Monday, April 29, 2024

ప్రత్యామ్నాయమే ‘శరణ్యం’

- Advertisement -
- Advertisement -

Farmers should focus on alternative crops:KTR

వరికి బదులుగా నువ్వులు, కందులు, పల్లీలు, పొద్దుతిరుగుడు వంటి పంటలు

ఈ ఒక్క ఏడాదే దొడ్డుబియ్యం కొనుగోలుకు అంగీకరించిన కేంద్రం
వచ్చే ఏడాది నుంచి కొనుగోలు చేసేది లేదని స్పష్టీకరణ ప్రధానితో మాట్లాడి ఒప్పించిన సిఎం కెసిఆర్ వ్యవసాయరంగంలో రాష్ట్రం సాధించిన ప్రగతి అత్యద్భుతం మన రైతులు పంజాబ్‌ను మించి వరి పండించారు రైతు బిడ్డ అయిన కెసిఆర్ సిఎం కావడం మన అదృష్టం రైతు బీమాను ప్రారంభించిన మొదటి రాష్ట్రం తెలంగాణ ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన ప్రణాళికలు ముందుగానే సిద్ధం చేయాలి రాష్ట్రంలో పల్లీ పంటకు మంచి వాతావరణం ఉంది రైతులకు నచ్చజెప్పాలి అంతర పంటల సాగునూ ప్రోత్సహించాలి.
సిరిసిల్ల యాసంగి పంట మార్పిడి అవగాహనలో మంత్రి కెటిఆర్

మన తెలంగాణ /హైదరాబాద్/ సిరిసిల్ల: దొడ్డు బియ్యం కొనుగోలుకు ఈ ఒక్క సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కెటిఆర్ తెలిపారు. వచ్చే సంవత్సరం నుంచి కొనుగోలు చేసేది లేదని స్పష్టం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో రైతులు ప్రత్నామ్నాయ పంటలపై దృష్టి మళ్లేలా అధికారులు తగు దృష్టి సారించాలని ఆదేశించారు. ఇది ఒక రకంగా సవాల్ వంటిదన్నారు.

సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌లో యాసంగి పంటల సాగు, వచ్చే సీజన్‌లో పంటల మార్పిడి విధానాలపై ఆయాశాఖల ఉన్నతాధికారులతో మంత్రి కెటిఆర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దొడ్డు బియ్యం కొనుగోలు చేయడానికి మొదట కేంద్రం నిరాకరించిందన్నారు. ఈ విషయాన్ని సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన ప్రధాన మంత్రితో మాట్లాడి ఈ ఒక్క సంవత్సరం కొనడానికి ఒప్పించారన్నారు. అందువల్ల వరిపై కాకుండా ఇతర పంటలపై దృష్టి సారించని పక్షంలో తీవ్రంగా నష్టపోతామన్నారు. ప్రధానంగా నువ్వులు, కందులు, పల్లీలు, పొద్దుతిరుగుడు, శనగలు లాంటి పంటలు పండించాలని సూచించారు.. ఆయిల్ పాం పంటకు జిల్లాలో మంచి అవకాశం ఉందని కెటిఆర్ అన్నారు. ప్రతి గ్రామంలో వంద ఎకరాల్లో ఆయిల్ ఫాం పంట పండించేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు. తాను కూడా మోహినికుంటలో పది, పదిహేను ఎకరాలు కొనుక్కుని ఆయిల్ ఫాం పంటను పండిస్తానన్నారు.

పంజాబ్‌ను మించి మన రైతులు వరి పండించారంటే చాలా గర్వంగా ఉందని కెటిఆర్ అన్నారు. ఈ పంటలతో దేశానికి తెలంగాణ ధాన్య బండాగారంగా మారిందన్నారు. ఏ లక్ష్యం కోసం ప్రత్యేక తెలంగాణను తెచ్చుకున్నామో….ఆ లక్ష్యం సాధించామన్న సంతృప్తి వ్యవసాయ రంగం చూస్తే కలుగుతోందని కెటిఆర్ అన్నారు. ఒక్క సిరిసిల్ల జిల్లాలోనే గత సీజన్‌కు, ఈ సీజన్‌కు మధ్య లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం ఎక్కువగా పండిందన్నారు. రాష్ట్రం మొత్తం అసూయపడేవిధంగా సిరిసిల్ల రైతులు, నేతన్నలు అద్భుత ప్రగతి సాధిస్తున్నారని ఆయన ప్రశంసించారు. పంటల ఉత్పత్తికి అవసరమైన కరెంటు, నీటిని పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు.

ప్రధానంగా ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు కింద 85 శాతం చెరువులు 365 రోజులు నీరు ఉండే విధంగా తీర్చిదిద్దుకున్నామన్నారు. అలాగే ప్రాజెక్టులు, చెరువుల్లో చేపలు, రొయ్యలుపెంచడంతో పాటు గొర్రెల పంపిణీ పథకం ద్వారా రాష్ట్రంలో గొర్రెల సంఖ్యను రెట్టింపు చేశామన్నారు. మాంసాన్ని ఎగుమతి స్థాయికి ఎదిగామన్నారు. ఊరూరా ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి పండిన ప్రతి గింజను కొనుగోలు చేశామన్నారు. ఉమ్మడి ఎపిలో నష్టాల్లో ఉన్న విజయ డెయిరీని ప్రస్తుతం లాభాల బాట పట్టించామన్నారు. ఉచిత కరెంట్, సాగు నీరు, రైతుబీమా, రైతుబంధు, రుణమాఫీ అందిస్తూ రైతులకు బాసటగా ప్రభుత్వం నిలుస్తోందన్నారు. ఇప్పటికి 9 లక్షల మంది రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ చేశారన్నారు.

దేశంలో ఎవరికి రాని ఆలోచన

రైతుబిడ్డ అయిన కెసిఆర్ ముఖ్యమంత్రి కావడం మన అదృష్టమని కెటిఆర్ వ్యాఖ్యానించారు. రైతు బంధు అనేది దేశంలో ఎవరికి రాని ఆలోచన అని అన్నారు. ఈ పథకం స్పూర్తితోనే ప్రధాన మంత్రి నరేంద్రమోడీ పిఎం కిసాన్‌ను ప్రారంభించారన్నారు. రైతు భీమా పథకంను మొట్టమొదటి గా ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. ఎవరికి ఒక పైసా లంచం లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా ఒకే రోజు రిజిస్ట్రేషన్, ముటేషన్ ధరణి ద్వారా చేస్తున్న ప్రభుత్వం మనదేనని న్నారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. టిఆర్‌ఎస్ పార్టీ మొదటి విడత అధికారంలోకి వచ్చినప్పుడు లక్ష రూపాయలు పూర్తి రుణమాఫీ చేశామన్నారు. ఈసారి కూడా రూ.50 వేలలోపు రుణాలు మాఫీ చేస్తున్నామన్నారు. మిగతావి కూడా రుణమాఫీ చేస్తామన్నారు.

కరోనా కష్టకాలంలో కూడా ఏ రాష్ట్రంలో లేని విధంగా చివరి గింజ వరకు ధాన్యం కొన్నామని ఈ సందర్భంగా కెటిఆర్ గుర్తు చేశారు. ధాన్యం స్టోరేజీని 4 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 24 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచి గోదాములు కట్టుకున్నామన్నారు. మిషన్ కాకతీయ రూపంలో చిన్ననీటి వనరులను అభివృద్ధి చేసుకున్నామన్నారు. ఒకప్పుడు కరవు ప్రాంతంగా ఉన్న సిరిసిల్లలో ఇప్పుడు నీళ్లు ఎక్కువయ్యయాని రైతులు చెబుతున్నారన్నారు. ఇది తనకు అమితమైన సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. పాడి పరిశ్రమను ప్రోత్సహించేందుకు లీటర్‌కు 4 రూపాయలు ప్రోత్సహమిచ్చి.. క్షీరవిప్లవాన్ని ప్రోత్సహిస్తున్నామని కెటిఆర్ పేర్కొన్నారు.

పంటల మార్పిడికి ప్రొత్సహించాలి

బాయిల్ రైస్ నాలుగేళ్లకు సరిపడ కేంద్రం వద్ద ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలోని రైతులన పంటల మార్పిడికి ప్రొత్సహించాలని కెటిఆర్ సూచించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలను ఇప్పటి నుంచే సిద్ధం చేయాలన్నారు. సిఎం కెసిఆర్ పైనున్న అపార విశ్వాసంతో రైతులు మళ్లీ దొడు ్డవడ్లు సాగు చేసే అవకాశం ఉన్నందున.. వారికి పరిస్థితిని సమగ్రంగా వివరించాలన్నారు. నీళ్లున్నాయి కాబట్టి అందరూ వరివైపు వెళ్తారన్నారు. ఇందులో సన్నవడ్లు వేస్తే ఫర్వాలేదు…. కానీ దొడ్డు వడ్లతోనే సమస్య వస్తుందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పల్లి పంట(వేరుశనగ) పండించే వాతావరణం, భూములున్నాయన్నారు. అందువల్ల పత్తి, కందులు, మక్కలు, శనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు లాంటి పంటలను వేసుకునేలా ప్రోత్సహించాలన్నారు. అలాగే పప్పు ధాన్యాలు పండించం వల్ల రైతులకు మంచి ఆదాయం వస్తుందని కెటిఆర్ అన్నారు. అలాగే అంతర పంటల సాగును కూడా అధికంగా ప్రోత్సహించాలన్నారు. రాష్ట్రంలో ప్రతి ఐదువేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి ఉన్నారన్నారు.

రైతు వేదికలున్నాయన్నారు.. అధికారులు, రైతు వేదిక ప్రతినిధులు రైతులను ఒప్పించి పంటల మార్పిడివైపు ప్రోత్సహించాలని సూచించారు. ఇప్పటికీ కూరగాయలు, పామాయిల్ ఇతర ప్రాంతాల నుంచి తెప్పించుకుంటున్నామని కెటిఆర్ అన్నారు. ఆ సమస్య లేకుండా కూరగాయలు, మిర్చీ పంటలు ప్రోత్సహించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా స్టేట్ ఫుడ్ ప్రాసెసింగ్ స్టోర్స్ సంస్థ ద్వారా వాణిజ్య పంటలను ప్రోత్సహిస్తున్నదన్నారు. వాణిజ్య పంటలపై వ్యవసాయ అధికారులు రైతులకు తగిన అవగాహన కల్పించాలన్నారు. ఈ నెలాఖరు వరకు రైతువేదికలల్లో పంట మార్పిడి అంశాలపై చర్చలు సాగించాలన్నారు. ప్రజాప్రతినిధులు ముందుగా వేరుశనగ, కంది, పొద్దుతిరుగుడు,కూరగాయలు తదితర ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను సాగుచేసి రైతులకు ఆదర్శంగా నిలవాలన్నారు.

నీటితో కళకళలాడుతున్న సిరిసిల్లా

ఒకప్పటి కరువు ప్రాంతమైన సిరిసిల్లలో ఇప్పుడు ఎక్కడ చూసినా నీరే కనిపిస్తుందన్నారు. ఎగువమానేరు, మధ్యమానేరు, అన్నపూర్ణ ప్రాజెక్టుల వల్ల జలాశయాల సామర్ధం పెరిగిందని కెటిఆర్ అన్నారు. భూగర్భజలాలు పైకి వచ్చాయన్నారు.మల్కపేట జలాశయం పూర్తయితే భూగర్భ జలాలు మరింతగా పెరుగుతాయన్నారు. జిల్లాలోని 666 చెరువుల్లో 85 శాతం ఎప్పటికి పూర్తిగా నిండి ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో 4,72,329 ఎకరాల భూభాగంలో 2,48,000 ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉందన్నారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో సాగు చేస్తున్న ఆయిల్‌ఫామ్ పంటలను పరిశీలించడానికి త్వరలో ప్రజాప్రతినిధులను తీసుకువెళతామన్నారు.

జిల్లాలో ఎల్లారెడ్డిపేటలో మాదిరిగా మరో 5 కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. క్లస్టర్ల వారిగా ప్రతి గుంట స్ధలంలో ఏయే పంటలు వేశారనే రికార్డులు సిద్దంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా పరిషత్ చైర్మన్ న్యాలకొండ అరుణతో పాటు సహకార సంఘాల అధ్యక్షులు కొండూరి రవీందర్ రావు, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళచక్రపాణి, రైతుబంధు జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య, జిల్లా వ్యవసాయాధికారి రణధీర్ రెడ్డి, ఆర్‌డిఒ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News