Tuesday, April 30, 2024

యుఎఇ చేరిన హైదరాబాద్, ఢిల్లీ జట్లు

- Advertisement -
- Advertisement -

యుఎఇ చేరిన హైదరాబాద్, ఢిల్లీ జట్లు
ఎడారి దేశంలో క్రికెట్ సందడి

Delhi and SRH Team Players reached UAE for IPL

దుబాయి: ఐపిఎల్‌లో తలపడేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆదివారం దుబాయి చేరుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఆదివారం యుఎఇ బయలుదేరి వెళ్లింది. మిగతా జట్లు ఇంతకుముందు దుబాయి చేరుకున్న విషయం తెలిసిందే. ఇక హైదరాబాద్, ఢిల్లీ జట్లు ఆలస్యంగా యుఎఇకి ప్రయాణమయ్యాయి. అన్ని జట్ల కంటే చాలా ఆలస్యం ఇవి ఇక్కడికి చేరాయి. ఇక భారత్ నుంచి ప్రత్యేక విమానంలో ఇరు జట్ల ఆటగాళ్లు యుఎఇ వెళ్లారు. యుఎఇ వెళ్లే ముందు విమానాశ్రయంలో దిగిన ఫొటోలను ఆయా ఫ్రాంచైజీల క్రికెటర్లు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. కాగా, ఐపిఎల్‌లో తమకు మద్దతుగా నిలువాలని సన్‌రైజర్స్ ఆటగాళ్లు అభిమానులను కోరారు. ఈ సీజన్‌లో మెరుగైన ఆటతో ట్రోఫీని సాధిస్తామనే నమ్మకాన్ని వారు వ్యక్తం చేశారు. పూర్తి భిన్నమైన వాతావరణంలో ఈసారి ఐపిఎల్ టోర్నీ జరుగుతుందని, దీంతో ప్రతి ఆటగాడికి ఇది క్లిష్ట సమయమని వారు పేర్కొన్నారు. ఏమాత్రం నిర్లక్షంగా వ్యవహరించిన భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వారు అభిప్రాయపడుతున్నారు. ఇక ఆదివారం యుఎఇ చేరిన హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు ఆరు రోజుల పాటు క్వారంటన్‌లో ఉండనున్నారు. అయితే క్వాంరటైన్‌లో ఉండే సమయంలో ఆటగాళ్లకు ప్రాక్టీస్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తారు. ఇప్పటికే పంజాబ్, ముంబై, చెన్నై, రాజస్థాన్ తదితర జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇక సోమవారం నుంచి హైదరాబాద్ క్రికెటర్లు సాధన షురూ చేయనున్నారు. ఇదిలావుండగా ఐపిఎల్ టోర్నీకి సెప్టెంబర్ 19న తెరలేవనుంది. నవంబర్ 10న జరిగే ఫైనల్‌తో ఐపిఎల్ సమరానికి తెరపడుతుంది.

Delhi and SRH Team Players reached UAE for IPL

ఈ టోర్నీలో మొత్తం 8 ఫ్రాంచైజీలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై, రన్నరప్ చెన్నైలతో పాటు మాజీ విజేతలు కోల్‌కతా, హైదరాబాద్‌లు ఈసారి ఫేవరెట్‌గా కనిపిస్తున్నాయి. ఢిల్లీ, పంజాబ్ జట్లు కూడా ట్రోఫీపై కన్నేశాయి. బెంగళూరు కూడా తొలి ట్రోఫీ అందుకోవాలనే పట్టుదలతో ఉంది. రాజస్థాన్ కూడా ఇదే లక్షంతో బరిలోకి దిగుతోంది. కరోనా నేపథ్యంలో ఈసారి ఐపిఎల్ చాలా భిన్న పరిస్థితుల్లో జరుగనుంది. యుఎఇలోని మూడు నగరాల్లో ఈ టోర్నీ జరుగుతుంది. దుబాయి, షార్జా, అబుదాబి వేదికగా టోర్నీని నిర్వహిస్తున్నారు. అన్ని మ్యాచ్‌లు బయో సెక్యూర్ విధానంలో నిర్వహించనున్నారు. ఇక ప్రతి మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లకు విధిగా ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. మరోవైపు ఆటగాళ్ల ఆరోగ్య పరిరక్షణ కోసం ఆయా ఫ్రాంచైజీలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. క్రికెటర్లకు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా పకడ్బంధీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఇందుకుగాను ప్రత్యేక పర్యవేక్షక బృందాలను ఏర్పాటు చేశాయి. వీరి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారు. కాగా, అన్ని జట్లు యుఎఇ చేరుకోవడంతో ఎడారి దేశంలో క్రికెట్ సందడి కనిపిస్తోంది. దాదాపు రెండు నెలల పాటు ఇక్కడ క్రికెటర్లు ఆట అద్భుత ఆటతో కనువిందు చేయనున్నారు.

Delhi and SRH Team Players reached UAE for IPL

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News