Saturday, May 4, 2024

550 మందికి తండ్రినయ్యా.. వీర్యదానం ఆపేయండి.. డచ్ కోర్టు ఆదేశం

- Advertisement -
- Advertisement -

ది హేగ్: తన వీర్యదానం ద్వారా నెదర్లాండ్స్‌లో 550 మందికి పైగా తండ్రినయ్యానని చెప్పుకొంటూ మరింత మందిని అలా చేసేలా తప్పుదోవ పట్టిస్తున్న ఓ వ్యక్తిని ఇకపై వీర్యదానం చేయడం నిలిపివేయాలంటూ డచ్ కోర్టు శుక్రవారం ఆదేశించింది. ఆ వీర్యదాత ద్వారా ఓ బిడ్డకు తల్లయిన ఓ మహిళ, ఇతర తల్లిదండ్రులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఓ ఫౌండేషన్ ఫిర్యాదు మేరకు హేగ్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. కాగా ‘ఇవా’గా మాత్రమే ఫౌండేషన్ గుర్తించిన ఆ మహిళ కోర్టు నిర్ణయాన్ని స్వాగతించింది. ఇతర దేశాలకు చమురు మడ్డిలా వ్యాపిస్తున్న సామూహిక వీర్యదానంపై నిషేధానికిఈ తీర్పు దారి తీస్తుందని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అన్యాయంనుంచి మన పిల్లలను కాపాడుకోవడానికి మనమంతా చేతిలో చేయి వేసి నిలవాలని ఆమె కోరారు.

డచ్ మార్గదర్శకాల ప్రకారం వీర్య దాతలు 12 మంది తల్లుల ద్వారా గరిష్ఠంగా 25 మందిని ఉత్పత్తి చేయడానికి మాత్రమే అవకాశం ఉందని, ఈ వీర్యదాత పిల్లలు కావాలనుకునే తల్లిదండులకు అబద్ధాలు చెప్పాడని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే తాను డచ్‌లోని అనేక ఫర్టిలిటీ సెంటర్లకు వీర్యాన్ని దానం చేశానని, అలాగే డెన్మార్క్‌లో ఒక క్లినిక్‌తో పాటుగా ప్రకటనల ద్వారా తనకు పరిచయమైన చాలా మందికి వీర్యదానం చేశానని జొనాథన్ ఎం అనే ఈ వీర్యదాత చెప్పుకొన్నాడని కోర్టు ఓ లిఖిత తీర్పులో పేర్కొంది.అతను ఉద్దేశపూర్వకంగా అబద్ధాలు చెప్పి గర్భధారణ చేయలేకపోయిన వారిని మోసగించడానికి ప్రయత్నించాడని కోర్టు పేర్కొంది.ఇకపై వీర్యదానాన్ని నిలిపివేయాలని, ఒక వేళ ఈ నిషేధాన్ని ఉల్లంఘించి వీర్యదానాన్ని కొనసాగించినట్లయితే ఒక్కో కేసుకు లక్ష యూరోలు చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News