Saturday, May 4, 2024

వరి సాగు తగ్గిద్దాం

- Advertisement -
- Advertisement -

Let's reduce Paddy cultivation

రాష్ట్రంలోని 10 జిల్లాల్లోనే 50శాతం వరి సాగు

అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 4.59లక్షల ఎకరాల్లో వరి
ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయరాదన్న కేంద్రం నిర్ణయం నేపథ్యంలో యాసంగిలో సాగు కట్టడికి ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు

మనతెలంగాణ/హైదరాబాద్ : వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి అన్ని రకాల మౌలిక సదుపాయాకల్పించి పంటసాగుకు రైతులను ప్రోత్సహిస్తున్న టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు వరి సాగు విస్తీర్ణం పెద్ద సమస్యగా మారింది. సాగు విస్తీర్ణం పెరుగుతున్న కొలది సమస్య కూడా పెరుగుతూ వస్తోంది.వరిసాగు విస్తీర్ణం తగ్గించాలని ప్రభుత్వం వానాకాలంలో పదేపదే రైతులకు సూచిస్తూ వచ్చినా ఫలితం లేకుండా పోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు రికార్డు స్థాయిలో వరిసాగు చేశారు . రాష్ట్రంలో వరిసాగు సాధారణ విస్తీర్ణం 34.01లక్షల ఎకరాలు కాగా ఇప్పటికే సాధారణ సాగుకు రెట్టింపు విస్తీర్ణంలో వరినాట్లు పడ్డాయి. ఈ సారి వానాకాలం వరి ధాన్యం ఉత్పత్తులు కోటి 38లక్షల మెట్రిక్ టన్నుల మేరకు రానున్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు ప్రాధమిక అంచనా వేశాయి. ఇంత పెద్ద మొత్తంలో ధాన్యం దిగుబడులు వస్తే వాటిని ఏవిధంగా మార్కెట్ చేయాలన్నదే ప్రధాన సమస్యగా మారింది. అందులో సుమారు 50శాతం దొడ్డు రకాల ధాన్యం ఉత్పత్తులే ఉన్నాయి. దొడ్డు రకం ధాన్యం కొనేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత చూపటం లేదు. ఈ సారి రాష్ట్రంలో ఉత్పత్తి అయిన ధాన్యంలో 60లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే సేకరించేందుకు ఎఫ్‌సిఐ నుంచి క్లియరెన్స్ లభించింది.

రాష్ట్రంలో అనూహ్యంగా వరిసాగు విస్తీర్ణం పెరగటంతో ధాన్యం దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోళ్లలో వెసులు బాటు కల్పించాలని కోరుతూ ప్రభుత్వం కేంద్రం వద్ద తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ఇకపై కేంద్రం వద్ద ధాన్యం కొనుగోళ్లకోసం పదే పదే ప్రాధేయ పడే పరిస్థితి రాకుండ ప్రభుత్వం ముందుగానే వ్యవసాయశాఖను అప్రమత్తం చేసింది. యాసంగి సీజన్‌లో వరిసాగును భారీగా తగ్గించాలని , అందుకు తగ్గ ప్రణాళికలను సిద్దం చేయాలని ప్రభుత్వం వ్యవసాయశాఖను ఆదేశించింది. ఈ నేపధ్యంలో వ్యవసాయశాఖ వరిసాగు తగ్గింపుపై దృష్టి సారించి భారీ కసరత్తులు చేపట్టింది. వరిసాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రణాళికను సిద్దం చేసింది. రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం అధికంగా ఉండే జిల్లాలపై దృష్టిపెట్టింది. సాధారణ సాగు విస్తీర్ణంకు మించి అత్యధికంగా వరిసాగు చేస్తున్న జిల్లాలను జల్లెడ పడుతోంది. ఆ జిల్లాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. వరిసాగులో పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయాయి ,దిగుబడులు లభించినా , వాటికి మార్కెట్‌లో లాభసాటి ధరలు లభించక ,ధాన్యం విక్రయాల్లో రోజలు తరబడి ఎదురవుతున్న సమస్యలును రైతులకు వివరిస్తూ గ్రామ గ్రామాన రైతులతో సమావేశాలు నిర్వహిస్తోంది. వరికంటే తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే ప్రత్యామ్నాయ పంటలను సూచిస్తూ వాటి సాగుకు రైతులను ప్రోత్సాహపరుస్తోంది.

50శాతం వరి ఈ జిల్లాలలోనే :

రాష్ట్రంలో సాగుచేస్తున్న పంటల్లో ప్రధానంగా వరిసాగు విస్తీర్ణం అధికంగా ఉండే జిల్లాలు ఏవన్నది ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. రాష్ట్రంలో వానాకాలం పంటల సాగు సీజన్ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. రాష్ట్రంలో వరిపంట సాధారణ సాగు విస్తీర్ణం 34.01లక్షల ఎకరాలు కాగా, ఇప్పటి వరకూ 61.75లక్షల ఎకరాల్లో వరినాట్లు వేశారు. అందులో అత్యధికంగా వరిసాగు చేసిన జిల్లాల్లో పది జిల్లాలను గుర్తించి ఈ జిల్లాలను ప్రధమ ప్రాధాన్యత కింద చేర్చారు. ఒక్కో జిల్లాలో 2లక్షల ఎకరాలకు పైగానే వరినాట్లు వేసినట్టు గుర్తించారు. 2లక్షల ఎకరాల లోపు వరిసాగు చేసిన జిల్లాలను ద్వీతీయ ప్రాధాన్యత కింద చేర్చారు. ప్రధమ ప్రాధాన్యగా గుర్తించిన 10 జిల్లాల్లో అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 4.59లక్షల ఎకరాల్లో వరిసాగు జరిగింది. సూర్యాపేట జిల్లా తరువాత నల్లగొండ జిల్లాలో 4.56లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 3.91లక్షల ఎకరాలు , సిద్దిపేట జిల్లాలో 3.13లక్షల ఎకరాలు, ఖమ్మంలో 2.95లక్షల ఎకరాలు , కరీంనగర్ జిల్లాలో 2.92లక్షల ఎకరాలు , కామారెడ్డి జిల్లాలో 2.76లక్షల ఎకరాలు, యాదాద్రి భువనగిరి జిల్లాలో 2.76లక్షల ఎకరాలు, మెదక్ జిల్లాలో 2.55లక్షల ఎకరాలు, మహబూబాబాద్ జిల్లాలో 2.13లక్షల ఎకరాలు వరిసాగుతో ప్రధమ ్రప్రాధన్యం జిల్లాల జాబీతాలో ఉన్నాయి.

ఈ జిల్లాల్లో వరిసాగును కంట్రోల్ చేయగలిగితే యాసంగిలో వరిసాగు విస్తీర్ణం కొంతయినా తగ్గే అవకాశాలు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. 202021యాసంగి సీజన్‌లో కూడా వరిసాగు విస్తీర్ణం రాష్టంలో 22.19లక్షల ఎకరాల సాధారణ సాగువిస్తీర్ణానికిగాను, సీజన్ ముగింపు దశకు చేరేసరికి 52.78లక్షల ఎకరాల్లో వరినాట్లు పడ్డాయి. సీజన్ ముగిసే సరికి రాష్ట్రంలో వరిసాగు విస్తీర్ణం 237శాతానికి చేరుకుంది. ఈ ఏడాది యాసంగి పంటల సాగులో గత పరిస్థితులు పునరావృతం కాకుండా ఈ సారి ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టింది. ఇటీవల ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్ సమక్షంలో జరిగిన ఉన్నతస్థాయి సామవేశంలో కూడా వరిసాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తులు , ధాన్యం విక్రయాలు , కొనుగోళ్ల సమస్యలను ప్రధానంగా చర్చించారు. రాష్ట్రంలో వరిసాగును తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల సాగువైపు రైతులను ప్రొత్సహించాలని సిఎం కెసిఆర్ ఉన్నతస్థాయి సమావేశంలో వ్యవసాయశాఖకు ధిశానిర్దేశం చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News