Saturday, April 27, 2024

లోటు భర్తీలో వివక్ష

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ/హైదరాబాద్: దేశంలోని 14 రాష్ట్రాలకున్న రెవెన్యూ లోటును భర్తీ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికొచ్చేసరికి ఆ పనిచేయకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. రెవెన్యూలోటులో ఉన్న ఈ 14రాష్ట్రాలు లోటులో ఉండటానికి కేంద్ర ప్రభుత్వం కారణం కాదని, స్వయంగా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఉన్న పరిస్థితులే కారణమని, కానీ తెలంగాణ రాష్ట్రంలో రెవెన్యూ లోటు సమస్య తలెత్తడానికి మాత్రం ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వమే కారణమని ఆర్థికశాఖలోని పలువురు సీనియర్ ఆధికారులు అంటున్నారు. అందుచేతనే తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ లోటును కూడా కేంద్ర ప్ర భుత్వమే భర్తీ చేయడం న్యాయమని ఆ అధికారు లు బల్లగుద్ది వాదిస్తున్నారు. కానీ కేంద్రం ప్రభుత్వం రెవెన్యూ లోటు సమస్యతో బాధపడుతున్న 14 రాష్ట్రాలకు సోమవారం రూ. 7,183. 42 కోట్ల నిధులను విడుదల చేసిందని, ఆ జాబితాలో తెలంగాణ రాష్ట్రం లేకపోవడం బాధాకరమంటున్నారు.

నవంబర్ నెలకు సంబంధించిన రెవెన్యూ లోటు నిధులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.879.8 కోట్లను కేంద్రం విడుదల చేసింది. అస్సాంకు రూ.407.50 కోట్లు, కేరళకు రూ.1097. 83 కోట్లు, మణిపూర్‌కు రూ.192.50, మేఘాలయకు రూ. 86.08 కోట్లు, మిజోరాంకు రూ.134.58 కోట్లు, నాగాలాండ్ కు రూ.377.50 కోట్లు, పంజాబ్ రాష్ట్రానికి రూ.689. 50 కోట్లు, రాజస్థాన్‌కు రూ.405.17 కోట్లు, సిక్కిం కు రూ.36.67 కోట్లు, త్రిపురకు రూ.368.58 కోట్లు, ఉత్తరాఖాండ్‌కు రూ.594. 75 కోట్లు, పశ్చిమ బెంగాల్‌కు రూ.1,132.25 కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిం ది. పైగా ఈ నిధులను 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే విడుదల చేసినట్లుగా కేంద్ర ప్రభుత్వ ఆర్థ్ధిక మంత్రిత్వశాఖ సగర్వంగా ప్రకటించింది.

15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు 2020-21వ ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26వ ఆర్థ్దిక సంవత్సరం వరకూ ఈ 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటును భర్తీ చేయాలని ఉంది. అందులో భాగంగానే ఈ 14 రాష్ట్రాలకు 2022-23వ ఆర్థ్ధిక సంవత్సరానికి ఇప్పటి వరకూ రూ.57,467 .33 కోట్ల నిధులను విడుదల చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం రాష్ట్రాలకు రెవెన్యూ లోటు సమస్య తలెత్తితే కేంద్రమే ఆర్థికంగా ఆదుకోవాల్సి ఉందని, అయితే ఈ చట్టం తెలంగాణ రాష్ట్రానికి వర్తించదా…? అని ఆ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఆర్టికల్ 275 ప్రకారం, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకే రెవెన్యూలోటును భర్తీ చేస్తున్నట్లుగా పేర్కొన్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ విషయానికొచ్చే సరికి అదే 15వ ఆర్థిక సంఘం సిఫారసులను పట్టించుకోలేదని, కనీసం 14వ ఆర్థ్ధిక సంఘం సిఫారసులను గానీ, నీతి ఆయోగ్ సిఫారసులను కూడా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఆర్థిక సంఘాల సిఫారసులను కేంద్రం తూచ తప్పకుండా అమలుచేస్తే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలు, ఇతర పథకాలకు కలిపి మొత్తం రూ.34,149 కోట్ల నిధులు రావాల్సి ఉందని, కానీ కేంద్రం తెలంగాణకు తీరని అన్యాయం చేసిందనడానికి ఈ అంశాలే నిలువెత్తు నిదర్శనాలని అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ 14 రాష్ట్రాలకు రెవెన్యూ లోటును భర్తీ చేయడాన్ని తాము తప్పుబట్టడంలేదని, తమకెలాంటి అభ్యంతరం కూడా లేదని, అయితే కేంద్ర ప్రభుత్వ నిర్వాకాల మూలంగా, కేంద్రం తీసుకొన్న తప్పుడు నిర్ణయాల మూలంగా రెవెన్యూ మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇప్పుడు రెవెన్యూ లోటు సమస్యను ఎదుర్కొంటోందని, ఇలాంటి పరిస్థితుల్లో రెస్కూలోనికి రావాల్సిన కేంద్ర ప్రభుత్వం ఆ పనిచేయకపోవడమే చర్చనీయాంశమయ్యిందని ఆ అధికారులు అంటున్నారు. బడ్జెట్ అంచనాలు తారుమారయ్యి రెవెన్యూ మిగులు నుంచి లోటులోకి పడిపోతే అది రాష్ట్ర ప్రభుత్వ పొరపాటు అవుతుందని, కానీ కేంద్రం తీసుకొన్న నిర్ణయాల మూలంగా రెవెన్యూలోటు ఏర్పడితే మాత్రం కేంద్రమే ఆ లోటును భర్తీచేయాల్సి ఉంటుందని, ఈ లెక్కన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.11,072.76 కోట్ల నిధులను విడుదలచేసి ఆదుకోవాల్సి ఉందని ఆ అధికారులు అంటున్నారు.

ఎందుకంటే రుణాల సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు 2022-23వ ఆర్థ్దిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత రెండు నెలలు ఆలస్యంగా విడుదల చేశారని, దీని మూలంగా నెలవారీగా సేకరించే నిధుల్లో ఇప్పటికే రూ.10,200 కోట్లను నష్టపోయిన తెలంగాణ ప్రభుత్వానికి అదనంగా రెవెన్యూ లోటు సమస్య కూడా తలెత్తిందని, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల మూలంగానే జరిగిందని ఆ అధికారులు గట్టిగా వాదిస్తున్నారు. రుణాల సమీకరణ నిబంధనల్లో మార్పులు చేయకుండా ఉంటే తెలంగాణ రాష్ట్రం 2022-23వ ఆర్థ్ధిక సంవత్సరంలో రూ.3,754 కోట్ల రెవెన్యూ మిగులుతో కళకళలాడుతూ ఉండేదని, కేవలం రాజకీయ పరమైన కక్ష సాధింపుల్లో భాగంగా ఒక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బకొట్టేందుకు కేంద్రం తెచ్చిన లోపభూయిష్టమైన నిబంధనల మూలంగా రెవన్యూ లోటును ఎదుర్కోవాల్సి వచ్చిందని తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. గత సెప్టెంబర్ నాటికి రూ.3,489 కోట్ల రెవెన్యూ లోటును చవిచూడాల్సి వచ్చిందని, ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ అధీనంలో పనిచేసే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (సి.ఎ.జి-కాగ్) తన గణాంకాల నివేదికలోనే స్పష్టం చేసిందని వివరించారు.

ఆర్థ్ధిక సంవత్సరం ముగిసే 2023 మార్చి నెలాఖరు నాటికి రెవెన్యూ లోటు సమస్య మరింత పెరగవచ్చునని ఆ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇకనైనా కేంద్రం తాను చేసిన తప్పులను సరిదిద్దుకొని తెలంగాణ ప్రభుత్వానికి నిధుల సమీకరణకు సృష్టించిన అడ్డంకులను తొలగించాలని, లేకుంటే రెవెన్యూలోటు సమస్యను పరిష్కరిస్తూ ఆ లోటుగా ఉన్న నిధులను తెలంగాణ రాష్ట్రానికి విడుదల చేయాలని కోరుతున్నారు. లేకుంటే తెలంగాణ రాష్ట్రంలో పాగా వేయాలనుకునే కేంద్ర సర్కార్‌ను పాలిస్తున్న బిజెపికి తమ రాష్ట్రంలో ఎలాంటి ఆదరణ లభించదని, ఇప్పటికే ఈ విషయం మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రుజువు కూడా అయ్యిందనే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News