Saturday, May 4, 2024

యూట్యూబర్‌పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

తన యూట్యూబ్ ఛానల్‌ను మూసేయాలని ఆదేశం
చెన్నై: రోడ్లపై బైక్‌తో స్టంట్‌లు చేసి ప్రమాదానికి గురైన కేసులో అరెస్టయిన ఓ యూట్యూబర్‌కు బెయిల్ ఇచ్చేందుకు మద్రాస్ హైకోర్టు నిరాకరించింది. ర్యాష్ డ్రైవింగ్‌పై యువతను ప్రేరేపిస్తున్న అతడు గుణపాఠం నేర్చుకోవలసిందేనని న్యాయస్థానం ఆగ్రహించింది. అతడు తన యూట్యూబ్ ఛానల్‌ను మూసివేయాలని ఆదేశించింది. తమిళనాడుకు చెందిన టీటీఎఫ్ వాసన్ యూట్యూబ్‌లో చాలా పాప్యులర్. బైక్ స్టంట్లు, రోడ్ ట్రిప్పులపై వీడియోలు చేసి పోస్ట్ చేస్తుంటాడు. అతడి ఛానల్‌కు లక్షల మంది ఫాలోవర్లున్నారు.

సెప్టెంబర్ 17న అతడు ఓ రోడ్ ట్రిప్‌లో భాగంగా చెన్నైవేలూరు హైవేపై ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యాడు. దమాల్ సమీపంలో బైక్‌పై స్టంట్స్ చేస్తుండగా అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లాడు. అయితే ఆ సమయంలో అతడు హెల్మెంట్, రేస్ సూట్ వేసుకుని ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అతడి చేతికి ఫ్రాక్చర్ అయ్యింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో కేసు నమోదు చేసిన పోలీస్‌లు అతడిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 26న అతడి బెయిల్ పిటిషన్‌ను కాంచీపురం సెషన్స్ కోర్టు తిరస్కరించింది. ఈ క్రమం లోనే అతడు మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు.

వాసన్ పిటిషన్‌పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం గురువారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ … “వాసన్‌కు యూట్యూబ్‌లో 45 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. అతడు రూ.20 లక్షల ఖరీదు చేసే బైక్‌పై రూ. 3 లక్షల రేస్ సూట్ ధరించి ప్రమాదకర స్టంట్లు చేస్తున్నాడు. ఖరీదైన బైక్‌లు కొనుగోలు చేసి రేస్‌లకు రావాలని యువతను ప్రేరేపిస్తున్నాడు.

ఇది అత్యంత ప్రమాదకరం” అని న్యాయస్థానానికి తెలిపారు. ఈ వాదనతో హైకోర్టు ఏకీభవించింది. “ యువతను ప్రమాదకర ర్యాష్ డ్రైవింగ్ వైపు ప్రేరేపిస్తున్న అతడి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం. ఇది అతడికో గుణపాఠం కావాలి. ఇక ఆ యూట్యూబర్ తన ఛానల్‌ను తక్షణమే మూసివేయాలి’ అని కోర్టు ఆదేశించింది. ఆ తర్వాతే కోర్టును ఆశ్రయించాలని వాసన్‌కు సూచించింది. అయితే ప్రమాదంలో గాయపడ్డ అతడికి అవసరమైన చికిత్సను అందించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News