Wednesday, May 1, 2024

నా తెలంగాణ జన వజ్రాలగని

- Advertisement -
- Advertisement -

Development of Telangana is possible with KCR

 

ప్రపంచానికి దుఃఖ నివారణోషధి నందించిన గౌతమ బుద్ధుడు నడయాడిన నేల. కోటి లింగాల, ధూళికట్ట ప్రాంతాలు రాజధానులుగా శాతవాహన రాజులు విశాల సామ్రాజ్యాన్ని పాలించిన భూమి. కాకతీయ రాజులు సువిశాల వరంగల్ రాజధానిగా పాలన కొనసాగించిన ధరణి. నల్లగొండ కేంద్రంగా విష్ణుకుండిన రాజులు పాలన సాగించిన భూమి. హైదరాబాద్ గోల్కొండ కేంద్రంగ నైజాం నవాబులు సువిశాల రాజ్యన్నేలిన నేల. హైదరాబాద్ దక్కన్ రాజ్యాన్ని కొన్ని వంద లేండ్లు పాలించిన నైజాం నవాబు ఆ నాటికి ప్రపంచ వ్యాప్త ధనవంతుల్లో మొదటివాడుగా ప్రసిద్ధిగాంచాడు. అయితే ఈ బుద్ధభూమి యుద్ధ భూమిగా నిత్యగాయాలతో సలుపరింపులకు లోనవుతూనే ఉంది.

స్వాతంత్య్ర సమీప కాలంలోనూ, ఆ తర్వాత కొద్దికాలం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో వేలాది మంది అసువులు బాశారు. ఇది భారత దేశానికే భూపోరాట వారసత్వాన్నందించిన భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం సాగిన పోరాటమే. కాని దీన్ని నైజాం వ్యతిరేక పోరాటంగా చిత్రించడం ఓ వైరుధ్యమనక తప్పదు. పోరాటననేల, ప్రజలు తెలంగాణలో ఉంటే దీనికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టు నాయకులు మాత్రం ఆంధ్ర ప్రాంతానికి చెందిన వారే. రక్తతర్పణం జరిగింది తెలంగాణ వారితో, తెలంగాణ నేలలో అయితే కమ్యూనిస్టు రాజకీయాల్లో జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ నాయకులుగా ఎదిగింది సీమాంధ్ర నాయకులే. ఈ నేల స్వాతంత్యానంతరం అనేక పార్టీలకు, రాజకీయ నాయకులకు స్థానమిచ్చింది. ఎదగడానికి ఉపయోగపడింది. స్వాతంత్యానంతరం జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో లాగే హైదరాబాద్ దక్కన్ (తెలంగాణ)లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతిపక్షంగా సి.పి.ఐ. చెప్పకోదగ్గ సీట్లను పొందగలిగింది. అటు కాంగ్రెస్ కానీ, కమ్యూనిస్టులు కాని తెలంగాణకు ఒరగ బెట్టిందేం లేదు.

ప్రజాభిప్రాయానికి, స్థానిక మేధావుల అభిప్రాయానికి భిన్నంగా హైదరాబాద్ దక్కన్‌ను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేశారు. విశాలాంధ్ర పేరు మీద తెలంగాణ ఐడెంటిని మటుమాయం చేశారు. 1956 వరకున్న తెలంగాణ ముఖ్య పట్టణం హైదరాబాద్ అస్థిత్వాల, తెలంగాణ అస్థిత్వాలు దుంప నాశనమైంది. దేశంలోనే మొదటి సారిగా కమ్యూనిస్టు పార్టీకి సముచిత స్థానం ఇచ్చినందుకు తెలంగాణను పరాధీనం చేయడంలో అటు కాంగ్రెస్, ఇటు కమ్యూనిస్టులు ముఖ్యపాత్ర వహించారు. అప్పటి నుండి తెలంగాణ నిత్యగాయాల పాలవుతూ, వివక్షకు గురవుతూ రోదిస్తూనే ఉంది. ఇక అప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించే పార్టీ ఏ దయినా పాలకులు మాత్రం ఆంధ్రులే. అతి స్వల్పకాలం కాంగ్రెస్ నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ఆధిపత్యం ఆంధ్ర నాయకులది, కేంద్ర నాయకులదే నీళ్ళు, నిధులు, నియామకాలు, భాష, సంస్కృతి అన్నీ వివక్షకు గురై 58 సంవత్సరాలు తెలంగాణ వివక్ష గాయాలతో బాధ పడుతూనే ఉంది.

నైజాం పాలనా కాలంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఆంధ్ర వలస పాలకుల పాలనలో వెనుకబడిన రాష్ట్రాల జాబితాలోకి వెళ్లింది. ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన పన్నెండు సంవత్సరాలలోపే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర పోరాటం ఉవ్వెత్తున లేచింది. 369 మంది చాకుల్లాంటి విద్యార్ధులు ఈ పోరాటంలో ఆంధ్ర పాలకుల కాల్పులకు గురయ్యారు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోని సామరస్యాన్నిగుర్తించలేదు. నాయకత్వం వహిస్తున్న వారిని నయనాభయానా బెదిరించి, భయపెట్టి, పదవులిచ్చి లోబరుచుకుంది. ఉద్యమాన్ని రక్తపుటేర్లు పారించి అణచివేసింది. ప్రజలు తెలంగాణ ఆకాంక్ష గొంతునులిమి చంపి వేయబడింది. ఆంధ్ర పాలకులు ఉద్యమాన్ని అణచివేయడానికి హింస నెన్నుకున్నారు రెండేళ్లలో ఉద్యమం అణచివేయబడింది. అప్పటి పాలక పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్షపార్టీ సి.పి.ఐ. ప్రత్యేక రాష్ట్రానికి వ్యతిరేకమే. ఉద్యమ పార్టీ తెలంగాణ ప్రజా సమితి తనను తాను కాంగ్రెస్ లోవిలీనం చేసుకుంది. ఆ పార్టీ ముఖ్యులంతా కాంగ్రెస్ తీర్ధంతో మంత్రులయ్యారు. తెలంగాణ కొరకు పార్టీ అనే రాజకీయ నినాదాన్ని ఓ ప్రయోగంగా ఉపయోగించుకున్నారు తప్ప తెలంగాణ సాధనలో చిత్తశుద్ధిని ప్రదర్శించలేదు. ఆ తర్వాత వచ్చిన పాలకులదీ తెలంగాణ పై అదే వరుస.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆగిపోతున్న సమయంలోనే తెలంగాణలో భూపోరాట ఉద్యమం మొదలయింది. స్వతంత్రకాలం నాటి తెలంగాణ సాయుధ పోరాటమైనా, ఈ భూపోరాటాలైనా వర్గ పోరాటాలే. సాయుధ హింసను ఆశ్రయించినవే. భూస్వాములు, జమీందార్లపై భూమి పంపకం కోసం జరిగిన పోరాటాలే. ఈ నక్సలైట్ ఉద్యమంలోనూ అగ్ర నాయకులు కొండపల్లి సీతారామయ్య, చంద్ర పుల్లారెడ్డి, కె.జి.సత్యమూర్తి లాంటివారంతా ఆంధ్ర ప్రాంతం వారే. 1970 ప్రాంతం నాటికి ఆంధ్రప్రాంతం సుసంపన్నమైంది. మధ్యాంధ్ర గోదావరిపై కాటన్ బ్యారేజ్, కృష్ణ బ్యారేజ్ లాంటి కట్టడాలతో సుసంపన్నంగా ఉంది. తెలంగాణలో కంటే పెట్టుబడిదారులు ఇక్కడే ఎక్కువ. కాని ఆంధ్ర కమ్యూనిస్టు నాయకులు నక్సలైట్ ఉద్యమాన్ని తెలంగాణలో ప్రారంభించారు. తమ ప్రాంతాన్ని సురక్షితంగా ఉంచుకున్నారు.

తెలంగాణ రక్తపుటేర్లలో ముంచెత్తారు. తెలంగాణను విప్లవ రాజకీయాలకు ప్రయోగశాలగా ఎన్నుకున్నారు. పెట్టుబడిదార్లు, ప్రారంభించిన తర్వాత ఈ ఆంధ్ర ప్రాంతానికి విస్తరించలేదు. ఉద్యమం వల్ల ఫలితాలు, నష్టాల సంగతెలా ఉన్నా తెలంగాణలో వేలాది మంది యువతరం ఇందులో అసువులు బాశారు. స్వాతంత్య్రానంతర యువతరం కళాశాల చదువులు వదిలి అందులోకురికారు. ఆంధ్రప్రాంత పెట్టుబడిదారులు మరింత ధనవంతులయ్యారు, బలవంతులయ్యారు. అక్కడ నుంచి కొత్త పెట్టుబడిదారులు పుట్టుకొచ్చారు. తెలంగాణలో పెట్టుబడిదారులు ఎదుగలేదు. ఆంధ్ర రాజకీయాలు పెట్టుబడిదారుల సంఖ్య పెరగడం తో మరింత బలీయమయ్యాయి. తెలంగాణ నుంచి ఏ విధమైన చిన్న తిరుగుబాటు వచ్చినా నక్సలైట్‌గా ముద్ర వేసి చంపారు. తెలంగాణ మరింత విస్మరణకు గురయింది.

తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో, ఢిల్లీ పాలకుల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ ఎన్.టి.ఆర్. ప్రభంజనంలా దూసుకొచ్చాడు. భోళాశంకర మనస్తత్వం గల తెలంగాణ ప్రజలు ఎన్.టి.ఆర్.ను ఆహ్వానించారు. హృదయానికి హత్తుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కంటే తెలంగాణలోనే తెలుగుదేశంకు ఎక్కువ ఆదరణ లభించింది. ముప్పైఆరు సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు తొమ్మిది నెలల్లో చరమగీతం పాడారు. కాని ఎన్.టి.ఆర్. తెలుగు ఆత్మగౌరవంలో తెలంగాణ లేదు. తెలంగాణ ఆత్మగౌరవమూ, అస్తిత్వమూలేదు. అంతవరకున్న హైదరాబాదీ కూడా ఆంధ్రవాళ్లుగా మారిపోయింది. ఆంధ్ర వలసలు విపరీతంగా పెరిగాయి. ఆంధ్రుల పెట్టుబడులు పెరిగాయి. తెలుగుదేశంను ఆహ్వానించినందుకు తెలంగాణ మరింత నష్టపోయింది. అస్తిత్వమూ కోల్పోయింది. తెలుగుదేశానికి దగ్గరున్న తెలుగు సినిమా రంగంలో, ప్రచార సాధనల్లో తెలంగాణ రాష్ట్ర భాష, సంస్కృతి అన్నీ వివక్షకు గురయ్యాయి. ఎన్.టి.ఆర్.ను దించి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు పాలనలో తెలంగాణ మరింత వివక్షను గురైయింది.

వ్యవసాయం, విద్యుత్ సమస్య, చేనేత కార్మికుల సమస్య లెన్నో, ఆత్మహత్యలూ జరిగాయి. ఆంధ్ర పెట్టుబడుదారుల ఆక్రమణలు అనేక రెట్లు పెరిగాయి. తెలంగాణ కోసం ఓ రాజకీయ పార్టీ అవసరాన్ని ముందుకు తెచ్చాయి. చంద్రబాబు పాలన, తెలుగుదేశం పార్టీ, తెలంగాణను ఓ రాజకీయ ప్రయోగశాలగానే ఉపయోగించుకొని ఇక్కడ బడ్జెట్‌ను, సంపదను దోచుకొని అక్కడ పెట్టింది. దేశమంతా తిరస్కరించినా ఆంధ్రప్రదేశ్, (తెలంగాణ) ఇందిరాగాంధీని సపోర్ట్ చేసింది. 1977లో కాంగ్రెస్‌కు పట్టం కట్టింది. రాజశేఖర్ రెడ్డి కొన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి తెలంగాణ నీటి అవసరాలు తీర్చలేదు. జలయజ్ఞం ఓ కంటి తుడుపు చర్యే అయింది. చంద్రబాబు తెలంగాణ పదాన్ని ఉచ్చరించడానికి కూడా నేరమైన చర్యగా భావిస్తే, రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో ముఖ్యమంత్రులైన రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డిల పాలనలో తెలంగాణ కోసం పోరాడిన విద్యార్ధుల 1200 మందికి పైగా మరణించారు. ఇలా రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ ఉసురు పోసుకున్నాయి. స్వాతంత్య్రానంతరం ఏ ఒక్క పార్టీ కూడా తెలంగాణను పెట్టించుకోలేదు. జాతీయ పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బి.జె.పి. అందరూ చివరి వరకూ తెలంగాణను వ్యతిరేకరించి యువకుల ఆత్మహత్యలకు కారకులయ్యారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలంటే రాజకీయ పార్టీ కావాల్సిన అవసరాన్ని గుర్తించిన రాజకీయ నాయకుడు కె.సి.ఆర్. తెలంగాణ కోసమే టి.ఆర్.ఎస్.ను స్థాపించి 13 సంవత్సరాలు మడమతిప్పని పోరాటం చేశారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న కుట్రను, ఉమ్మడి రాజధాని కుట్రను భగ్నం చేశారు. తెలంగాణ కోసమే అంకితమైన తనదైన మార్క్‌తో పాలన కొనసాగిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరధ, విద్యుత్ సమస్య తీర్చడం అద్భుతాలైతే, రైతుబంధు లాంటి పథకాలు దేశానికి ఉదాహరణప్రాయం. వ్యవసాయాన్ని పండుగ చేసి, సబ్బండవర్ణాల ఆదాయాలు పెంచి పాలన సాగిస్తున్న కె.సి.ఆర్., తెలంగాణకే అంకితమైన టి.ఆర్.ఎస్. తెలంగాణ వలస పాలకుల, జాతీయ పార్టీల పాలనలో కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరించడానికి టి.ఆర్.ఎస్. పాలన ఇంకో రెండు దశాబ్దాలయినా బ్రేక్ లేకుండా సాగాల్సిన చారిత్రకావసరముం ది.

షర్మిలాలు కానీ, మరెవరు కాని ఏ సిద్ధాంత ప్రాతిపదిక లేకుండా కె.సి.ఆర్.ను ఓడించడమే లక్ష్యంగా పార్టీలు పెడితే అది వృథా ప్రయాసేనని తెలంగాణలో ఇదువరకున్న చిన్న, చిత క, జాతీయ పార్టీలను చూస్తే అర్ధమవుతుంది. దశాబ్దాల పాటు అన్ని రకాల వివక్షకు, విస్మరణకు గురయిన తెలంగాణను అభివృది పథంలో నడపడం కె.సి.ఆర్.కు తప్ప మరెవరికీ సాధ్యం కాదని గత ఏడేళ్ళ పాలన రుజువు చేస్తుంది. తెలంగాణను ఇప్పుడు కూడా రాజకీయ ప్రయోగశాలగా మార్చదలుచుకుంటే అదో చారిత్రక తప్పిదమే అవుతుంది తెలంగాణ వారైనా సరే.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News