Wednesday, May 1, 2024

అప్పుడే ప్రజలకు సుఖ సంతోషాలు కలుగుతాయి: ఎర్రబెల్లి

- Advertisement -
Errabelli dayakar rao visit muchintal
హైదరాబాద్: అందరికీ సమాన అవకాశాలు కలిగి, అందరిలోనూ సమ భావన కలిగి ఉన్నప్పుడే సమాజంలో ప్రజలకు సుఖ శాంతి, సంతోషాలు కలుగుతాయని, శాంతి సౌఖ్యాలు విరాజిల్లుతాయని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ముచ్చింతల్ జీయర్ ట్రస్ట్ లో 1035 హోమగుండాల శ్రీ లక్ష్మీ నారాయణ మహా క్రతువు, గోపాలోపాయన పురస్కార  ప్రదానోత్సవం లో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు.
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 1000 ఏళ్ల క్రితమే ప్రపంచానికి సమతను చాటిన రామానుజుల వారి భారీ విగ్రహాన్ని ముచ్చింతల్ లో ప్రతిష్ఠించి, లోకానికి అంతా సమానం అనే విషయాన్ని చాటుతున్న రామానుజుల వారి సమతా విగ్రహం, ఆ సంకల్పాన్ని సాఫల్యం చేసిన శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, అందుకు తోడుగా నిలిచిన మై హోమ్స్ అధినేత రామేశ్వర్ రావు చరిత్రలో నిలిచి పోతారని మంత్రి ప్రశంసించారు.
ఎప్పటికైనా రామానుజుల వారి దృక్పథమే ప్రపంచానికి ఏకైక దారి అన్నారు. పూర్ణాహుతి సంకల్పం తీసుకుని, స్వామి వారిని దర్శించుకున్నారు. ముచ్చింతల్ జీయర్ ట్రస్ట్ లో 1035 హోమగుండాల శ్రీ లక్ష్మీ నారాయణ మహా క్రతువులో పాల్గొన్నారు. జీయర్ స్వామి వారి గురువు గోపాలాచర్యుల వారి పేరున ఇచ్చే గోపాలోపాయన పురస్కార ప్రదానోత్సవం లో మంత్రి, ఎర్రబెల్లి ట్రస్ట్ చైర్ పర్సన్ ఉషా దయాకర్ రావు, కుటుంబ సభ్యులతో పాటు పాల్గొన్నారు. గోపాలోపాయన పురస్కారాన్ని తమిళనాడుకు చెందిన మాడభూషి వరద రాజన్ అందచేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. దేవుడు అందరినీ సమానంగానే సృష్టించాడని, వారి వారి తెలివి, అవకాశాలను బట్టి ఎదుగుతున్నారు. కానీ అంతా సమానమేనని అన్నారు. ఆ సమాన, సమ భావన అందరము అలవర్చుకోవాలని సూచించారు. తాను వివిధ కార్యక్రమాలు, మేడారం జాతర, సిఎం జనగామ పర్యటన వంటి పలు పనుల వల్ల అందుబాటులో లేనని చెప్పారు. అయితే సమతా మూర్తి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. సమతా మూర్తి విగ్రహ ప్రతిష్ఠ, తెలంగాణ ప్రతిష్ఠను మరింత పెంచిందని, ప్రపంచ భక్తి పటంలో అంతర్జాతీయ సమతా క్షేత్రంగా, పర్యాటక ప్రాంతంగా ముచ్చింతల నిలిచిపోయిందని కొనియాడారు.  ఈ రోజు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, రేపు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రాక ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే ముగింపు సందర్భంగా ప్రతిష్టించిన 108 గుళ్ళ కలశాలను ఒక మండపంలో కి చేర్చి జరిపే మహా పూర్ణాహుతి కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమతా మూర్తి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమాలు దిగ్విజయం అయినందుకు జీయర్ స్వామికి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News