Friday, April 26, 2024

‘జకో’ @19

- Advertisement -
- Advertisement -

Djokovic is French Open champion

ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్ నొవాక్, ఫైనల్లో పోరాడి ఓడిన సిట్సిపాస్

పారిస్: సెర్బియా యోధుడు, టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం నువ్వానేనా అన్నట్టు సాగిన హోరాహోరీ పోరాటంలో ఐదో సీడ్ స్టెఫానొస్ సిట్సిపాస్ (గ్రీస్)ను ఓడించి తన ఖాతాలో రెండో ఫ్రెంచ్ ఓపెన్ ట్రోఫీని వేసుకున్నాడు. అంతేగాక కెరీర్‌లో ఓవరాల్‌గా 19వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్‌ను సాధించాడు. ఈ క్రమంలో అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ సాధించిన రఫెల్ నాదల్ (స్పెయిన్), రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)లకు అడుగు దూరంలో నిలిచాడు. మరోవైపు కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన గ్రీక్ వీరుడు సిట్సిపాస్ అసాధారణ పోరాట పటిమను కనబరిచినా రన్నరప్‌తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చివరి వరకు అనూహ్య మలుపులు తిరిగిన ఫైనల్ సమరంలో జకోవిచ్ 67, 26, 63, 62, 64 తేడాతో సిట్సిపాస్‌ను ఓడించాడు.
పడిలేచాడు..

ఆరంభంలో సిట్సిపాస్ అద్భుత ఆటను కనబరిచాడు. జకోవిచ్‌ను హడలెత్తిస్తూ ముందుకు సాగాడు. చూడచక్కని షాట్లతో అలరించిన సిట్సిపాస్ మ్యాచ్‌పై పట్టు సాధించాడు. ఇదే క్రమంలో టైబ్రేకర్ వరకు వెళ్లిన సెట్‌లో నొవాక్‌ను మట్టికరిపించాడు. ఇక రెండో సెట్‌లో సిట్సిపాస్ మరింత చెలరేగి పోయాడు. జకోవిచ్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అలవోకగా సెట్‌ను దక్కించుకున్నాడు. కానీ మూడో సెట్ నుంచి జకోవిచ్ ఆధిపత్యం చెలాయించడం ప్రారంభించాడు. ఒత్తిడిని సయితం తట్టుకుంటూ మళ్లీ పైచేయి సాధించేందుకు ప్రయత్నించాడు. తన మార్క్ ఆటతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచడంలో సఫలమయ్యాడు. అసాధారణ పోరాట పటిమతో మళ్లీ మ్యాచ్‌లోకి వచ్చాడు. ఇదే సమయంలో సిట్సిపాస్‌ను కంగుతినిపిస్తూ సునాయాసంగా మూడో సెట్‌ను గెలుచుకున్నాడు. తర్వాతి సెట్‌లో కూడా జకోవిచ్ జోరును కొనసాగించాడు.

సిట్సిపాస్‌ను హడలెత్తిస్తూ లక్షం వైపు సాగాడు. అద్భుత షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేసిన జకోవిచ్ అలవోకగా నాలుగో సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో స్కోరు 22తో సమమైంది. ఇక ఫలితాన్ని తేల్చే ఐదో, చివరి సెట్‌లో కూడా జకోవిచ్ జోరును ప్రదర్శించాడు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకు దూసుకెళ్లాడు. మరోవైపు సిట్సిపాస్ కూడా పోరాటం చేశాడు. ఈసారి మెరుగైన ప్రదర్శనతో మళ్లీ పుంజుకునేందుకు ప్రయత్నించాడు. కానీ సిట్సిపాస్ ఆశలు ఫలించలేదు. అపార అనుభవజ్ఞుడైన జకోవిచ్ ఒత్తిడిని సయితం తట్టుకుంటూ లక్షం వైపు అడుగులు వేశాడు. ఇదే క్రమంలో 64తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి తన ఖాతాలో రెండో రెండో ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్‌ను జమ చేసుకున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News