Tuesday, April 30, 2024

రాష్ట్రంలో రికవరీ రేటు బాగుంది

- Advertisement -
- Advertisement -

 ఎప్పటికప్పుడు కేంద్రం సంప్రదింపులు
ప్లాస్మా చికిత్సపై అవగాహన కల్పించాలి
రాష్ట్రంలో పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Kishan Reddy

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలో కరోనా రికవరీ శాతం బాగానే ఉందని, అయితే టెస్టుల సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరముందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని తాము పదేపదే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు. రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతి రోజు అన్ని రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సంప్రదిస్తోందన్నారు. వైరస్ తీవ్రత అధికారం ఉన్న ప్రాంతాలకు కేంద్ర బృందాలను కూడా పంపించి అక్కడ పరిస్థితులు తెలుసుకొని వారికి కావల్సిన సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ఇప్పటికే మూడు సార్లకు పైగా కేంద్ర బృందాలు రాష్ట్రంలో పర్యటించాయని అన్నారు.
ఆదివారం నాడిక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ దక్కన్ ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోటరీ ప్లాస్మా బ్యాంక్‌ను కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్ని విధాలుగా సహాకారం అందిస్తోందన్నారు. ఇందులో భాగంగా 14 లక్షల n95 మస్కులు, లక్ష 21 వేల పిపిఇ కిట్లు, 1400 వెంటిలెటర్లు రాష్ట్రానికి అందించిందన్నారు. అలాగే 2.2లక్షల ఆర్‌టిపిసిఆర్ కిట్లు, 1.6 లక్షల రాపిడ్ కిట్స్ ఇచ్చామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా కట్టడి చేసేందుకే కేంద్రం 13 ప్రభుత్వ, 32 ప్రయివేటు ల్యాబ్‌లకు అనుమతినిచ్చిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. కరోన నివారణకు కావాల్సిన మెడిసిన్ ఇంతవరకు నిర్ధారణ కాలేదని… అది ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నామన్నారు.

అయితే సీరియస్‌గా ఉన్న కరోనా రోగులకు ప్లాస్మా ఎక్కించడం వల్ల చాలా మంది ప్రాణాలు దక్కుతున్నాయన్నారు. గాంధీ హాస్పిటల్ లో ఇప్పటి వరకు 13 మందికి ప్లాస్మా ద్వారా చికిత్స అందించారన్నారు. సైబరాబాద్ పోలీసు కమీషనర్ సజ్జనార్ ఈ ప్లాస్మా విషయం లో చొరవ తీసుకున్నందుకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నట్లు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలందరికి ప్లాస్మా విషయం లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా పాజిటివ్ వచ్చి కోలుకున్న రికవరీ రేటు దేశ వ్యాప్తంగా 74 శాతంగా ఉందన్నారు. లక్షలాది మంది కరోనా భారిన పడి కోలుకుని ఆరోగ్యమైన జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. వారిలో అంటి బాడీస్ అభివృద్ధి చెందుతాయి… కాబట్టి వారందరు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని వాళ్ళు ప్లాస్మా ఇవ్వడానికి ముందుకు రావాలన్నారు. ఇందుకు రోటరీ క్లబ్ బాధ్యతగా తీసుకొని మరింత విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వ్యాధిని ప్రస్తుతం ఏ దేశం కూడా అరికట్టే స్థితిలో లేదన్నారు. కరోనాతో వెలకట్టలేని నష్టం మానవ సమాజానికి ఏర్పడిందన్నారు. ప్రపంచ యుద్ధం లాంటి పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయన్నారు. యుద్ధంలో సైనికులు మాత్రమే పోరాడేవారని…కానీ ఈ వైరస్ తో ప్రతి ఒక్కరు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కరోన దెబ్బ కి ఎంతో అభివృద్ధి చెందిన దేశాలు సైతం విలవిలాడుతోన్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. జనాభాలో 2 వస్థానం లో ఉన్న మనం అభివృద్ధి చెందుతున్న దేశాలతో పోటీ పడుతూ కరోనాను అరికట్టడానికి 130 కోట్ల ప్రజలను ఏకం చేసిన చరిత్ర దేశ ప్రధాని నరేంద్ర మోడీ కి చెందుతుందన్నారు. 6 నెలల క్రితం దేశంలో పిపిఇ కిట్లు, N-95 మాస్క్‌లు, వెంటిలేటర్‌లు ఒకటి కూడా ఇక్కడ తయారయ్యేవి కాదన్నారు. కాని ప్రస్తుతం ఇవన్నీ మనమే తయారు చేసి ఇతర దేశాలకు పంపిణీ చేసే స్థాయికి ఎదిగామన్నారు.

గవర్నర్ వ్యాఖ్యలు…. కేంద్రానికి సంబంధం లేదు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలు బిజెపికి, కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆమె స్వయంగా డాక్టర్ కావడం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని సూచనలు మాత్రమే చేశారన్నారు. ఈ సూచనలపై టిఆర్‌ఎస్ నేతలు విమర్శలు చేయడం తగదని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు.

Recovery rate is well in Telangana: Minister Kishan Reddy

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News