Saturday, April 27, 2024

మయన్మార్‌లో నిరసనకారులపై జలఫిరంగులు, కాల్పులు, నలుగురి మృతి

- Advertisement -
- Advertisement -

Firing on protesters in Myanmar:4 dead

 

భద్రతాదళాలపై తిరగబడుతున్న ఆందోళనకారులు
సోషల్‌మీడియాలో ఫోటోలు

యాంగోన్: మయన్మార్‌లోని మిలిటరీ ప్రభుత్వం ఆదివారం పలుచోట్ల నిరసనకారులపై జల ఫిరంగులు, బాష్పవాయువుతోపాటు కాల్పులకు తెగబడినట్టు సోషల్ మీడియా ద్వారా వెల్లడైంది. పోలీస్ హింసలో కనీసం నలుగురు మరణించినట్టు తెలుస్తోంది. వీరిలో ఒకరు యాంగోన్‌లో కాగా, మరో ముగ్గురు దవేయి అనే నగరంలోనని తెలుస్తోంది. ఫిబ్రవరి 1న మయన్మార్‌లోని ఎన్నికైన ప్రభుత్వాన్ని కూల్చేసి, మిలిటరీ అధికారం చేపట్టిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందనేది పారదర్శకంగా వెల్లడికాని పరిస్థితి. ఆదివారం భద్రతాదళాలు జరిపిన కాల్పుల్లో మృతుల సంఖ్య మరింత అధికంగా ఉన్నట్టు భావిస్తున్నారు. ఆదివారానికి ముందు ఆ దేశంలో 8మంది నిరసనకారులు మృతి చెందినట్టు నిర్ధారణ అయింది. మరోవైపు వందలాదిమంది నిరసనకారులను మిలిటరీ ప్రభుత్వం అదుపులోకి తీసుకున్నది.

ఆదివారం యాంగోన్‌లో నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు, జలఫిరంగుల్ని ప్రయోగించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాల్పుల్లో చనిపోయిన ఓ యువకుడి ఫోటో కూడా అందులో ఉన్నది. కొన్ని చోట్ల నిరసనకారులను తరుముతున్న పోలీసులకు అడ్డంగా స్థానికులు బారికేడ్లను ఏర్పాటు చేస్తున్న దృశ్యాలు కనిపించాయి. భద్రతా దళాలపై జల ఫిరంగులు, బాష్పవాయు గోళాలతో నిరసనకారులు తిరగబడినట్టు తెలిపే ఫోటోలు కూడా ఉన్నాయి. మొదట యాంగోన్‌లోని వైద్య విద్యార్థులు నగరంలోని ప్రధాన కూడలిలో నిరసన ప్రదర్శనకు దిగారు. వారిని చెదరగొట్టేందుకు భద్రతా దళాలు జలఫిరంగులు, బాష్పవాయి గోళాలను ప్రయోగించాయి.

దాంతో, భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. యాంగోన్‌లో పోలీసుల కాల్పుల శబ్దాలు, నిరసన గుంపులపై గ్రెనేడ్లు విసరగా విడుదలైన దట్టమైన పొగకు సంబంధించిన వార్తలు కూడా వెల్లడయ్యాయి. దవేయిలో నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్నవారిపై నేరుగా కాల్పులు జరపడం ఆమోదయోగ్యం కాదని న్యూయార్క్ కేంద్రంగా పని చేసే హ్యూమెన్ రైట్స్ వాచ్ ఆసియా డిప్యూటీ డైరెక్టర్ ఫిల్‌రాబర్ట్‌సన్ అన్నారు. మయన్మార్‌లోని మిలిటరీ ప్రభుత్వ హింసాత్మక చర్యలను ప్రపంచం గమనిస్తోందని ఆయన హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News