Monday, April 29, 2024

గోడ కూలి దళిత కూలీ కుటుంబం బలి

- Advertisement -
- Advertisement -

Dalit Coolie Family died by Wall Collopsed

తల్లి, తండ్రి, ముగ్గురు పిల్లల దుర్మరణం

నిద్రలోనే శాశ్వత నిద్ర
జోగులాంబ గద్వాల జిల్లాలో ఘోర విషాదం

వరుస వానలతో ఎడతెగని ముసురుకు తడిసి కూలిన గుడిసె గోడ
గోడ పక్కనే నిద్రిస్తున్న మోషె (35), కాంతమ్మ(30), చరణ్(12), తేజ(9), రాములు(7) మృతి
తీవ్రంగా గాయపడిన చిన్న, స్నేహలకు ఆసుపత్రిలో చికిత్స

సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి

రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా
బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇవ్వాలని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి ఆదేశం

మన తెలంగాణ/మహబూబ్ నగర్ బ్యూరో/ అయిజ : ముసురు వర్షాలు ఓ కుటుంబాన్ని బలి తీసుకున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న ముసురు, భారీ వర్షాలతో ఒక గుడిసె గోడ కూలి ఐదు మంది దుర్మరణం చెందారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం కొత్తపల్లి గ్రామంలో తెల్లవారు జామున ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన హరిజన మోషె(35),ఆయన భార్య కాంతమ్మ(30), వారి పిల్లలు చరణ్ (12), తేజ(9),రాము(7), మరో ఇద్దరు చిన్న, స్నేహతో కలిసి ఎప్పటిలాగానే తమ గుడెసెలో నిద్రించారు. అప్పటికే గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ, ముసురు వర్షాలతో బాగా నానిన గోడ ఆదివారం తెల్లవారు జామున ఒక్కసారిగా కూలి పోయింది. దీంతో గోడ పక్కనే నిద్రిస్తున్న మోషె, భార్య కాంతమ్మ, పిల్లలు, చరణ్, తేజ, రాములు నిద్రలోనే మృతి చెందారు. మరో ఇద్దరు చిన్న, స్నేహలు కూడా తీవ్రంగా గాయపడ్డారు. ఉదయం చుట్టుపక్కల వారు గుర్తించడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. గాయపడిన ఇద్దరు పిల్లలను గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉదయం నుంచి సాయంత్రం దాక తోటి పిల్లలతో ఆడుకున్న ముగ్గురు పిల్లలు మృతి చెందడంతో గ్రామం కన్నీటి పర్యంతమైంది. గ్రామంలో విషాదఛాయులు అలుముకున్నాయి.

రోజు కూలితో కుటుంబ పోషణ మృతి చెందిన దళిత మోషె సెంటు భూమి లేని రోజు కూలి, భార్యాభర్తలు కలిసి రోజు కూలి పని చేసి వచ్చిన దాంటో తమ ఐదుగురు పిల్లలను పెంచి పోషించుకుంటున్నారు. నలుగురు మగ పిల్లలు ఒకే ఒక్క ఆడపిల్ల వీరి సంతానం. పిల్లల కోసం కష్టపడి కడుపునిండా అన్నం పెట్టి వారిని ప్రేమగా చూసుకునే వారు. ఉన్న పూరి గుడిసెలోనే వీరి నివాసం. దసరా పండుగకు పిల్లలకు కొత్త బట్టలు తీసుకురావాలని, పండుగ బాగా చేసుకోవాలని పిల్లలతో అనే వారు. యధావిధిగా శనివారం కూలి పనికి పోయి రాత్రి అలసిపోయి తమ పూరి గుడిసెలోనే పడుకున్నారు. ఈ క్రమంలో తెల్లవారు జామున ఒక్క సారిగా ఇటుకల గోడ కుప్పకూలడంతో ప్రమాదం నుంచి తేరుకునే లోపే మోషె, అతని భార్య కాంతమ్మతో పాటు ముగ్గురు మగ పిల్లలు మృతి చెందారు. గట్టిగా అరవడానికి కూడా లేని విషాదంతో వారు మృతి చెందారు. ఉదయం చుట్టుపక్కన వారు చూడడంతో తీవ్ర గాయాలతో బయట పడిన చిన్న , స్నేహలను గద్వాల ఆసుపత్రికి వైద్యం కోసం తరలించారు.

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహాం సంఘటన విషయం తెలుసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటన గురించి వెంటనే ముఖ్యమంత్రి కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గాయపడిన చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు ఆదేశించారు. అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన మోషె కుటంబ సభ్యులకు టిఆర్‌ఎస్ మండల పార్టీ నుంచి రూ. 2 లక్షలు ఆర్థిక సాయం చేస్తున్నట్లు ప్రకటించారు. జిల్లా పరిషత్ చైర్మన్ సరితా తిరుపతి, మాజీ ఎంపి మందా జగన్నాధం, జిల్లా కలెక్టర్ క్రాంతి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు.

కొత్తపల్లి ఘటనపై సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి

జోగుళాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి ఘటనపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భారీ వర్షాల కారణంగా ఆదివారం ఉదయం గోడ కూలి ఐదుగురు మృతి చెందారు. ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డికి సిఎం కెసిఆర్ ఫోన్ చేశారు. జరిగిన దుర్ఘటనపై ఆయన ఆరా తీశారు. ఘటనలో మరణించిన వారికి ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని ఆదేశించారు. అలాగే మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం పక్షాన భరోసా ఇవ్వాలని సిఎం కెసిఆర్ సూచించారు. మృతుల కుటుంబంలో మిగతా వారికి ప్రభుత్వపరంగా విద్య, వైద్య సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గ్రామాలలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లను, నిర్మాణాలను అధికారులు వెంటనే గుర్తించాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆదేశించారు. ప్రమాదం పొంచిన ఉన్న ప్రజలను యుద్దప్రాతిపదికనసురక్షిత స్థావరాలకు తరలించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News