Friday, May 3, 2024

13న జిహెచ్‌ఎంసి ఓటర్ల తుది జాబితా

- Advertisement -
- Advertisement -

Final list of GHMC voters on the 13th

 

అనంతరం ఏ క్షణాన్నైనా ఎన్నికల
నోటిఫికేషన్ : ఎస్‌ఇసి

మన తెలంగాణ/హైదరాబాద్ : ఎన్నికల ప్రక్రియలో రిటర్నింగ్ అధికారుల పాత్ర అత్యంత ప్రాధాన్యమైనదని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధి అన్నారు. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారిగా నియమించబడిన వారు పారదర్శకంగా, తటస్థంగా, నిష్పక్షపాతంగా ఉండాలన్నారు. అలాగే ఎన్నికలకు సంబంధించిన నియమ నిబంధనలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలోని సమావేశ మందిరంలో టిఒటి (ఆర్‌ఓలు, ఎఆర్‌ఓలకు శిక్షణ ఇచ్చే ట్రైనర్లు)లకు ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్థసారధి మాట్లాడుతూ, భారత రాజ్యాంగం 1992వ సంవత్సరంలో 73 మరియు74వ రాజ్యాంగ సవరణల ద్వారా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు స్వయం పరిపాలనా అధికారాలను వర్తింప చేసిందన్నారు. స్థానికులకు అధికారాలు ధారాదత్తం చేసి తమ ప్రాంతానికి సంబంధించిన సంక్షేమ, అభివృద్ధి కొరకు అవకాశం కల్పించిందన్నారు.

అలాగే ఆర్టికల్ 243 జెడ్‌ఎ క్రింద రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పడిందన్నారు. మోడల్ కోడ్ రూపకల్పన, గుర్తుల కేటాయింపు వంటి ప్లీనరీ అధికారాలు కలిగిన స్వతంత్ర సంస్థగా ఏర్పడిందని అన్నారు. గ్రామ పంచాయితీ నుండి జిల్లా పరిషత్ వరకు, మున్సిపల్ కౌన్సిళ్లు, కార్పొరేషన్ల ఎన్నికలు నిర్వహిస్తుందన్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కు ఎన్నికలు నిర్వహించడానికి సన్నాహక ప్రక్రియ మొదలైందన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఎలెక్టోరల్ రోల్స్ ప్రచురణకు సంబంధించిన నోటిఫికేషన్ జారీచేయడం జరిగిందని పార్ధసారథి అన్నారు. ఈ నెల 7వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా జారీ చేయడం జరుగుతుందన్నారు. అలాగే 8 వ తేదీ నుండి 11వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించడంతో పాటు వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరించి 13వ తేదీన తుది ఓటర్ల జాబితా ప్రచురించడం జరుగుతుందన్నారు. తుది జాబితా ప్రచురించిన తరువాత ఎప్పుడైనా రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయవచ్చన్నారు.

రిటర్నింగ్ అధికారులు ఎన్నికలకు సంబంధించిన రూల్స్, నియమ నిబంధనలు, ఎన్నికల సంఘం సమయానుగుణంగా జారీ చేసే సూచనలను ఆకళింపు చేసుకొని అవసరాన్ని బట్టి ఉపయోగించేలా పూర్తి అవగాహనతో ఉండాలని ఆయన సూచించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి బాధ్యత రిటర్నింగ్ అధికారిదేనని ఆయన స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల గుర్తింపు, పోలింగ్ సిబ్బంది నియామకం, వారికి పోలింగ్ కు సంబంధించిన సామాగ్రి సమకూర్చడం వంటి ప్రతి పనిని పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. నామినేషన్ల స్వీకరణ నుండి ఫలితాల ప్రకటన వరకు తీసుకోవాల్సిన చర్యలు, నిర్వర్తించాల్సిన బాధ్యతలకు సంబంధించి చెక్ లిస్ట్ తయారు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మోడల్ కోడ్ ప్రతులు రాజకీయ పార్టీలకు, అభ్యర్థులకు అందించి వాటిని అమలు చేసేలా చూడాలని, ఎన్నికల ఖర్చుకు సంబంధించి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహించాలన్నారు. అదే విధంగా అభ్యర్థుల అఫిడవిట్లు, నేర చరిత్ర పరిశీలించాలని, అనర్హతకు సంబంధించిన రూల్స్‌పై పట్టు ఉండాలన్నారు.

పోలింగ్ అధికారులు, సహాయ పోలింగ్ అధికారులు, ఇతర పోలింగ్ అధికారుల బాధ్యత రిటర్నింగ్ అధికారులదే ఆయన అన్నారు. జిహెచ్‌ఎంసిలో మొత్తం 150 వార్డులు, 30 సర్కిల్లు ఉన్నాయని పార్థసారధి అన్నారు. ఒక్కో సర్కిల్ కు ఒక డిప్యూటీ కమిషనర్ ఉన్నారని, వీరికి ఎన్నికలకు సంబంధించిన విధులు కేటాయించడం జరిగిందని, ఎన్నికలకు సంబంధించి 150 వార్డులకు 150 మంది రిటర్నింగ్ అధికారులు, 150 కౌంటింగ్ సెంటర్లు ఉంటాయన్నారు. సగటున ఒక్కో వార్డుకు 50 పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. అలాగే పోలింగ్ స్టేషన్లలో వీడియో, వెబ్ క్యాస్టింగ్‌కు ఏర్పాట్లు చేయాలన్నారు. ప్రతి వార్డులో విశాలంగా, మంచి లైటింగ్ ఉండి ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ఒక పోలింగ్ స్టేషన్ ను ఎంపిక చేసి ఫేస్ రెకగ్నిషన్ టెక్నాలజీకి ఏర్పాట్లు చేయాలన్నారు. రిటర్నింగ్ అధికారులు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కోవిడ్ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఓటరు మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఎప్పటికప్పుడు శానిటైజర్లు ఉపయోగించేలా చూడాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News