Saturday, April 27, 2024

రాముడు నడయాడిన ప్రదేశాల అభివృద్ధి..

- Advertisement -
- Advertisement -

భోపాల్: అయోధ్యలో రామాలయ ప్రాణ ప్రతిష్టాపన మహోత్సవానికి ఒకపక్క ఏర్పాట్లు జోరుగా సాగుతున్న నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో శ్రీరాముడి యాత్రా మార్గాన్ని అభివృద్ధి చేసే ప్రాజెక్టులో ముందడుగు పడింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంగళవారం శ్రీ రామచంద్ర పథ్ గమన్ ట్రస్టు మొదటి సమావేశాన్ని సాత్నాలో నిర్వహించారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ఆరు నెలల మందు అప్పటి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ ట్రస్టును ఏర్పాటు చేశారు. బిజెపి మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించింది. శ్రీరామ భగవాన్ పథ్ గమన్ మార్గ్‌ను దశల వారీగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి యాదవ్ సమావేశంలో వెల్లడించారు. 16 సంవత్సరాలుగా మూలనపడిన ఈ ప్రాజెక్టుకు ఎట్టకేలకు మోక్షం లభించనున్నది.

14 సంవత్సరాల వనవాసం కోసం అయోధ్యను వీడిన శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు మధ్యప్రదేశ్‌లోని అనేక ్రప్రదేశాల మీదుగా ముందుకు సాగారని హిందువులు విశ్వసిస్తారు. రాముడు నడయాడిన ప్రదేశాలలో సాత్నా జిల్లాలోని చిత్రకూట్, కత్నిలోని బద్వారా, జబల్‌పూర్‌లోని రాంఘాట్, మాండ్లోని రాంనగర్ మొదలైనవి ఉన్నాయి. ఇవేగాక షాదోల్, దిండోలి, అమర్‌కంఠక్‌లోని ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఈ ప్రదేశాలలోని అనేక ఆలయాలు యాత్రా స్థలాలుగా పెద్దసంఖ్యలో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఈ యాత్రా స్థలాలన్నిటినీ అనుసంధానం చేసి పర్యాటకులకు మెరుగైన మౌలిక సౌకర్యాలను కల్పించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. రామ్ వన్ గమన్ పథ్‌పై 2007లో అప్పటి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లాంఛనంగా ప్రకటన చేశారు. ఈ ఆధాత్మిక పర్యాటక కారిడార్ తొలి దశ అభివృద్ధి కోసం రూ. 56 కోట్లు కేటాయిస్తున్నట్లు కూడా అప్పట్లో ఆయన ప్రకటించారు. 2007లో ఈ ప్రకటన వెలువడినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు గడచిన 16 సంవత్సరాలుగా కాగితాలకే పరిమితమైపోయింది.

మధ్యలో కమల్‌నాథ్ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లు అధికారంలో ఉండగా మిగిలిన 14 ఏళ్లు బిజెపియే అధికారంలో ఉంది. చౌహాన్ ప్రకటన వెలువడిన ఎనిమిదేళ్ల తర్వాత 2015లో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రూ. 13,000 కోట్లతో రామాయణ్ సర్కూట్ ప్రాజెక్టును ప్రకటించింది. శ్రీరాముడిడు నడయాడిన ప్రదేశాలను అనుసంధానం చేసి వాటిని అభివృద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. ఈ ప్రదేశాలు తొమ్మిది రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. వీటిలో ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్ మొదలైనవి ఉన్నాయి. ఈ ప్రకటన వెలువడిన వెంటనే చౌహాన్ ప్రభుత్వం తాము కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామ్యం అవుతున్నట్లు ప్రకటించింంది. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 1,000 కోట్లను రాష్ట్రంలోని బిజెపి ప్రభుత్వం కేటాయించింది. కళలను, సంస్కృతిని ప్రోత్సహించేందుకు రామ్ వన్ గమన్ పథ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. అప్పడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి ఓటమిపాలై కమల్‌నాథ్ సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం మార్చిలో ఏర్పడింది.

పర్యాటక సర్కూట్ అభివృద్ధి కోసం రూ.600 కోట్లతో ఒక ప్రాజెక్టుకు కమల్‌నాథ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టు కాగితాల నుంచి కార్యరూపం దాల్చే సమయానికి కొందరు ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింది. చౌహాన్ సారథ్యంలో మళ్లీ బిజెపి 2020 మార్చిలో అధికారాన్ని చేపట్టింది. ఇంతలో దేశంలో కరోనా మహమ్మారి ప్రబలడంతో రెండేళ్లపాటు ఈ ప్రాజెక్టు అటకెక్కింది. మళ్లీ 2022లో బిజెపి ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు తొలి దశకు కార్యాచరణ ప్రకటించింది. ఈ కార్యాచరణ ప్రకారం ఈ ప్రాజెక్టు వ్యయంలో 60 శాతం నిధులను కేంద్రం భరించాల్సి ఉంటుంది. మిగిలిన వ్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. కాగా..మంగళవారం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి యాదవ్ తొలి దశలో రామ భగవాన్ పథ్ గమన్ మార్గ్‌ను దశల వారీగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించి దాన్ని దశలవారీగా అమలుచేస్తామని ఆయన తెలిపారు.

అభివృద్ధి ప్రణాళికలో మౌలిక సౌకర్యాల కల్పనతోపాటు మతపరమైన అవగాహన కల్పించడం, ఆధ్మాత్మిక వికారసం, రామ కథకు సంబంధించిన రూపాన్ని కల్పించడం మొదలైన అభివృద్ధి పనులు ఉంటాయని ఆయన చెప్పారు. రానున్న అసెంబ్లీ సమావేశాలలో ఈ ప్రాజెక్టుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు చేస్తామని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక, మతపరమైన ట్రస్టుల శాఖ మంత్రి ధర్మేంద్ర లోఢి తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని, ఈ ప్రాజెక్టుకు అవసరమైన బడ్జెట్‌ను అందచేస్తామని ఆయన చెప్పారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News