Wednesday, May 1, 2024

ప్రథమ సవరణ-నెహ్రూ దూకుడు

- Advertisement -
- Advertisement -

1950 ఏప్రిల్, మే నెలలో రమేష్, మల్కానీల కేసులను కలిపి సుప్రీం కోర్టు విచారించింది. మే 26 న సుప్రీం కోర్టు తీర్పు వెలువరించింది. మద్రాస్ రాష్ట్రం లో క్రాస్రోడ్స్ పత్రిక పంపిణీపై నిషేధం ఆర్గనైజర్ పత్రికకు ప్రి సెన్సార్షిప్ చెల్లవని తీర్పులో ప్రకటించింది. దేశ పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన భావప్రకటనా స్వేచ్ఛ హక్కుకు భంగకరంగా వున్నదని ప్రకటించింది. దేశ భద్రతకు, ప్రభుత్వాన్ని కూలదోయటానికి వ్యతిరేకంగా వున్నదని భావప్రకటన స్వేచ్ఛపై ఆంక్షలు విధించే చట్టం వుంటే తప్ప ఆ స్వేచ్ఛను నిరోధించజాలమని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. అధికరణం 19 క్లాజ్ 2లో పేర్కొన్న అంశాల ఆధారంగానే ఆ స్వేచ్ఛపై ఆంక్షలను విధించాలని తెలిపింది. క్లాజ్ 2లో లేని అంశాల ఆధారంగా ఆంక్షలు విధించాలంటే తగిన చట్టం వుండాలని చరిత్రాత్మకమైన ఈ తీర్పు వివరించింది. స్వేచ్ఛాయుత ప్రకటనలను, తీవ్ర విమర్శనా స్వరాలను నియంత్రించాలన్న ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీం కోర్టు తీర్పు శరాఘాతమైంది. ఈ ఓటమి నుండి పత్రికా స్వేచ్ఛపై ఆంక్షలు విధించే సవరణకు ప్రభుత్వం సంకల్పించింది.

ప్రభుత్వం తీసుకురానున్న ఈ రాజ్యాంగ సవరణ చట్టం పట్ల రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ తీవ్ర ఆందోళనతో కూడిన అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇండియన్ పీనల్ కోడ్‌లోని సెక్షన్ 124 ఎ, 153 ఎ తో సహా రాజ్యాంగ విరుద్ధం అన్న చట్టాలన్నింటినీ రాజ్యాంగానికి అనుగుణంగా రూపొందించాలని కేంద్రమంత్రి మండలిని, ప్రధాన మంత్రి నెహ్రూను ఆయన కోరారు. ప్రస్తుత పార్లమెంటు తాత్కాలిక స్వభావం కలదని రాజ్యాంగంలోని అధికారమార్పిడి నిబంధనల కింద ఈ పార్లమెంట్ పని చేస్తున్నదని ఉభయ సభలు ఏర్పడే వరకు నిగ్రహం పాటించాలని రాజేంద్రప్రసాద్ అభ్యర్థించారు. సవరణల పర్యవసానాల పరిశీలనకై పార్లమెంటు సభ్యులకు దేశానికి ప్రజానీకానికి తగిన సమయం ఇవ్వకుండా రాజ్యాంగ మార్పుకు తీసుకునే అపరిపక్వ ఆకస్మిక చర్యలు అన్నిటినీ రాజేంద్రప్రసాద్ వ్యతిరేకించారు. కానీ రాష్ట్రపతి అభ్యంతరాలను నెహ్రూ పెడచెవినపెట్టారు.
పార్లమెంటులో సవరణ బిల్లు ప్రవేశం

ప్రథమ రాజ్యాంగ సవరణ బిల్లును 1951 మే 12వ తేదీన పార్లమెంటులో ప్రధానమంత్రి నెహ్రూ ప్రవేశపెట్టారు. అధికారిక సమాచారం లేకుండా ఈ బిల్లు ప్రవేశపెట్టడం పట్ల ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. బిల్లుపై మే 15వ తేదీన ప్రధాని నెహ్రూకు స్పీకర్ మౌలంకర్ ఒక లేఖ రాశారు. ప్రతిపాదిత సవరణల పట్ల స్పీకర్ తన అభ్యంతరాలు వ్యక్తం చేశారు.కాంగ్రెస్ బయట నుండి వస్తున్న విమర్శలను గుర్తు చేస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ బిల్లు అనవసరమని సవరణలకు ఇది తగిన సమయం కాదని ఆ లేఖలో పేర్కొన్నారు.భావ ప్రకటన స్వేచ్ఛపై ఆంక్షల అవసరాన్ని రాష్ట్రపతి లాగే ఆయనా విశ్వసించలేదు. రాష్ట్రపతి అభ్యంతరాలను పక్కనపెట్టినట్లే స్పీకర్ అభ్యంతరాలను కూడా ప్రధాని పక్కన పెట్టేశారు.
16వ తేదీన బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపాలన తీర్మానాన్ని ప్రధాని నెహ్రూ ప్రవేశపెట్టారు. తాను చైర్మన్‌గా ఉండే ఈ కమిటీలో 21 మంది సభ్యులు ఉంటారని నెహ్రూ తెలిపారు. బిల్లును ఈ కమిటీ ఐదు రోజుల్లో గా పరిశీలిస్తుందని చెప్పారు.ప్రతిపక్ష సభ్యులు ప్రభుత్వం పైన, ప్రధాన మంత్రి నెహ్రూ పైన తీవ్ర విమర్శలు చేశారు.

ప్రతిపక్షాల దాడిని తట్టుకోలేకపోయిన ప్రధానమంత్రి నెహ్రూ సరైన బదులు ఇవ్వడానికి న్యాయశాఖ మంత్రి బిఆర్ అంబేడ్కర్‌ను రంగంలోకి దించారు. దాదాపు రెండున్నర గంటల పాటు ప్రసంగించిన అంబేడ్కర్ సవరణ ద్వారా పొందే అధికారాలను ప్రభుత్వం దుర్వినియోగపరచదని చెప్పారు. బిల్లును సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపడానికి ఆమోదం తెలుపవలసిందిగా సభ్యులను అభ్యర్థించారు. సభలో అన్ని ప్రక్రియలు పూర్తి చేసుకున్న బిల్లును మే 29వ తేదీన ప్రధాని నెహ్రూ పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 70 నిమిషాల తన ప్రసంగంలో ప్రతిపాదిత సవరణలను ప్రధాని గట్టిగా సమర్థించుకున్నారు. ప్రతిపక్షాల విమర్శలను త్రోసిపుచ్చుతూ ఫ్రెంచ్, అమెరికా విప్లవాల కాలాలనాటి ప్రాచీన విషయాలను లిఖిత పత్రాల్లోని అంశాలను చెప్పకండి అంటూ ప్రతిపక్ష సభ్యులను ఈసడించారు. అప్పటి నుండి చాలా విషయాలు జరిగాయని ముఖం చిట్లించారు.

జూన్ 2 తేదీన బిల్లుపై ఓటింగ్ జరిగింది. బిల్లుకు అనుకూలంగా 228 మంది వ్యతిరేకంగా 20 మంది ఓటు వేయగా దాదాపు 50 మంది గైర్హాజరయ్యారు. ఆ రోజు సభకు హాజరై ఓటు వేసిన వారిలో మూడింట రెండోంతుల మెజారిటీ రావడంతో దేశ ప్రథమ రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందినట్లు డిప్యూటీ స్పీకర్ ప్రకటించారు.ప్రధాన మంత్రి నెహ్రూతో బహిరంగ వివాదం పెట్టుకోవటానికి ఇష్టపడని రాజ్యాంగ సువ్యవస్థితను కాపాడాలన్న విషయాన్ని మదిలో వుంచుకున్న రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ 1951 జూన్ 18వ తేదీన బిల్లుకు ఆమోదం తెలిపారు. దీంతో భారత ప్రథమ రాజ్యాంగ సవరణ చట్టం ఆవిష్కృతమైంది ఇది గతానికీ వర్తిస్తుంది.

సవరణకు గురైన అధికరణలు
1951 జూన్ 18 నుండి అమలులోకి వచ్చిన ఈ సవరణ చట్టం కింద రాజ్యాంగంలోని 15, 19, 85, 87, 174, 176, 341, 342, 372, 376 అధికరణాలను సవరించారు. రాజ్యాంగంలోకి కొత్తగా 31ఎ, 31బి అనే అధికరణాలను చేర్చారు. తొమ్మిదవ షెడ్యూల్‌ను సృష్టించారు. భావప్రకటన స్వేచ్ఛను పరిరక్షించే అధికరణం 19(2) కింద క్లాజ్ ఒకటిలోని సబ్ క్లాజ్ ఎ, జి లను సవరించారు. దీని ప్రకారం ఈ సవరణల ద్వారా ప్రస్తుత చట్టాల అమలుకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ సబ్ క్లాజ్ ల ద్వారా సంక్రమించిన హక్కులను అనుభవించటంపై దేశ భద్రతా ప్రయోజనాల, విదేశాలతో స్నేహ సంబంధాల, ప్రజా భద్రత సభ్యత నైతికత, కోర్టు ధిక్కరణ- పరువు భంగం, నేరపూరిత చర్యలకు ప్రేరేపించడం ప్రాతిపదికన ప్రభుత్వం తగు కారణాలతో కూడిన ఆంక్షలు విధించడాన్ని ఇప్పటి వరకు వున్న ఏ చట్టమూ నిరోధించ లేదు. ఈ స్వేచ్ఛపై ఆంక్షలు విధించేటప్పుడు తగిన కారణాలు చూపాలనే పదాలను చేర్చడానికి పార్లమెంటు లోపల బయటే కాకుండా కాంగ్రెస్ పార్టీ నుండి కూడా తీవ్రమైన ఒత్తిళ్లు రావడంతో నెహ్రూ అందుకు తలొగ్గారు. కొత్తగా చేర్చిన అధికరణం 31 బి ద్వారా 9వ షెడ్యూలును సృష్టించారు. అధికరణం 31ఎ ద్వారా రక్షణ పొందిన చట్టాలను ఇతర చట్టాలను ఈ షెడ్యూలులో పెట్టి వాటిని న్యాయ సమీక్ష నుండి మినహాయించారు. 2013 సంవత్సరం నాటికి ఈ షెడ్యూల్‌లో 284 చట్టాలను పెట్టారు. ఇవే చాలా ముఖ్యమైన సవరణలు. ఇవన్నీ గతానికీ వర్తిస్తాయి.ఇవి జరిగిన వెంటనే పార్లమెంటు ది ప్రెస్ (అభ్యంతరకర విషయాల) చట్టం ఆమోదించింది.

సవరణల దుష్పరిణామాలు
గణతంత్ర భారత రాజ్యాంగం అమలులోకొచ్చి 16 నెలలు పూర్తికాక ముందే జరిగిన ఈ సవరణ రాజ్యాంగం పై దాడి లాంటిది. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రాతినిధ్యం వహించే ఉభయ సభలతో కూడిన నిజమైన సరికొత్త భారత పార్లమెంటు ఏర్పడక ముందే ఈ సవరణ జరిగింది.రాజకీయ పార్టీల ప్రతిపక్ష నాయకుల, న్యాయవాదుల, మేధావుల పత్రికల సకల వర్గాల అభ్యంతరాలను వ్యతిరేకతను ప్రధాని నెహ్రూ ఏమాత్రం లెక్క చేయలేదు. రాజ్యాంగ సవరణకు ఉభయ సభల ఆమోద ముద్ర ఉండాలని అధికరణం 368 చెబుతున్నా నెహ్రూ లక్ష్య పెట్టలేదు.

రాజ్యాంగంలోని అధికార మార్పు నిబంధనలతో నడుస్తున్న తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన మంత్రి నెహ్రూ తెగబడి చేసిన ఈ సవరణ కొన్ని సంక్షేమ కార్యక్రమాల అమలుకు రాజ్యాంగ రక్షణ కల్పించింది. భూసంస్కరణలకు భద్రత చేకూర్చింది. అలాగే నేటి వరకు పలు అప్రజాస్వామిక ధోరణులకు సవరణలకు పూర్వప్రమాణంగా, పూర్వోదాహరణగా నిలిచి అనేక ప్రజాస్వామిక చట్టాల, సెక్షన్‌ల జన్మకు కారణమైంది. రాజ్యాంగంలో లేని రాజ ద్రోహం నేరాన్ని స్థాపితం చేసింది. న్యాయ వ్యవస్థ చేతులు కట్టివేసి నోరు మూయించింది. న్యాయ స్థానాల తీర్పులను తిరగగొట్టింది. ఐపిసి సెక్షన్లు 153 ఎ 295 ఎ లను ప్రధాని నెహ్రూ పరిమితంగానే ఉపయోగించి ఉండవచ్చు గాక కానీ వాటిని చెక్కుచెదరనీయకుండా దుడ్డుకర్రగా తన వారసులకు అందించారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలో నేరపూరిత నిబంధనలకు, జాతీయ భద్రతా చట్టం, ఆంతరంగిక భద్రత నిర్వహణ చట్టం, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా చట్టం) లాంటి నిరంకుశ చట్టాలు నిలబడటానికి రాజ్యాంగపరమైన పునాదిని ప్రథమ సవరణ నిర్మించింది.

కెఎస్‌ఎన్ ప్రసాద్
9492522089

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News