Wednesday, March 29, 2023

ఈచ్ వన్ టీచ్ వన్

- Advertisement -

each-one-teach-one

తెలంగాణ రాష్ర్టం అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నదని, సంపూర్ణ అక్షరాస్యతా రాష్ర్టంగా తెలంగాణను మార్చేందుకు ప్రతి ఒక్కరు ప్రతినబూనాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో పేర్కొన్నారు. గ్రామంలో ఉన్న నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చే బాధ్యతను సర్పంచులకు అప్పగించాలని అన్నారు. ముఖ్యంగా ఎస్‌సి, ఎస్‌టిలలో అక్షరాస్యత పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యమివ్వాలని పేర్కొంటూ జిల్లాను సంపూర్ణ అక్షరాస్యతా సాధించిన జిల్లాగా మార్చేందుకు కలెక్టర్లు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సాధించిన అక్షరాస్యతను జనాభా లెక్కల్లో కూడా నమోదు చేయించాలని పేర్కొన్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత గల రాష్ర్టంగా మార్చాలని ప్రతి విద్యావంతుడు ఒక నిరక్షరాస్యునికి చదువు నేర్చించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు గతంలోను ఈ అంశాన్ని ప్రస్తావించారు. వారి పిలుపు మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థులు, పెన్షనర్లు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, రాజకీయ పార్టీలు పూర్తి స్థాయిలో మద్దతు పలికి ముందుకు రావడం హర్షణీయం. ఇది ప్రజా ఉద్యమం కాబట్టి అందరూ భాగస్వాములై “అక్షర తెలంగాణ” సాధనకు కృషి చేయవలసిన అవసరం కలదు. ఆర్థిక, మౌలిక వసతుల రంగాల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపిన ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని అక్షరాస్యతలో కూడా అగ్రభాగాన నిలుపుటకు కృతనిశ్చయంతో ఉన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వలన తెలంగాణ అక్షరాస్యతలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే క్రింద నుండి 4వ స్థానంలో అట్టడుగున ఉండిపోయింది. అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలిచిన తెలంగాణ అక్షరాస్యతలో వెనుకబడి ఉండటం వలన జాతీయ స్థాయిలో మానవాభివృద్ధి సూచిలో వెనుకబడి ఉన్నాము. అక్షరాస్యతా శాతం పెరిగితే అభివృద్ధి సూచీలో మన స్థానం మెరుగవుతుంది.

ముఖ్యమంత్రి ఆలోచన జాతీయ అక్షరాస్యత సగటు కంటే అక్షరాస్యతను పెంచడమే కాదని అసలు లక్ష్యం తెలంగాణ రాష్ర్టంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించడమేనని మనం గ్రహించాలి. దేశ సగటు అక్షరాస్యత 74% ఉంటే తెలంగాణలో దాదాపు 66% మాత్రమే ఉన్నది. వ్యాపార అనుకూలతలో రాష్ట్రానిది తొలి స్థానం. మిషన్ భగీరథ, కాళేశ్వరం లాంటి భారీ పథకాలు రాష్ర్ట కీర్తిని అంతర్జాతీయ స్థాయిలో నిలిపాయి. ఇవన్నీ ఘనంగా ఉన్న రాష్ట్రానికి “నిరక్షరాస్యత” జాతీయ స్థాయిలో అప్రతిష్ఠను తెస్తున్నది. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సాక్షర భారత్ కార్యక్రమంతో కొంత ప్రయోజనం కలిగింది. ఆ కార్యక్రమం మార్చి, 2018తో ముగిసిపోయింది. కేంద్ర ప్రభుత్వం ఆ పథకాన్ని పొడిగించలేదు. దీనిని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యతా రాష్ర్టంగా మార్చడానికి అత్యంత ప్రాముఖ్యతను ఇస్తున్నారు. సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమం ద్వారా తెలంగాణలోని నిరక్షరాస్యులందరినీ అక్షరాస్యులుగా మార్చాలని రాష్ర్ట ప్రభుత్వం సంకల్పించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం రాష్ర్ట ప్రభుత్వానికి తగిన సహాయ సహకారాలు అందించి ప్రముఖ పాత్ర పోషించవలసిన అవసరం కలదు.

గతంలో కుటుంబాల్లో చదువుకున్నవారు చాలా తక్కువ. అందుకే ఆనాటి పరిస్థితుల ప్రకారం కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ప్రతి కుటుంబంలో చదువుకున్నవారు ఉంటున్నారు. వారు తమ కుటుంబ సభ్యులకు చదువు నేర్పించాలంటే సంతోషంగా భావిస్తారు. వారి కుటుంబంలో చదువుకున్నవారు లేకపోతే పక్కింటివారితో లేదా అదే గ్రామానికి చెందిన ముందుకు వచ్చిన వాలంటీర్లతో విద్య నేర్పించవచ్చు. అక్షరజ్ఞానం, గణాంకాలు రాని 18 సం॥లు దాటిన వయోజనులైన నిరక్షరాస్యులు ప్రతి రోజు కొంత సమయం చదువుకు కేటాయించాలి. దీని వలన దిన పత్రికలు చదవడం, చిన్న చిన్న లెక్కలు చేయడం వస్తుంది. చదివింది మర్చిపోకుండా నిరంతరం చదువుతూ సాధారణ విద్యలోకి కూడా అడుగుపెట్టవచ్చు. వారు సులువుగా నేర్చుకునేందుకు ప్రభుత్వం “అక్షర తెలంగాణ” పేరిట వాచకం తయారు చేయిస్తున్నది. నిరక్షరాస్యులైన వయోజనులకు చదువుపై ఆసక్తి పెంచేందుకు, అందరి నోళ్ళలో నానుతున్న నిత్య జీవితంలో అవసరమైన పదాలను ఈ వాచకంలో పొందుపరుస్తున్నారు. 2021 జనాభా లెక్కలకు ముందే సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమాన్ని తీసుకొని అక్షరాస్యతా శాతం పెంచేందుకు రాష్ర్ట ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. 2021లో జరిగే జనాభా లెక్కల్లో అక్షరాస్యతా శాతం వెల్లడవుతుంది. అప్పుడు సైతం వెనుకబడితే, మరో దశాబ్దం పాటు జాతీయ స్థాయిలో తెలంగాణపై చులకన భావం ఏర్పడుతుంది. దీన్ని ఎదుర్కొవాలంటే జనాభా లెక్కల కంటే ముందే ఒక ప్రజా ఉద్యమంలా సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నారు.

ఈ కార్యక్రమం అమలుకు తెలంగాణ రాష్ర్టంలోని 12,751 గ్రామాల్లో 18 సం॥లు పూర్తి చేసుకున్న నిరక్షరాస్యుల వివరాలను రెండవ విడత పల్లెప్రగతి కార్యక్రమంలో సేకరించడం జరిగింది. వారి వివరాలను ఆన్‌లైన్‌లోను నమోదు చేయడం జరిగింది. ఈ సర్వే గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే చేయడం జరిగినది. ఈ సందర్భంగా నిరక్షరాస్యుల జాబితాల్లో మహిళలే ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా 50 ఏండ్లకు పైబడిన వారిలో నిరక్షరాస్యత ఎక్కువ ఉన్నట్లు వెల్లడయింది. వీటన్నింటిని దృష్టియందుంచుకొని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసే అవకాశం కలదు. ఈ సందర్భంగా నిరక్షరాస్యులకు చదువు నేర్పించే కార్యక్రమంలో ముఖ్యంగా విద్యార్థులను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేయవలసిన అవసరం కలదు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయి? నిరక్షరాస్యుల సంఖ్యకు అనుగుణంగా వాలంటీర్లు అందుబాటులో ఉన్నారా? కార్యక్రమంలో ఏయే ఇబ్బందులు ఎదురవుతాయి? తదితర అంశాలపై దృష్టి సారించేందుకు కొన్ని గ్రామాల్లో ప్రభుత్వం నమూనా సర్వే కూడా చేయడం జరిగింది. పట్టణాల్లో కూడా ప్రభుత్వం త్వరలోనే సర్వే చేసి కార్యక్రమాన్ని అమలు చేస్తే బాగుంటుంది. రాష్ర్టంలో వయో జనుల అక్షరాస్యత పెంచేందుకు ప్రత్యేక కాంపెయిన్ నిర్వహించవలసిన అవసరం కలదు. తెలంగాణలో నివసిస్తున్న ప్రతి పౌరుడు వారికి ఇరుగు పొరుగున ఉన్న నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే బాధ్యత తీసుకోవాలి.

ఈ కార్యక్రమంలో పాఠశాలలు, జూనియర్ కళాశాలు, డిగ్రీ కళాశాలలు, యూనివర్శిటీ విద్యార్థులు అందరినీ భాగస్వాములను చేయాలి. కార్పొరేట్ సంస్థలను, కుల సంఘాలను, రాజకీయ పార్టీలను పూర్తి స్థాయిలో భాగస్వాములను చేయగలగాలి. విద్యార్థులు వారి ప్రాజెక్టు వర్కుల్లో భాగంగా ప్రతి ఒక్కరు, ఒక్కరు లేదా ఇద్దరు నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే నిబంధన విధించాలి. డైట్, బి.ఇడి. కళాశాలల విద్యార్థులను తప్పనిసరిగా భాగస్వాములను చేయాలి. గ్రామాల్లోకి అన్ని డిపార్టుమెంటులను భాగస్వామ్యం చేస్తేనే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుందని భావించవచ్చు. గ్రామాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరు తప్పనిసరిగా కొంతమంది నిరక్షరాస్యులను దత్తత తీసుకొని వారిని అక్షరాస్యులుగా మార్చుటకు కృషి చేయాలి.

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కూడా ఈ దిశగా కృషి చేస్తే బాగుంటుంది. ప్రతి పోలీస్ స్టేషన్‌ను యూనిట్‌గా తీసుకొని “20” మంది నిరక్షరాస్యులను తీసుకొని వారిని అక్షరాస్యులుగా మారుస్తామని సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని డి.జి.పి. మహేందర్‌రెడ్డి ప్రకటించడం హర్షణీయం. ముఖ్యంగా మహిళల్లో నిరక్షరాస్యత ఎక్కువగా ఉంది. కావున మహిళా సంఘాలను పూర్తిస్థాయిలో భాగస్వామ్యం చేయవలసిన అవసరం కలదు. వాలంటీర్లకు తప్పనిసరిగా “ప్రశంసా పత్రాలు” అందిస్తే ప్రోత్సాహకరంగా ఉంటుంది. తెలంగాణ రాష్ర్టంలోని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమానికి మనః స్పూర్తిగా కృషి చేస్తే ఈ కార్యక్రమం తప్పనిసరిగా విజయవంతం అవుతుందని చెప్పవచ్చు.

ఆ దిశగా అడుగులు పడుటకు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కూడా తమ వంతు సహకారం అందించాలి. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న మనకు సంపూర్ణ అక్షరాస్యత కార్యక్రమం సాధించడం అసాధ్యం కాదు. ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెడుతున్నందున విద్యావంతులైన ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఒక ఉద్యమంలా సంపూర్ణ అక్షరాస్యతా కార్యక్రమంలో భాగస్వాములయితే త్వరలోనే సంపూర్ణ అక్షరాస్యత సాధిస్తామని, అందుకు విద్యావంతులైన ప్రతి ఒక్కరూ తమ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిద్దాం.

each one teach one

పుల్లూరు వేణుగోపాల్,  9701047002

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News