Monday, April 29, 2024

బొగ్గు గనుల వేలంనుంచి తమిళనాడు మైన్స్‌కు మినహాయింపు

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు డెల్టా ప్రాంతంలోని మూడు లిగ్నైట్ గనులను ఏడో విడత బొగ్గు గనుల వేలంనుంచి మినహాయించినట్లు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిప్రహ్లాద్ జోషీ ప్రకటించారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జోషీ గురువారం ఓ ట్వీట్‌లో తెలియజేశారు. సహకారాత్మక సమాఖ్య స్ఫూర్తి, తమిళనాడు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ గనులను వేలంనుంచిమినహాయించాలని నిర్ణయించినట్లు మంత్రి తెలియజేశారు. ఈ అంశంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ కూడా ప్రధాని నరేంద్ర మోడీకి గతంలో లేఖ రాసిన విషయం తెలిసిందే. కావేరి డెల్టా ప్రాంతంలో బొగ్గు తవ్వకాలను తమ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోను అనుమతించబోదని ఆయన రాష్ట్ర అసెంబ్లీలో కూడా ప్రకటించారు. అయితే కేంద్ర మంత్రి జోషీ తన ట్వీట్‌లో రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు అన్నామలై పేరును మాత్రమే ప్రస్తావించడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కేంద్ర బొగ్గు, గనుల మంత్రిత్వ శాఖ ఈ గనులకు సంబంధించి టెండర్లను పిలవడంతో రాష్ట్రంలో పెద్ద వివాదమే తలెత్తింది.

తన అభ్యర్థనను అంగీకరించినందుకు అన్నామలై కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్ర బిజెపి, తమిళనాడు ప్రజల తరఫున ఆయన ప్రధాని మోడీకి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. డెల్టా ప్రాంతంలో బొగ్గు తవ్వకాల వల్ల ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు కలుషితమవుతాయని, ఫలితంగా ఆ ప్రాంతంలోని వ్యవసాయంపై కూడా అది ప్రభావం చూపుతుందని, అందువల్లనే ఆ ప్రాంత రైతులు దీనికి వ్యతిరేకంగా ఆందోళన చేశారని జోషీకి రాసిన లేఖలో అన్నామలై సేర్కొన్నారు. ఈ బొగ్గు బ్లాకులు రక్షిత వ్యవసాయ జోన్ పరిధిలోకివస్తాయని కూడా ఆయన తెలిపారు.

అయితే కేంద్రప్రభుత్వ ప్రకటన తమ కృషి ఫలితమేనని అధికార డిఎంకె, ప్రతిపక్ష అన్నా డిఎంకెలు కూడా వాదిస్తున్నాయి. ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ నిరంతరంగా కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వచ్చినందునే ఈ మూడు గనులను వేలంనుంచి మినహాయించాలని కేంద్రం నిర్ణయం తీసుకుందని ఆయన అన్నారు. ఈ నిర్ణయం ముఖ్యమంత్రి విజయమని మరో రాష్ట్ర మంత్రి తంగం తెన్నరసు చెప్పారు. కాగా కావేరి డెల్టా ప్రజల ప్రయోజనాలను కాపాడడానికి తమ ప్రభుత్వం తమిళనాడు రక్షిత వ్యవసాయ జోన్‌ను ఏర్పాటు చేసిందని ఈ విషయాన్ని రాష్ట్ర శాసన సభ, పార్లమెంటు దృష్టికి తీసుకురావడం ద్వారా తమ పార్టీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఫలితంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొందని అన్నాడిఎంకె నేత, మాజీ ముఖ్యమంత్రి కె పళనిస్వామి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News