Sunday, May 5, 2024

తికాయత్ బొమ్మలకు డిమాండ్

- Advertisement -
- Advertisement -

Farmer leader Rakesh Tikait is in demand for portrait

 

రైతులలో అభిమానపు వెల్లువ

న్యూఢిల్లీ : సింఘు సరిహద్దులలో ఇప్పుడు రైతు నేత రాకేశ్ తికాయత్ బొమ్మలకు గిరాకీ పెరిగింది. తికాయత్ ఇప్పుడు రైతుల తిరుగులేని అభిమాన నేత కావడంతో ఆయన కటౌట్లు ఏర్పాటుకు పోటీపడుతున్నారు. ఎర్రకోట ఘటన తరువాత దెబ్బతిన్న రైతుల ఉద్యమ ప్రతిష్టను తిరిగి నిలబెట్టడంలో తికాయత్ కీలక పాత్ర పోషించినట్లు రైతులు గుర్తించారు. దీనితో ఆయనపై వారికి అభిమానం వెల్లువెత్తింది. నిరసనలు సాగుతున్న శివార్లలో ఇప్పుడు రోడ్ల పక్కన వెలిసిన దుకాణాలలో బ్యాడ్జ్‌లు, పోస్టర్లు, రైతుల ఉద్యమానికి సంబంధించిన బుక్‌లెట్లు ప్రతినిత్యం అమ్ముతున్నారు. దీనితో ఇక్కడ సందడి మరింత జోరందుకుంది. ఇప్పుడు తికాయత్ ఫోటోలను తాను ఎక్కువగా అమ్ముతున్నట్లు ఇక్కడ స్టాల్ పెట్టుకున్న వసీం అలీ అనే వ్యక్తి చెప్పారు. తికాయత్ బొమ్మ ప్రతి ఒక్కదానికి రూ 20 పలుకుతోందని, గత కొద్ది రోజులుగా వీటినే ఎక్కువగా అడుగుతున్నారని తెలిపారు. ప్రతిరోజూ దాదాపు 800 వరకూ ఇటువంటి బొమ్మలు అమ్ముతున్నట్లు, తాను ఢిల్లీలోని బవానాకు చెందిన వాడినని అలీ తెలిపారు.

తనకు ఈ కటౌట్లు సదర్ బజార్ నుంచి అందుతాయని చెప్పారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎంతటి అవమానాలకు గురైనా, చివరికి తను తూటాలకు బలి అయినా రైతు ఉద్యమం ఆగబోదని, చట్టాలు తీసుకువచ్చిన కుట్రలకు ఉద్యమం బలి అవుతూ ఉంటే తాను చూస్తూ ఉండలేనని తికాయత్ చెపుతూ వచ్చిన మాటలతో రైతు ఉద్యమం పట్ల తిరిగి సానుభూతి పెరిగి, ఇప్పుడు మరెంత కాలం అయినా ఉద్యమం సాగుతుందనే రీతిలో పరిస్థితి ఉంది. ఓ వైపు యుపి పోలీసు బలగాలు ఈ నిరసన స్థలి వద్ద మొహరించి ఉన్నాయి. ఎప్పుడైనా తికాయత్‌ను అదుపులోకి తీసుకుని వెళ్లవచ్చునని ప్రచారం జరుగుతోంది. ఎర్రకోట ఘటనతో ఓ దశలో నిరసనల్లో ఉన్న రైతులలో జాతి వ్యతిరేక శక్తులు చొరబడ్డారనే ప్రచారం జరిగింది. దీనితో రైతుల ఉద్యమం ప్రశ్నార్థకం అయింది.

అయితే తాను బలహీనంగా అస్వస్థతతో ఉన్నప్పటికీ తికాయత్ ఘాజీపూర్ సరిహద్దులలో కన్నీళ్లతో చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. రైతులు దెబ్బతిన్న వారని, వారిపై నిందలు వేయడంలో పలుకుబడి గల వారు, అధికార వర్గాలు ఎప్పుడూ విజయం సాధిస్తాయని, ఎటుతిరిగి ఆటుపోట్ల బతుకు రైతులదే అవుతుందని ఆయన చెప్పిన మాటలు కలకలం రేపాయి. ఆ తరువాత నుంచి పలు రాష్ట్రాల నుంచి రైతు శిబిరాల వద్దకు అశేష సంఖ్యలో జనం తరలివస్తూనే ఉన్నారు. తికాయత్ రైతులను నడిపించే నేత అనే విషయం ఇప్పుడు రైతుల చొక్కాలపై మెరుస్తున్న ఆయన బొమ్మలతోనే స్పష్టం అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News