Sunday, April 28, 2024

కుదిపేసిన తుపాను

- Advertisement -
- Advertisement -

Cyclone Tauktae made landfall on west coast

 

పశ్చిమ తీరాన్ని గడగడలాడించిన తౌక్టే తుపాను కొవిడ్ సెకండ్ వేవ్‌తో దిక్కు తోచని స్థితిలో కూరుకుపోయిన మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్నాటక, కేరళ రాష్ట్రాలను కకావికలు చేసింది. ప్రాణ, ఆస్తి నష్టాలు కలిగించడంతో పాటు కొవిడ్ రోగులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రుల్లో చీకట్లు కుమ్మరించింది. వేలాది ఇళ్లను ధ్వంసం చేసి అసంఖ్యాక జనాన్ని నిరాశ్రయులను గావించింది. అనేక వేల వృక్షాలను కూల్చివేసింది. విద్యుత్ స్తంభాలను వంచి వేసింది. గంటకు 170 కి.మీ.లకు మించిన వేగంతో గుజరాత్‌లో తీరాన్ని తాకిన పెను తుపాను కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమన్వయ సహకారాలతో నష్టాన్ని వీలైనంతగా పరిమితం చేసుకోవడం సాధ్యమైంది గాని, తీవ్రతను బట్టి చూసినప్పుడు తౌక్టే అరుదైన అతి పెద్ద తుపానే. గత రెండు దశాబ్దాల్లో గుజరాత్ ఈ స్థాయి పెను తుపానును చూడలేదంటున్నారు. దీనికి గుజరాత్, మహారాష్ట్రలలో కలిసి 40 మంది వరకు మృతి చెంది ఉంటారని ప్రాథమిక అంచనా. సాధారణంగా తుపానులకు వేసవి అకాలమే. కాని మండు వేసవి తుపానులు మనకు కొత్త కాదు.

ఇటు బంగాళాఖాతానికి, అటు అరేబియా సముద్రానికి కూడా సుపరిచితాలే. 1891 నుంచి 2000 వరకు పశ్చిమ తీరంలో 48 వేసవి తుపానులు సంభవించగా, అందులో సగం తీవ్రమైనవని సమాచారం. ఇప్పుడు కుదిపేసిన తౌక్టే ఆ కోవలోకి వస్తుంది. సాధారణంగా తొలకరికి ముందు మే, జూన్ నెలల్లో, మళ్లీ వర్ష కాలం ముగిసిన తర్వాత అక్టోబర్, నవంబర్ నెలల్లో తుపానులు సంభవిస్తుంటాయి. బంగాళాఖాతం తుపానుల్లో 58 శాతం వరకు తొలకరికి ముందు (మే, జూన్) మిగతావి అక్టోబర్, నవంబర్ మాసాల్లో వస్తూ ఉంటాయి. ఈ నెల 27 వ తేదీకి అటు ఇటుగా బంగాళాఖాతంలో తుపాను సంభవించే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వం ముందస్తు హెచ్చరిక చేసింది. ఇది ఒడిశా, బెంగాల్ వైపు ప్రయాణం చేసి తూర్పు తీరాన్ని ప్రభావితం చేయవచ్చునని తెలియజేసింది. అయితే ఈ తుపాను తౌక్టే అంత తీవ్రమైనది కాకపోవచ్చని వెల్లడించింది. ఇటీవలి సంవత్సరాల్లో తుపానులు తరచూ సంభవిస్తూ ఉండడం ఆందోళనకరమైన పరిణామం.

ముఖ్యంగా అరేబియా సముద్రంలో తుపానులు పెరగడానికి భూతాప తీవ్రతే కారణమని నిపుణులు భావిస్తున్నారు. వాణిజ్య లాభాలను పెంచుకోడానికి భూమిని, భూ గర్భాన్ని హద్దులు మీరి వాడుకోడం వల్లనే ఈ దుస్థితి. బంగాళాఖాతంలో ఏడాదికి నాలుగు తుపానులు, అరేబియా సముద్రంలో ఒకటి మాత్రమే సంభవించడం ఆనవాయితి. 2018 వరకు ఇదే విధంగా సాగిన ఈ క్రమం ఆ తర్వాత గాడి తప్పింది. 2019లోనే అరేబియా సముద్రంలో ఐదు తుపానులు సంభవించాయి. 20142019 మధ్య ఐదేళ్లలో తుపానుల రాకడ 32 శాతం పెరిగింది. దీనికంతటికీ భూమిని మండించే వాయు కాలుష్య ఉద్ధృతే కారణమంటున్నారు. బొగ్గు పులుసు వాయువుల అతి విసర్జనకు దారి తీస్తున్న వాణిజ్య పారిశ్రామికాది కార్యకలాపాల నిర్వాకమే ఇదంతా అని రూఢి అవుతున్నది. తౌక్టే తుపాను మన సన్నద్ధతకు గట్టి పరీక్ష పెట్టింది. ముంబై తీర జలాల్లో ఒఎన్‌జిసి చమురు డ్రిల్లింగ్ పనుల్లో నిమగ్నమైన పి 305, సత్పతి గాల్ కన్‌స్ట్రక్టర్, సపోర్టు స్టేషన్ 3 అనే బార్జి (అడుగు బల్లపరుపుగా ఉండే బోటు) లలో, సాగర్ భూషణ్ అనే తవ్వోడలో గల 640 మందికిపైగా సిబ్బందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలగడం ఎంతైనా హర్షించవలసిన అంశం.

ఐదు నౌకాదళ ఓడలు, హెలికాప్టర్లు, తీర రక్షక దళాలు కలిసి ఈ కృషిని ఘనంగా నిర్వర్తించాయి. ఆధునిక సాంకేతికతను, సాధన సంపత్తిని పెంచుకోడం, ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోడం, ఇటువంటి విపత్తులలో ఉపయోగపడే నిపుణ సైనికులను తయారు చేసుకుంటూ ఉండడం అవసరమని, అది మన వద్ద దండిగా ఉందని ఈ ఉదంతం చాటుతున్నది. అలాగే తుపానులు, ఉప్పెనల వంటి జల గర్భ పరిణామాలను ముందుగా ఖచ్చితంగా తెలుసుకునే వాతావరణ శాస్త్ర పరిపక్వతను మనమిప్పుడు చాలా వరకు సాధించుకోగలిగామని చెప్పుకోవచ్చు. దానిని మరింతగా అత్యాధునికం చేసుకోవలసి ఉంది. ఒకప్పుడు వేలాది మందిని కబళిస్తూ ఉండిన ఇటువంటి జల ప్రళయాలలో ప్రాణ నష్టం ఇప్పుడు పరిమితంకావడం హర్షించవలసిన ఆధునిక విజయం. ఇదే స్ఫూర్తితో ప్రకృతి వైపరిత్యాలన్నింటినీ విజయవంతంగా ఎదుర్కోగల స్థితిని సాధించుకొనే వైపు దృష్టిని మరింతగా సారించాలి. ఆ మధ్య ఉత్తరాఖండ్‌లో హిమనదం పెల్లుబికి సొరంగంలోకి నీళ్లు చేరి పెక్కు మందిని కోల్పోయిన దుర్ఘటన మనలను ఎప్పటికీ కలచివేస్తుంది.

అటువంటివి మళ్లీ సంభవించకుండా తగిన రక్షణ వలయాలను నిర్మించుకోడంలోనే మన ప్రగతి ఇమిడి ఉంది. ప్రస్తుత కొవిడ్ సెకండ్ వేవ్ ఉద్ధృతి కూడా మన సామర్థాన్ని పరీక్షకు పెట్టిన విషయం తెలిసిందే. అన్నీ మన గతంలోనే ఉన్నాయని, మన సంప్రదాయ సంస్కృతిలోనే వేళ్లూనుకున్నాయని జబ్బలు చరుచుకొని ఆధునిక విజయాల సాధనను విస్మరించడడం జాతికి అత్యంత హానికరం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News