెక్టులోకి..

వికారాబాద్ జిల్లాలో భారీవర్షం కురవడంతో పలు మండల్లాలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. బొంరాస్‌పేట, మెట్లకుంట, ఏర్పుమళ్ల చెరువులు వర్షపునీటితో నిండిపోవడంతో వరదనీరు కాకరవాణి ప్రాజెక్టులోకి ప్రవహిస్తోంది.

జలదిగ్బంధంలో ఏడుపాయల ఆలయం

మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయం జలదిగ్భంధంలో చిక్కుకుంది. సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని దిగువకు విడుదల చేయడంతో మంజీరా నది పొంగిపొర్లి ప్రవహించింది. వెంటనే సిబ్బంది గుడిని మూసివేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News