Monday, April 29, 2024

కరోనా కాటేసిన ఆర్థిక వ్యవస్థకు టీకా

- Advertisement -
- Advertisement -

నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై అన్ని వర్గాల ఆశలు
నేడే కేంద్ర బడ్జెట్

న్యూఢిల్లీ: కరోనా విజృంభణ అనంతరం కేంద్రం తొలిసారిగా ప్రవేశపెడుతున్న బడ్జెట్‌పై అన్ని రంగాలు, వర్గా లు ఎన్నో ఆశలు పెట్టుకొన్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో 2021 22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అయితే ఆర్థిక మంత్రి గతంలో చెప్పినట్లుగా బడ్జెట్ కేవలం ‘బాహీ ఖాతా’(గణాంకాల చిట్టా)గా కాక మొన్న మొన్న చెప్పినట్లుగా గతంలో ‘ఎన్నడూ లేని విధంగా’ వినూత్నంగా, కుదేలయి ఉన్న ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేదిగా ఉంటుందా అనేదే అందరి మనసుల్లో మెదలుతున్న ప్రశ్న. కరోనా మహమ్మారి కారణంగా కుదేలయిన ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. పలు రంగాలు క్రమంగా వృద్ధి బాటలో పయనిస్తున్నాయి. ఈ దశలో ఆయా రంగాలకు ఉద్దీపన కల్పించే విధంగా నిర్మలా సీతారామన్ బడ్జెట్ రూపంలో ‘ఆర్థిక వ్యాక్సిన్’ను అందిస్తారా? అనేదే పెద్ద ప్రశ్న.
కొవిడ్19 మహమ్మారి కారణంగా తలెత్తిన ఆర్థిక విధ్వంసం తర్వాత దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెటే్ంటదుకు తొలి మెట్టుగా ఈ బడ్జెట్ ఉండాలనేది ఆర్థిక వేత్తలు, నిపుణుల నిశ్చితాభిప్రాయం. అంతేకాదు, కేవలం గణాంకాల చిట్టాగా లేక ‘కొత్త సీసాలో పాత సారా’ మాదిరిగా ఉండకూడదని కూడా వారు అంటున్నారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిలో పడడానికి అవసరమైన రోడ్‌మ్యాప్‌గా బడ్జెట్ ఉండాలనేది వారందరి అభిప్రాయం. కరోనా మహమ్మారి కారణంగా నిర్మలాసీతారామన్ గత పది నెలల కాలంలో రెండు మూడు మినీ బడ్జెట్‌లు ప్రకటించారు.వివిధ రంగాలకు ప్రోత్సాహకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అవేవీ సమగ్రమైన పూర్తిస్థాయి బడ్జెట్‌కు సమానం కాబోవనేది ఆర్థికవేత్తల అభిప్రాయం. ఈ ఆర్థిక సంవత్సరం వార్షిక జిడిపి 7 8 శాతం తగ్గుతుందనేది ఆర్థిక వేత్తలందరూ చెప్తున్న విషయం. అభివృద్ధి చెందుతున్న దేశాలన్నిటిలో ఇదే అతి తక్కువ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో మునిగిపోతున్న ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించే విషయంలో ప్రభుత్వం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఓ వైపు కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతుండడం, వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలవడం భవిష్యత్తుపై ఆశలు చిగురింపజేస్తున్న తరుణంలో నిలకడైన ఆర్థిక వృద్ధి కొనసాగాలంటే దానికి సరైన ప్రభుత్వ విధానం ఉండాలి. ఈ విషయంలో బడ్జెట్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.
గత ఏడాది కరోనా వ్యాప్తి కట్టడి కోసం లాక్‌డౌన్ విధించడంతో ఆర్థిక కార్యకలాపాలన్నీ స్తంభించి పోయాయి. ఫలితంగా గత ఆర్థిక సంవత్పరంలో తొలి రెండు త్రైమాసికాల్లో వరసగా జిడిపి గణనీయంగా పడిపోయింది. దీంతో ఆత్మనిర్భర్ భారత్ పథకంలో భాగంగా వివిధ రంగాలకు మూడు విడతలుగా ప్రభుత్వం ప్యాకేజిలు ప్రకటించింది. ఈ ప్యాకేజిలు మొత్తం జిడిపిలో 1.8 శాతం అంటే రూ.3.5 లక్షల కోట్ల మేర ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. పైగా కరోనా కారణంగా ప్రభుత్వ రెవిన్యూ వసూళ్లు తగ్గిపోవడంతో గత ఏడాది బడ్జెట్‌లో అంచనా వేసిన జిడిపి రూ.2.24 లక్షల కోట్లనుంచి 1.94 లక్షల కోట్లకు తగ్గిపోయింది.అయితే మూడో త్రైమాసికంనుంచి కాస్త పుంజుకుంది. కొవిడ్ ప్రభావంతో ఫిబ్రవరి 1న తాను సమర్పించబోయే మూడో బడ్జెట్ ‘ఇంతకు ముందెన్నడూ లేనిది’ గా ఉంటుందని నిర్మలా సీతారామన్ కొద్ది రోజుల క్రితమే ప్రకటించారు. బడ్జెట్‌కు ముందు ఆర్థిక మంత్రి నిర్వహించిన సంప్రదింపుల సందర్భంగా వివిధ వర్గాలు తాము బడ్జెట్‌లో ఏం ఆశిస్తున్నామో కూడా మంత్రికి చెప్పాయి.
అయితే రాబోయే బడ్జెట్‌లో అందరి దృష్టీ కొవిడ్ వ్యాక్సినేషన్‌కు అయ్యే ఖర్చులో కేంద్ర ప్రభుత్వం భరించే ఖర్చు ఎంత ఉండబోతుంది, రాష్ట్రప్రభుత్వాలు, ప్రజలు ఎంత భరించాల్సి ఉంటుందనే దానిపైనే ఉండనుంది. దేశవ్యాప్తంగా 130 కోట్లమందికి టీకా పంపిణీ చేయడానికి వేల కోట్లు అవసరమవుతాయనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంత భారీ మొత్తాన్ని ఒక్క కేంద్రమే భరించడం సాధ్యమూ కాదు. తొలి విడతలో దాదాపు మూడు కోట్ల మంది ఫ్రంట్‌లైన్ హెల్త్ వర్కర్లకు ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించింది. మరి మిగతా వారి సంగతేమిటనేది ప్రశ్న. తగ్గిపోయిన వసూళ్లను భర్తీ చేసుకోవడానికి భారత్ పెట్రోలియం కార్పొరేషన్( బిపిసిఎల్), ఎయిరిండియా, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌సిఐ)లాంటి కంపెనీల విక్రయం ద్వారా ప్రభుత్వం ఎంత మేరకు రాబడి పొందనున్నదీ బడ్జెట్‌లోనే తేలనుంది. వీటన్నిటికి తోడుగా వృద్ధికి కీలకంగా మారే మౌలిక సదుపాయాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు నిర్మలా సీతారామన్ ఇదివరకే చెప్పారు. మరో వైపు ఇప్పటికే కుదేలయి ఉన్న అనేక రంగాలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు బడ్జెట్‌వైపు ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్న పీనియర్ సిటిజన్స్. మధ్యతరగతి వర్గాల ఆశలను ఏ మేరకు నెరవేరుస్తారో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News