Friday, April 26, 2024

చెన్నపట్నం కదంబపూలు

- Advertisement -
- Advertisement -

Impressions of Telugus in Madras were not erased

 

ఏ భాషా గృహానికైనా మాటలు ఇటుకల్లాంటివి. అయితే మాండలికాలు స్థంభాల్లాంటివి. భాష బలపడటానికి అవి ఎంతో దోహదం చేస్తాయి. ఒకప్పుడు మాండలికాలకి సాహిత్యంలో పెద్దగా చోటు వుండేది కాదు. గ్రాంధిక భాష పోయి వ్యవహారిక భాష పేరుతో ఒక ప్రామాణిక భాష సాహిత్య రంగాన్ని ఆక్రమించుకుంది. అన్ని ప్రాంతాల వారికి సాహిత్యం తేలిగ్గా అర్ధమవడానికి అది అవకాశం కల్పించింది. అయితే జన వ్యవహారంలో మాండలికాలిదే పై చేయి. దానికి పండిత పామరుల బేధం లేదు. ఎవరి మాటతీరైనా మాండలిక ప్రభావానికి లోబడే వుంటుంది. ఆధునిక కాలంలో శ్రీపాద, రావిశాస్త్రి, మా గోఖలే, రంగాచార్య, యశోదా రెడ్డి లాంటి గొప్ప రచయితలు మాండలికాలకు పెద్దపీట వేశారు. వాటికి ఒక గౌరవాన్ని, ఆదరాన్ని కల్పించారు. ఇప్పుడైతే మాండలికంలో వచ్చిన రచనకి, విషయంతో సంబంధం లేకుండా ఒక గౌరవం, గుర్తింపు రావడం మనం చూస్తున్నదే!

మదరాసు తెలుగు లేదా అరవం కలసిన తెలుగుని కూడా ఒక తెలుగు మాండలికంగా గుర్తించాలి. ఆ మాండలికంలో అక్కడక్కడా కొన్ని రచనలు వచ్చినా, కొన్ని సినిమాల్లో కొన్ని పాత్రలు, ముఖ్యంగా హాస్య పాత్రల నోట పలికించినా, మిగతా మాండలికాల వలె పెద్ద ఎత్తున సాహిత్య సృజన జరగలేదనే చెప్పాలి. ఆ లోటును తీర్చడానికి చెన్నపురి రచయితల సంఘం (చెన్నరసం), చెన్నైవారు ”మదరాసు బదుకులు” (చెన్నపురి కతలు) అన్న పుస్తకాన్ని సెప్టెంబరు 2017 లో ప్రచురించారు. దీనికి సంపాదకవర్గంగా డా. నాగసూరి వేణుగోపాల్, డా. రాయదుర్గం విజయలక్ష్మి, భువనచంద్ర వ్యవహరించారు. సంపాదకుల్లో ఒకరైన నాగసూరి ఇలా అంటున్నారు ముందుమాటలో… ’మదరాసుతో నేరుగా అనుబంధం వుండి, తెలుగువారి జీవితాలను చిత్రించే కథలు అనేది నియమం. అయితే ఆ కథలు మద్రాసు నుడికారం అయినా లేదా తంజావూరు తెలుగు నుడికారం అయినా అభ్యంతరం లేదు.

లేదా తెలుగు పత్రికలు, టీవీ ఛానళ్లు వాడే తెలుగు అయినా ఫరవాలేదు…’ చెన్నరసం పెట్టుకున్న నియమానికి అనుగుణంగానే ఈ రచనల్లో అన్ని రకాల నుడికారాలు, మాండలికాలు కనిపిస్తాయి. వీటిని చదవడం ప్రధాన స్రవంతి తెలుగువారికి ఒక అపురూపమైన అవకాశం. చెన్నపట్నంలో వుంటున్న వారిచేత రచనలు చేయించడం, కొత్త రచయితలను ప్రోత్సహించడం ఈ పుస్తక ప్రచురణలో ప్రధాన ఉద్దేశ్యమని సంఘం ప్రకటించింది. ఈ పుస్తకం చూస్తే వారి ఆశయం నెరవేరిందనే చెప్పాలి.

ఈ సంకలనంలో మొత్తం 36 మంది రచయితల రచనలు ఉన్నాయి. వీరిలో ఇరవై మంది వరకు రచయిత్రులు. దీనిలో ప్రధానంగా కథలున్నా, కొన్ని వ్యాసాలు, జ్ఞాపకాలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రక్రియ విషయం పక్కన పెడితే అన్నీ మదరాసు బ్రతుకుల్ని పరిచయం చేసేవే. వీటిలో కొన్ని కథలు మద్రాసు ఆకాశవాణి తెలుగు విభాగంలో ప్రసారం అయినవి. వివరాలు లేకపోయినా వీటిలో కొన్ని వివిధ పత్రికల్లో వచ్చినవే కావొచ్చును.’మన వూరు మదరాసు’ పేర ప్రఖ్యాత రచయిత మధురాంతకం నరేంద్ర ఆత్మీయంగా రాసిన తొలిపలుకు మదరాసు మహానగరంపై తెలుగువారి మమకారాన్ని పట్టి చూపుతుంది.

’ఇప్పుడు విరివిగా వస్తున్న ప్రాంతీయ కథా సంకలనాలకు ’మదరాసు బతుకులు’ మంచి చేర్పుగా రూపొందింది. తెలుగు అనే విస్తృతమైన పటంలోని ఖాళీలన్నీ యిలానే పూరించబడాలని కోరుకుందాం’ అని అభిప్రాయపడ్డారు నరేంద్ర. ’కథ-ప్రాంతీయత-ఇతివృత్తం’ పేర ప్రసిద్ధ కథారచయిత శ్రీవిరించి ప్రాంతీయ సంకలనాలపై తమ అభిప్రాయం చెప్పారు. ’ప్రాంతీయత-వాతావరణం-మాటలు-పని తీరు-యివన్నీ కథలో వ్యక్తం అయినప్పుడే అది ఆ ప్రాంతం (మాండలికం) కథ అవుతుంది తప్ప మరో రకంగా కాదు’ అంటారు ఆయన. గతంలో వచ్చిన మదరాసు ప్రాంత కథలకు చెందిన సాహిత్య చరిత్రను సూక్ష్మంగా చెప్పారు శ్రీవిరించి. భువనచంద్ర ఈ పుస్తకంలో ప్రచురితమైన కథలన్నింటినీ సంక్షిప్తంగా సమీక్షించారు.

ఇక కథల విషయానికొద్దాం. అన్ని కథల్నీ పరామర్శించడం కుదరకపోయినా, కొన్నింటిని రేఖామాత్రంగా పరిశీలిద్దాం.
బ్రిటిష్‌వారి హయాంలో మదరాసు కార్పోరేషన్ ప్రెసిడెంట్‌గా వున్న లెఫ్టినెంట్ కల్నల్ సర్ జార్జ్ మూర్ పేర 1898 సం||లో ఏర్పాటు చేసినది మూర్ మార్కెట్. ఇది ఈనాటి మాల్స్‌కి ఆనాటి రూపం. ఆ మార్కెట్‌లో దొరకని వస్తువంటూ వుండదని ప్రజలు నమ్మేవారు. మద్రాస్‌లో ప్రసిద్ధిచెందిన ల్యాండ్‌మార్క్ అది. ఆ మార్కెట్ 1985 మే నెల 20వ తేది రాత్రి కాలిపోయి కాలగర్భంలో కలిసిపోయింది. ఎందరో చిన్నా చితకా వ్యాపారుల జీవితాల్లో నిప్పులు పోసింది. ఈ అంశాన్ని చిత్రించిన కథ ”రూపాంతరాలు”. రచయిత్రి డా. రాయదుర్గం విజయలక్ష్మి.

డిసెంబర్ ఒకటి 2015. ఆరోజు చెన్నైని మహా కుంభవృష్టి ముంచెత్తింది. నగరవాసుల జీవితాల్ని అతలాకుతలం చేసింది. ఆ ఘటనను తీసుకుని రాసిన మూడు కథలు వున్నాయి ఈ సంకలనంలో. అవి డా. డి.రాంబాబు ’కన్నీటి వరద’, కె.అరుణకాంతి ’తెలుగు మామి’, రిషి శ్రీనివాస్ ’డాలీ’. ’డాలీ’ కథ ఒక ప్రముఖ దినపత్రిక ఆదివారం అనుబంధంలో వచ్చి చాలా మందిని ఆకట్టుకుంది.

చిత్రకారుడైన తండ్రి, ఆ తండ్రి నుండి ఆ కళను వారసత్వంగా అందిపుచ్చుకున్న కూతురు. ఆ పాపకి క్యాన్సర్. ఎక్కువ కాలం బ్రతకదని డాక్టర్లు చెబుతారు. ఏమైనా కోరికలుంటే తీర్చమని సలహా ఇస్తుంటారు. పాప కోరిన విధంగా ఖరీదైన కారుని కొని, దానిపై పెయింటింగ్ వెయ్యాలని స్వంత ఇంటిని అమ్మేస్తాడు తండ్రి. ఇల్లు కొన్నవాడు కుంభవృష్టికి అది దెబ్బతింటే గొల్లుమంటాడు. వాన దెబ్బకి కార్లు పాడయ్యి వాటిని యజమానులు చౌకగా అమ్మకానికి పెట్టారన్న వార్త చూస్తాడు తండ్రి. పాప కోరిక తీర్చడానికి కారును కొని పెయింటింగ్ వెయ్యాలని నిర్ణయించుకుంటాడు అతను. కథకి ఫుల్‌స్టాప్ పడుతుంది. అది ఫుల్‌స్టాప్ కాదు పాఠకుడి కంట ఉబికిన కన్నీటి చుక్క. కారు కొనే స్ధోమత లేకపోయినా చనిపోతున్న కూతురి చివరి కోరిక తీర్చాలనుకునే తండ్రి తపన పాఠక హృదయాన్ని కదిలిస్తుంది.

శ్రీనివాస్ కథలో పాప విషాదంది పై చెయి అయ్యి, ఆనాటి కుంభవృష్టి కేవలం నేపథ్యంగా మాత్రమే నిలిచింది. కాని ఆనాటి వాన బీభత్సాన్ని పూర్తిగా డాక్యుమెంట్ చేసిన కథ అరుణకాంతి గారి ’తెలుగు మామి’. ఒక విషయాన్ని యధాతధంగా చెప్పుకుంటూపోతే అది వార్తా కథనమో, డాక్యుమెంటరీనో అవుతుందే గాని దాన్ని ఏ కథగానో మలచి కళాత్మకంగా చెప్పగలిగినపుడే పది కాలాలపాటు నిలిచే రచనవుతుంది. దీనికి మంచి ఉదాహరణ ’తెలుగు మామి’. అందరికీ కఠిన హృదయురాలిగా కనిపించే తెలుగు మామి ఆ ఉపద్రవ వేళ కనబరచిన మానవత్వం, ఆమె దక్షత, ధైర్యం పాఠకుణ్ణి ఆశ్చర్యపరుస్తాయి.

ఒంటరిగా బతుకు బండి లాగించడానికి, లోకంతో వేగడానికి ఒకింత మొండితనం, బండతనం తప్పదేమో అనిపిస్తుంది ఆ పాత్రని చూస్తే. నోట్ల రద్దుకి పాత బాకీలకి ముడిపెట్టి రాసిన మంచి ప్రహసనం లాంటి కథ… ’ఎవ్విరి యాక్షన్ గాట్?…’ చదివిన తర్వాత మన రియాక్షన్ నవ్వే!… నాటకంలా అనిపించే కథ. మధ్యతరగతి మందహాసాల్ని మెరిపించి మన మొహాలపై హాసాల్ని మొలిపిస్తారు రచయిత భువనచంద్ర. ’మునీస్వోరుడి మొక్కు’ ప్రఖ్యాత కార్టూనిస్టు జయదేవ్ రాసిన మదరాసీ మాండలికాన్ని, యాసని అద్భుతంగా పలికించిన సరదా అయిన కథ.

డా. చల్లా భాగ్యలక్ష్మి ’మసక’ చాలా మంచి కథ. ఇది ఆమె మొదటి కథ అంటె నమ్మబుద్ధి కావడంలేదు. ఈమె పాటల రచయిత. చేయి తిరిగిన పాత్రికేయురాలు అని తెలిసిన తర్వాత ఆ అనుభవంతోనే ఇంత మంచి కథ రాసారనిపించింది. పెళ్లిచూపులు నాడే పుష్ప తనకు వంట రాదని అంటే… ”నేను దినామూ రగరగాల సమయల్‌తో జమాయిస్తును” అని అంటాడు పెళ్లికొడుకు రామనాథం. పెళ్లి అయిన తర్వాత కూడా అంతే అపురూపంగా చూసుకుంటాడు ఆమెను. కాని ఒక యాక్సిడెంట్‌లో అతను మరణిస్తాడు. ”అమ్మణ్ణి, పొణ్ణణ్ణా పూవుం బొట్టుం ఇరక్క నుండేం కణ్ణే” (అమ్మడూ అమ్మాయంటే పూవు బొట్టూ ఉండాల్రా కణ్ణే) అని ఎప్పుడూ అనే రామనాథంతో నిత్య వసంతంగా గడిచిన ఆమె జీవితం ఒక్కసారి మోడుబారిపోతుంది.

తర్వాత మురుగేసన్ పుష్ప జీవితంలోకి ప్రవేశిస్తాడు. పెళ్లి అయ్యేవరకు ఎంతో ఒద్దికగా వున్న అతను తన నిర్లక్ష్యధోరణితో ఆమె హృదయాన్ని గాయపరుస్తుంటాడు. కథ ముగింపులో మనస్తత్వ శాస్త్ర అంశాన్ని జోడించారు రచయిత్రి. గత జీవితానికి, ఇప్పటి జీవితానికి వున్న తేడా పుష్పని కలవరపాటుకు గురి చేస్తుంది. అదే అంశం ప్రతీకాత్మకంగా కలలో కనిపించి ఉలిక్కిపడి లేస్తుంది. అది చదవగానే పాఠకులూ ఉలికిపాటుకు గురి అవుతారు.

చారిత్రిక అంశాల్ని, తెలుగు భాష ప్రత్యేకతను, తెలుగువారి ఔన్నత్యాన్ని చెబుతూ ఒక ప్రేమ కథ నేపథ్యంలో ’కాలగమనం’ కథ రాశారు ముళ్ళపూడి ఉమాదేవి. ’అరవై ఏళ్ల క్రితం మద్రాసు నగరం జనాభాలో అరవం, తెలుగు, మళయాళం అన్న బేధం వుండేది కాదు. ముఖ్యంగా తమిళ ప్రజలెంతమంది వుండేవారో, యించుమించు అంతే మంది లేదా అంతకంటె ఎక్కువ మందో తెలుగువారు వుండేవారు” అంటారు కథకురాలు. ఈ కథ అప్పటి రాజకీయ వైరాలను కూడా సూక్ష్మంగా ప్రస్తావించింది. జె.టి. ఆచార్యాలు రాసిన ’ప్రథమానుభవం’ చాలా సహజంగా సాగిన మంచి కథ. రచయిత చిన్నతనంలో జరిగిన ఘటనకు కథారూపం ఇది. ఇప్పుడు అన్ని రంగాల్లోను అవినీతి తాండవం ఆడుతోంది. కాని ఆ రోజుల్లోనే జరిగిన ఒక పకడ్‌బందీ అవినీతి కథ ఇది. పూనమల్లి హై రోడ్డు మీద ప్రయాణంలా చకచక చదివించే కథ.

’పూలతోట ముళ్లబాట’ సీనియర్ రచయిత్రి శ్రీమతి సరోజినీ ప్రేమ్‌చంద్ రాసిన మంచి కథ. ’చెట్లూ ఈ పూలు, ఇక్కడి ఏకాంతమూ… వీటితో నాకు బాంధవ్యం ఉన్నది. ఇదే జీవన మాధుర్యం అనిపిస్తోంది. నేను ఏకాంత జీవిని… అందులోనే సౌందర్యాణ్ణి, సౌఖ్యాన్ని కనిపెట్టాను. అనుభూతి చెందాను…’ అని భావించే మిత్ర ఒక స్వాప్నికుడు. అతనితో స్నేహం చేసిన జయప్రియ, వారి మధ్య వున్న బంధాన్ని వివాహంతో శాశ్వతం చేసుకోవాలనుకుంటుంది. అతను అంగీకరించడు. కలసి ఒకే చోట బ్రతికితే కలతలతో ఘర్షణలతో స్నేహం కలుషితం అవుతుందని అతని భావన. ’స్వార్ధం ఎంత భయంకరమో, త్యాగమూ అంతే భయంకరం. మనుషులను క్రూరంగా చేస్తుంది…’ అన్న మంచి వాక్యం ఈ కథలో కనిపించి, అలోచింపజేస్తుంది. ఎవరికి ఇష్టమైన తీరుతో వారు బ్రతకడమే మేలనే విషయాన్ని ఈ వాక్యం ద్వారా చెబుతారు రచయిత్రి. ఒక మంచి అనుభూతి కవితలా సాగే కథ. ఈ రచయిత్రి జిడ్డు కృష్ణమూర్తి రచనల్ని తెలుగులోకి అనువాదం చేశారు. ఈ కథ పై ఆయన భావాల ప్రభావం అంతర్లీనంగా కనిపిస్తోంది.

మదరాసు చూడ్డానికి వచ్చిన ఒక విదేశీయుడు జార్జ్. అతనికి మద్రాసు విశేషాలు చూపించే గైడ్‌లా వ్యవహరించడానికి రేఖ అనే యువతి తన అమ్మమ్మ చెప్పడంతో ఒప్పుకుంటుంది. కాని చిత్రంగా ఆమె కంటె మదరాసు గురించి జార్జ్‌కే ఎక్కువ తెలుసు. ఈ కథని అడ్డం పెట్టుకుని సీనియర్ రచయిత్రి జలంధర కాశీపట్నం చూడర బాబు అన్న పద్ధతిలో మదరాసు సంగతులెన్నో ఈ ’అమ్మమ్మ’ కథలో చెబుతారు. కథ బాహ్య రూపం ఎలా వున్నా, తాత్వికాంశాల చర్చ ఈ కథ అసలు ఆత్మ. తాత్విక గాఢత ఈ కథ స్థాయిని పెంచి, సాధారణ కథల నుండి వేరు చేస్తుంది. దేన్నైనా లోతైన చూపుతో చూసే ఎనభై ఏళ్ల నవయువకుడు జార్జి. సముద్రాన్ని చూస్తే అతనికి భైరన్ మాట ”ఆల్మైటీ మిర్రర్‌” జ్ఞాపకానికొస్తుంది. ఆ పాత్ర వ్యక్తిత్వాన్ని అద్దంలో చూపే మాట!

’ఏ ఫీల్ గుడ్ స్టోరీ’ అనిపిస్తుంది ’భయం లేని బతుకు’. దీని రచయిత సుప్రసిద్ధుడైన శ్రీవిరించి. బ్రతుకుతెరువు కోసం వెంకటగిరి నించి మదరాసు వచ్చి ఇస్త్రీ షాపుతో భార్యా బిడ్డల్ని పోషించుకునే పరశురాం కథ. కథ పేరులాగానే అతని జీవితమూ సాఫీగా జరిగి… చేసేది ఏ పనైనా నిబద్ధతతో చేస్తే విజయం తప్పదు అని చాటే కథ.

దాక్షిణాత్య శాస్త్రీయ సంగీతానికి మానససరోవరం లాంటిది మదరాసు మహా నగరం. కర్ణాటక సంగీత ప్రస్తావన లేకుండా మదరాసు పై చర్చ అసంపూర్ణం. ఈ సంపుటిలోని శ్రీమతి రామ్‌నాథ్ ”ద్యామిడి చెట్టు” అనే కథ ఆ పార్శ్వాన్ని పూరించింది. ’మదరాసులో నా చదువు’ చారుశ్రీ కథ. మాతృ భాషలో చదువు సాగించాలని తపన పడ్డ ఒక విద్యార్ధి ఎదుర్కొన్న సమస్యల్ని ఆసక్తిగా చెప్పినది.

ఈ కథల్లో ప్రధానంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారి జీవితాల్ని చిత్రించారు రచయితలు. దీనికి భిన్నంగా పేద వర్గాల బ్రతుకుల్ని చిత్రించిన కథ డా. విస్తాలి శంకరరావుగారి ’తడి ఆరని బ్రతుకులు’. ఆంధ్రలోని ప్రకాశం, నెల్లూరు ప్రాంతాల నుండి జీవనోపాధి కోసం మదరాసుకు వలస వచ్చి కార్పోరేషన్‌లో పారిశుద్ధ్య కార్మికులుగా పని జేసేవారిలో తొలి తరంవారు మాలకొండయ్య. పని పట్ల నిజాయితీ, నిబద్ధత ఆయన నైజం. పై అధికారులు అతన్ని ఎంతో గౌరవంతో చూస్తారు. ఆయన అనారోగ్యంతో చనిపోవడంతో కథ ప్రారంభమవుతుంది. మాలకొండయ్య చావును నేపథ్యంగా తీసుకుని పారిశుద్ధ్య కార్మికులు ఎక్కువగా వుండే కామరాజర్ నగర్ మురికివాడలో వుండే వారి బ్రతుకుల్లోని దైన్యాన్ని విషాదాన్ని పాఠకుల ముందు ఉంచారు రచయిత. అప్పు చేస్తేగాని శవాన్ని తీసే పరిస్థితి వుండదు.

కాని మాలకొండయ్య తన కొడుకు ఓబులేసుని బాగా చదివిస్తాడు. ఓబులేసు మద్రాసు విశ్వవిద్యాలయంలో ఆర్ధిక శాస్త్ర పరిశోధక విద్యార్ధి. తండ్రి చనిపోయిన సమయానికి లండన్‌లో ఒక అంతర్జాతీయ సదస్సులో పాల్గొని, తన తండ్రి లాంటివారి బ్రతుకుల్లోని దైన్యస్థితిని వివరిస్తూ ప్రసంగం చేస్తూ వుంటాడు. మురికిని శుభ్రం చేస్తూ, నగరాన్ని అద్దంలా వుంచుతూ, ప్రజల ఆరోగ్యానికి పూచీ పడుతూ తాము మాత్రం అదే మురికికూపంలో మాలిన్యాల మధ్య బ్రతుకీడుస్తూ వుండే తనవారి గురించి ప్రసంగంలో చెబుతూంటే, సదస్సులో పాల్గొన్నవారు అపరాధ భావనకు లోనవుతారు. ఈ కథ ద్వారా రచయిత తను చెప్పదలచుకున్న విషయాన్ని ఓబులేసు ప్రసంగంలో ప్రతిఫలించారు. ఒక వైపు శవం ఉండగానే ఆ ప్రాంత యువకులు ’పులి మేక ఆడుతూ హాస్యాలాడుతూ వుంటారు. దుర్భర జీవితం కలిగించే ఒక రకమైన నిర్లిప్తత, నిస్పృహని చెప్పడానికి ఈ సన్నివేశాన్ని కల్పించారు రచయిత. మద్రాసు నగరంలో పారిశుద్ధ్య కార్మికుల్లో తొంభై శాతం తెలుగువారే అంటారు రచయిత. ఈ దృష్ట్యా, ఈ సంకలనంలో ఈ కథ ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చును.

ఈ కథల్ని చుదువుతుంటే కొన్ని తమిళ పదాలు కూడా మనకి తెలుస్తాయి. ఉదాహరణకు మనం నిద్ర గన్నేరు అనేదాన్ని అరవంలో ’తూక్క మాంజీ’ (నిద్ర ముఖం) అంటారట. అలాగే మన అరసెల్ని వాళ్లు ’నిప్పట్లు’ అంటారు. అక్కడి వారి భాషలో ఎన్నో అచ్చ తెలుగు పదాలు కనిపిస్తాయి. తావు, పడచు, లెస్స (నెస్స) ఉదాహరణలు. భాషాపరంగా తెలుగువారు ఎదుర్కొనే ఇబ్బందుల్ని హాస్యంగా చెప్పిన కథలున్నాయి ఈ సంకలనంలో. హోటల్‌లో ఒక తెలుగు ఇల్లాలు ఎవరో అన్న ”తన్ని పోడప్పా” అన్న మాట విని బెదిరిపోతుంది. అలాగే మనం ”ఉట్టి” అనేదాన్ని తమిళంలో ’ఉరి’ అంటారు. ఈ తేడాతో ”అనుభూతులు” కథలో ఆర్.ఎస్. హైమావతి మంచి హాస్యం పండించారు. ”ముందుగా విద్దురూ కాపీలు బోంచేయండి” అని జయదేవుగారి కథలో వెంకటేశం పాత్ర అంటుంది మామ సోమయ్య, అత్త రాజేసురితో ’ముందుగా మీ ఇద్దరూ కాఫీలు తాగండి’ అని మనకి తేలికగానే అర్ధమవుతుంది.

ఈ పుస్తకంలో ఇంకా ’నా చెన్నై కథ’ (మన్నవ గంగాధర్ ప్రసాద్). ’బుజ్జాయి’ నాకు గుర్తున్న మద్రాసు లాంటి మంచి జ్ఞాపక రచనలు వున్నాయి. చల్లగళ్ల నాగేంద్ర ప్రసాద్ ’డ్భె యేళ్లకు మునుపు’ అలనాటి విశేషాలు ఎన్నిటినో తెలియజేస్తుంది. ’తెలుగు వెలుగు’ (గంగుల బాబు) ఒక విశిష్ట రచన. తమిళనాట తరతరాలుగా వున్న తెలుగు ప్రజల జీవితాల గురించి మనకి తెలియని విషయాలు దీని ద్వారా తెలుస్తాయి. ఇటీవల కాలంలో తెలుగులో అనేక ప్రాంతీయ కథా సంకలనాలు వస్తున్నాయి. గుంటూరు కథ, కర్నూలు కథ, పార్వతీపురం కథలు, విశాఖ తరంగాలు మొదలైనవి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. మదరాసు మాండలికం. యాస భాషల్ని ప్రతిఫలించిన కథా సంకలనంగా ఈ ’మదరాసు బతుకులు’ను పేర్కొనవచ్చు. తెలుగు వాతావరణం కొంతవరకు కొరవడిన ప్రాంతంలో వుంటూ కూడా అమ్మనుడి పట్ల అభిమానంతో ఇంత మంది రచనలు చేయడం, వాటిని అందమైన పుస్తకంగా తీసుకురావడం ఎంతైనా ఆనందించదగ్గ విషయం. చెన్నపురి రచయితల సంఘానికి, రచయితలకు జేజేలు.

ప్రతి నగరానికి ఒక ప్రత్యేక వ్యక్తిత్వం వుంటుంది. హైదరాబాద్ అంటె అది… అత్తరు పరిమళాలపై తేలివచ్చే, తలలూపించే ఉర్దూ షాయిరీ లేదా ప్రజా ఉద్యమాల సంద్రంపై ఉదయించే, ఊగించే వేయి వెలుగుల గద్దరు పాట!… అదే చెన్నపట్నం మనసులో మెదిలితే ఒక త్యాగరాయ కీర్తన… కోవెల పుష్కరిణిలో వికసించిన ప్రభాతపద్మం జ్ఞాపకానికి వస్తాయి. ఆ పద్మపు రేకులే ఈ కథలు…
మదరాసులో తెలుగువారి ముద్రలు చెరిపేస్తే చెరిగేవి కావు. బీచ్ రోడ్‌లో బ్రిటిష్ కాలంలో కట్టిన వార్ మెమోరియల్ పైని ”జయం” అన్న తెలుగక్షరాలు తెలుగుకు జయజయధ్వానాలు పలుకుతూనే వుంటాయి చిరస్థాయిగా…

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News