Friday, April 26, 2024

‘తాటక’ బూటకపు ఎన్‌కౌంటర్!

- Advertisement -
- Advertisement -

During Emergency Indira imprisoned publicly questioning community

 

ప్రశ్నలపై ప్రస్తుతం అప్రకటిత నిషేధం కొనసాగుతోంది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరాగాంధి ప్రభుత్వం బహిరంగంగా ప్రశ్నించే సమాజాన్ని ఖైదు చేసింది. చట్టాలు, రాజ్యాంగం అమలులో ఆంక్షలుండేవి. దీంతో ఎమర్జెన్సీకి, ఆంక్షలకు వ్యతిరేకంగా మేధో సమాజం దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. దానికి జయప్రకాశ్ నారాయణ లాంటి సోషలిస్టులు నాయకత్వం వహించారు. వీరి నేతృత్వంలో కొత్త తరం రాజకీయ రంగం మీదికి వచ్చింది. వారి పోరాటాలు, త్యాగాల మూలంగా ఇందిరా గాంధీ/కాంగ్రెస్ ప్రభుత్వం దాష్టికాలు ప్రజలకు తెలియవచ్చాయి. ఇందిరాగాంధి ప్రత్యర్థి రాజ్‌నారాయణ్ వేసిన దావా వల్ల ఆమెను అలహాబాద్ కోర్టు లోక్‌సభ సభ్యురాలుగా అనర్హురాలు అంటూ తీర్పునిచ్చింది. ఇవన్ని కారాణల వల్ల 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ స్థానంలో సోషలిస్టు భావాలున్న జనతాపార్టీ నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. ఇందులో భారతీయ జనసంఘ్, భారతీయ లోక్‌దళ్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్) తదితర పార్టీలున్నాయి.

ఇట్లా అధికారంలోకి వచ్చిన కూటమికి పార్లమెంట్‌లో అటల్ బిహారి వాజ్‌పేయి నాయకుడిగా ఉన్నాడు. చైర్‌పర్సన్ మొరార్జి దేశాయి. ఈయన మొట్టమొదటి కాంగ్రేసేతర ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఇంతవరకు బాగానే ఉంది. పాతుకు పోయిన దుర్వ్యవస్థలను ప్రశ్నించడం నుంచి ఉద్భవించిన జనతాపార్టీ లోనుంచి విడిపోయిన భారతీయ జనసంఘ్ భారతీయ జనతాపార్టీగా రూపాంతరం చెందింది. ఇట్లా 1984లో ఇద్దరు సభ్యులతో పార్లమెంటరీ ప్రస్థానం ప్రారంభించిన భారతీయ జనతాపార్టీ ఇవ్వాళ ప్రశ్నించడాన్ని నిషేధించింది. అదీ ఎమర్జెన్సీలో అమల్లో ఉన్న చట్టాల జోలికి పోకుండానే ‘ప్రజాస్వామ్య’పాలనలోనే ఫాసిజాన్ని అమలు చేస్తోంది. యూఎపిఎ చట్టం అందులో భాగమే! ఈ చట్టం ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ దాన్ని అతిగా వినియోగిస్తున్నది బిజెపి ప్రభుత్వం. నేరం రుజువు చేసే భారత రాజ్యాంగ మౌళిక సూత్రాలను ధిక్కరిస్తూ తాను నేరం చేయలేదని ముద్దాయే నిరూపించుకునేలా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చింది. ఇట్లా ఏమాత్రం విలువలు లేకుండా ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

హిందూత్వ ఎజెండాలో భాగంగా మతాన్ని రాజకీయాల్లోకి చొప్పించారు. రామమందిర్, రథయాత్ర, ఉత్సవాలు, గోరక్షణ పేరిట దేశమంతటా మతోన్మాద పరిస్థితిని తీసుకొచ్చిండ్రు. ఇందుకు యథేచ్ఛగా ప్రభుత్వ ప్రధాన అంగాలైన వ్యవస్థలను వినియోగించు కుంటున్నారు. ఈ వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు. ఇదంతా పద్ధతి ప్రకారం, ప్రణాళిక బద్ధంగా, ప్రజలే కోరుకుంటున్నారా అనే భ్రమలు కలిగేలా అమల్లోకి తెస్తున్నారు. ఇట్లా ఇవన్నీ గమనంలోకి తీసుకున్నట్లయితే బెజ్జారపు రవీందర్ రాసిన ‘తాటక’ నవలను అర్థం చేసుకోవడం సులభతరమైతది. అట్లాగే ప్రభుత్వాల ఉద్దేశాలు, ఆ ఉద్దేశాల వెనుక దాగిన ఉన్మాదం, ఉన్మాదం అమల్లోకి వస్తున్న తీరు, ఆ తీరును ఎదుర్కోవాల్సిన పద్ధతిని అన్నింటిని పూసగుచ్చినట్టు అలెగరీ (దృష్టాంత) పద్ధతిలో రవీందర్ అక్షరబద్దం చేసిండు. తాటక గురించి కథ నడుస్తూనే ఉన్నప్పటికీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లాగా మనువాద ప్రభుత్వాల దాష్టికాలు, అందుకు ప్రతిగా ప్రజలు ముఖ్యంగా ఆదివాసీలు చేస్తున్న పోరాటాలు ఇందులో రికార్డయ్యాయి.

నిజానికి రామాయణ, భారతాల గురించి వేల యేండ్లుగా చాలా మంది రాసిండ్రు. దేశ, విదేశాల్లో కొన్ని వేల రామాయణాలు లిఖిత రూపంలో ప్రచారంలో ఉన్నాయి. ‘రామాయణ్’ టీవీ సీరియల్‌ని రామానందసాగర్ తీసే ముందు వీటన్నింటినీ పరిశీలించేందుకు ఒక పరిశోధక బృందం ఉండింది. అట్లాగే సురవరం ప్రతాపరెడ్డి వివిధ రామాయణాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి చిదిరెమఠం వీరభద్ర శర్మ కోరిక మేరకు ‘విభూతి’ పత్రికలో ‘రామాయణ విశేషములు’ను సీరియల్‌గా ప్రకటించాడు. ఇది 1944లో జరిగింది. అప్పటికి ప్రతాపరెడ్డి ‘గోలకొండ’ పత్రిక సంపాదకుడిగా ఉన్నాడు. ఆ విషయాలు తన పత్రికలో గాకుండా ‘శైవ’మత ప్రచారం కోసం ప్రారంభించబడ్డ ‘విభూతి’లో సీరియల్‌గా ప్రకటించాడు. అంటే తాను రాయబోయే విమర్శనీయమైన అంశాలు గోలకొండ పత్రిక ఉనికికి ప్రమాదకారిగా పరిణమించకూడదనే ఉద్దేశ్యం తప్ప మరొకటి కాదు. అంబేడ్కర్ కూడా ‘రాముడి, కృష్ణుడి రహస్యాలు’, అనే పుస్తకాన్ని పరిశోధించి వెలువరించాడు.

అట్లాగే ఇటీవల ‘వ్యవస్థను కాపాడిన రాముడు’, ‘అనేక రామాయణములు’ పేరిట తెలుగు అకాడెమీ మాజీ డైరెక్టర్, సుప్రసిద్ధ రచయిత్రి బి.విజయభారతి తన అధ్యయనాన్ని పుస్తకాలుగా వెలువరించారు. గతంలో విశ్వనాథ సత్యనారాయణతో సహా అనేక మంది తమకు తోచిన రీతిలో ‘రామాయణా’న్ని వ్యాఖ్యానించారు. ఈ కోవలో శతాధిక గ్రంథాలు వెలువడ్డాయి. అనేక సినిమాలు కూడా తెలుగు తెరపై వెలిగి పోయాయి. అయితే వీటన్నింటిలోనూ విస్మరణకు గురైన పాత్ర ‘తాటక’. ఈ ‘తాటక’ను గురించిన వాస్తవాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆ లోటును ‘తాటక’ నవల ద్వారా బెజ్జారపు రవీందర్ పూర్తి చేసిండు.

ఎవ్వరికీ హాని కలిగించకుండా, నమ్మిన వారికి అండగా ఉంటూ, ఆదివాసీ తెగలను సమిష్టిగా ఉంచుతూ, పర్యావరణ హితంగా బతుకుతున్న బలశాలి, యోధురాలు తాటక. 100 యేండ్ల వయసులోనూ యుద్ధానికి వెరవని వనిత. ఈమెను హతమార్చేందుకు విశ్వామిత్రుడు కుట్ర పన్ని 16 యేండ్ల బాలుడైన రాముడిని వినయోగించాడు. తాటకకు రక్షణగా ఉండిన నాగజాతి వారు జాతర చేసుకునే సమయాన్ని ఇందుకు ముహూర్తంగా నిర్ణయించి దొంగదెబ్బ దీసిండ్రు. అంతకు ముందు అగస్త్యుడి చేతిలో తాటక భర్త సుందుడు, ఇప్పుడు విశ్వామిత్రుడు పన్నిన పన్నాగంలో ఆమె మరణిస్తుంది. వీరి కుమారులు మారీచ, సుబాహులు. స్థూలంగా ఇది కథ అయినప్పటికీ దీన్ని చెప్పిన విధానం, అందులోని పాత్రలు, వాటి స్వభావాలు, రామాయణ కాలం నాటి మతాలు అన్నింటిని నిశితంగా పరిశీలించి, అధ్యయనం చేసి ‘తాటక’ నవలగా బెజ్జారపు రవీందర్ అక్షరీకరించాడు.

అయితే నవల పేరు చూడగానే ఇప్పుడెందుకు తాటక గురించి తెలుసుకోవడం. ఎప్పుడో రామాయణం కాలం నాటి విషయం, అదీ ‘అందరూ’ వ్యతిరేకించే అసురుల గురించి చెప్పుకోవడానికి, తెలుసుకోవడానికి ఏమి ఉంటుంది అనే అనుమానం ఉంటుంది. కానీ రవీందర్ తన కథనంలో రామాయణం కాలం నాటి పరిస్థితే ప్రస్తుతమూ నెలకొని ఉన్నదనీ, ప్రశ్నించే సాహసం చేస్తే ప్రాణాలు పోతాయనీ చెబుతూ వనరుల దోపిడీకి బ్రాహ్మణీయ భావజాలానికి ఉన్న సంబంధాన్ని ఈ నవల ద్వారా చర్చకు పెట్టిండు. ఆదివాసీల అధీనంలోని వనరులను కొల్లగొట్టి, అక్కడి ప్రజలపై అజమాయిషీ చేయడం, వారిని దాసులుగా మార్చుకోవడమే ద్యేయంగా విశ్వామిత్రుడు పన్నిన ఉచ్చు ‘యాగం’. అయితే ‘యాగం’కన్నా ముందే తాటకను హతమార్చేందుకు రామ, లక్ష్మణులను వినియోగించాడు. నిరాయుధురాలిగా ఉన్న తాటక పై రామలక్ష్మణులు బాణాలను ప్రయోగించి హతమారుస్తారు. ఈ నవలను ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేసినట్లయితే నవలకారుడి ఆంతర్యం అర్థమవుతుంది.

నిజానికి విశ్వామిత్రుడి సైనిక పటాలం ఆధునిక యుద్ధ పనిముట్లను తయారు చేయడంలోనూ, వాడడం లోనూ దిట్టలు. విశ్వామిత్రుడికి అండగా తీరొక్క ఆయుధాల తయారీలోనూ, వాటి వాడకంలోనూ సుశిక్షితులైన సైనికులుండేవారు. ఆదివాసీల ఆయుధాలు లోహాలతో గాకుండా ప్రధానంగా కర్రలతో తయారైనవి. బాణాలు, విల్లంబులు, చాపము, కొయిసగా చెక్కిన బొంగులను ఆయుధాలుగా ఉపయోగించేవారు. అదే సమయంలో విశ్వామిత్రుడి సైన్యం ఇనుము ఇతర లోహాలను వాడడం ప్రారంభించారు. ఇట్లా గోళ్లతో గీకితే చాలు తాటక నివాస ప్రాంతంలోని కొండల్లో లభించే ఇనుప రజం కోసం కుట్ర పూరితంగా విశ్వామిత్రుడు దాడికి దిగిండు. ఎందుకంటే అతని ఆయుధాలకు అవసరమైన ముడి సరుకు ఇనుము. ఈ ఇనుము తాటక అధీనంలో ఉండడంతో ఆమెపై దాడి చేసి చంపేసిండ్రు. ఇట్లా చంపేయడానికి ధర్మం పేరిట రాముడిని సాకుగా తెచ్చుకుండు.

ఇవ్వాళ కూడా అదాని, అంబాని, కార్పోరేట్, మల్టినేషనల్ కంపెనీలకు గంపగుత్తగా ఆదివాసీ ప్రాంతాల్లోని ఉత్పత్తులను వెలికి తీసి సొమ్ము జేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. గనులను గంపగుత్తగా ప్రయివేటైజ్ చేసేందుకు ఎత్తుగడలు వేస్తోంది. ఇట్లా స్వాధీనం చేసుకొని సమకూర్చుకున్న ఆయుధ సంపత్తితో వాటి ధాటికి తాళలేని అనేక బహుజన రాజ్యాలను ఆర్యులు తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అట్లా తెచ్చుకోవడమే గాకుండా యుద్ధం లో పట్టుబడ్డ ఆదివాసీలను దస్యులుగా చేసుకుండ్రు. ఇదే యుద్ధంలో విశ్వామిత్రుడి సైన్యం చేతికి చిక్కకుండా అడివిలోనే ఉండి అన్ని రకాల యుక్తులను వినియోగించి ప్రాణాలను దక్కించుకున్న ఆదివాసీలను ఆర్యులు రాక్షసులు, సంస్క ృతి లేని వారు, సంస్కార రహితులు అని తీర్పులిచ్చిండ్రు. ఈ తీర్పులనే మెజారిటీగా హిందూత్వ సమాజం ఆమోదిస్తుంది. ప్రచారం చేస్తోంది. ఇదంతా బ్రాహ్మణీయ భావజాల వ్యాప్తిలో భాగమే!

తార్కికంగా, హేతుబద్ధంగా, దేవుడి ఉనికిని ప్రశ్నించిన లోకాయతులు, చార్వాకులపై హిందూమతావలంభకులు దాడికి దిగిండ్రు. నాస్తికులను వారి అనుయాయులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేసిండ్రో, ఇంకా చెప్పాలంటే ఎట్లా హతమార్చిండ్రో ఇందులో రవీందర్ చెప్పిండు. నేటి మాదిరిగానే దీనికి ఆనాటి న్యాయ వ్యవస్థ కూడా అండగా ఉండింది. తాటక నివాసముండే అరణ్యం ఇప్పటి ఉత్తరప్రదేశ్‌లోని బక్సర్ ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఆనాడు మలద కరూశాలు అనేవారు. ఈ పేరును ఒకప్పుడు ఈ ప్రాంతంలో తిరిగిన ఇంద్రుడు పెట్టిండు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ ప్రదేశం మానవ సంచారానికి దూరంగా ఉండింది. అయితే బ్రాహ్మణులు తమ వ్యవసాయ అవసరాల కోసం సుదూర ప్రాంతాలకు తమ అనుయాయులను తీసుకెళ్ళి అక్కడ చిన్న, చిన్న ఆశ్రమాలు నిర్మించుకొని యజ్ఞాలు, యాగాలు చేస్తూ స్థానికంగా ఉన్న ఆదివాసీలను ఇబ్బందులకు గురిచేసిండ్రు. యజ్ఞాలు, యాగాలు అన్నీ బ్రాహ్మణీయ భావజాల విస్తరణలో భాగమే.

అడవిని నరుకొద్దు అన్నవాళ్ళను, అడవుల్లో దొరికే ఖనిజాలను కాజెయ్యొద్దు అన్నవాళ్ళని అగస్త్యుడు మొదలు విశ్వామిత్రుడు వరకు అందరూ రాక్షసులుగా, చెడ్డవారిగా ముద్రవేసిండ్రు. అడవుల్లో ఉండే ఆదివాసీలు ఆర్యులకు దూరంగా ఉండాలని ఎంత ప్రయత్నించినప్పటికీ వారు పనిగట్టుకొని దోపిడీ సాగిస్తుండడంతో ఆదివాసీల ఉనికికే ప్రమాదం ఏర్పడింది. అదాని, అంబాని, మల్టినేషనల్ కంపెనీలు ఈ ఖనిజాలను తవ్వుకొని స్థానికంగా ఉన్నటువంటి ఆదివాసీల మనుగడకు ముప్పు తీసుకొస్తున్నందుకు దండకారణ్యంలో ఉద్యమాలు నడుస్తున్నాయి. ఇట్లాంటి పోరాటాలను రామాయణ కాలంలో నాగులు, తాటక, మారీచ, సుబాహుల వంటి వారు చేసిండ్రు. వారిని కూడా విశ్వామిత్రుడు, రాముడు ఇద్దరూ కలిసి హతమార్చిండ్రు. నవలలో ఒక చోట “మనం ఆర్యేతర భూముల్లో ఉంటున్నాము. ఇవి వారి సంచార భూములనేవి వాస్తవం. ఎంతకాదన్న స్థానబలిమి వారికి అదనపు బలంగా ఉంటుంది.

గిల్లికజ్జాలు పెట్టుకోవడం ఎందుకు? వారితో వియ్యమూ అవసరం లేదు, కయ్యమూ అవసరం లేదు. మన మానాన మనం ఉండడం మంచిదేమో” అని బాహ్లికుడు అనే ఆర్యుడి ద్వారా అడవిలో నివాసముంటున్న వారి హక్కులను గౌరవించాలె అనే అర్థంలో చెప్పించిండు. అయినప్పటికీ ఆగస్త్యుడు ఈ మాటలనేమీ లెక్క చేయకుండా ఈ భూములన్నీ పితామహుల సృష్టి. (ఇంద్రుడి). పితామహుడిని పూజించే వారిదే ఈ భూమి. అని చెబుతాడు. నిజానికి ఆగస్త్యుడు ఉద్దేశ్యం, లక్ష్యం ‘వింధ్య దాటి దక్షిణాంతం వరకు యథేచ్ఛగ ఆర్యగణ గోబ్రాహ్మణులు సంచరించేలా చేయడం’. వేల ఏండ్లుగా నివాసముంటున్నవారి సంప్రదాయాలను ఏమాత్రం పట్టించుకోకుండా గోబ్రాహ్మణులు తమ సంస్క ృతి రక్షణ పేరిట రకరకాల పదార్థాలను ెమంలో వేస్తూ అగ్ని దేవుడి భార్య పేరిట “స్వాహా” అంటూ జంతుబలులిచ్చేవారనీ, ఒక్కొక్క సారి ఈ జంతుబలుల మూలంగా యాగ ప్రదేశాల్లో నడుం లోతు వరకు రక్తం ఏరులయి పారేదని కూడా రవీందర్ ఆనాటి సంస్క ృతి, సంప్రదాయం, ఆచార, వ్యవహారాలను కండ్లముందుంచిండు.

రోగాలు నయం చేసే పేరిట ఆర్థికంగా బాగుపడేది కూడా బ్రాహ్మణ వర్గమే అంటూ రవీందర్ నిర్దారించిండు. అంతా మేము యాదికుంచుకుంటాం, అవకాశం దొరికినప్పుడు ప్రతీకారం కచ్చితంగా తీర్చుకుంటామనే దోరణిలో ఈ ఆదివాసీ పోరాటాలను గేయాల రూపంలో ప్రచారం చేస్తున్న విషయాన్ని కూడా రవీందర్ రాసిండు. ఇప్పటి సమాజానికి అవసరమైన చైతన్యాన్ని పౌరాణిక గాథల చుట్టూతా తిప్పుతూ నేర్పుగా అందించిన సృజనశీలి రవీందర్. సృజనను సమాజ చైతన్యానికి ఉపయోగించిన రవీందర్‌కు అభినందనలు. ఈ చైతన్యాన్ని ఆవాహన చేసుకునేందుకు అందరూ చదవాల్సిన నవల ‘తాటక’.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News