Wednesday, May 1, 2024

దళితబంధు సామాజిక పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

Funds release to Dalitbandhu scheme soon:CM KCR

ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో ముందుగా అమలు చేస్తాం

నిధులను త్వరలో విడుదల చేస్తాం

తాము ఎప్పుడూ మోసగించబడుతామన్న దుఃఖం దళిత వాడల్లో ఉంది. వారి బాధను అర్థం చేసుకొని పని చేయాలి. మీకు ఆకాశమే హద్దు, మీరు ఇప్పటివరకు చేసిన ఏ పనిలో లేని తృప్తి ‘దళితబంధు పథకం’ అమల్లో పాల్గొనడంలో దొరుకుతుంది. దళిత కుటుంబాల ఆర్థికస్థితిని మెరుగుపరిచేందుకు గల అన్ని అవకాశాలను వ్యాపార ఉపాధి మార్గాలను శోధించాలి. దళిత మేధావుల సలహాలు, సూచనలు తీసుకోవాలి.
ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, సిఎస్ సహా పలు శాఖల అధికారులతో భేటీలో ముఖ్యమంత్రి కెసిఆర్

మనతెలంగాణ/హైదరాబాద్ : తరతరలాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజం ఆత్మగౌరవంతో తలెత్తుకునేలా, ఆర్థికంగా అభివృద్ధి చేయడమే ‘దళితబంధు’ పథకం లక్ష్యమని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిఎస్‌తో పాటు పలు శాఖల అధికారులతో సిఎం కెసిఆర్ ప్రగతిభవన్‌లో శనివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి విస్తృతస్థాయి సమావేశం 6 గంటల పాటు నిర్వహించారు. ఈ సమావేశంలో దళితబంధుతో పాటు వ్యవసాయం, ధాన్యం సేకరణ, పథకాల అమలు, కోవిడ్ పరిస్థితి, వ్యాక్సినేషన్, పోడు భూముల సమస్యపై విస్తృతంగా చర్చించారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతుల్లో అవగాహన కల్పించడం, యాసంగి పంటల సాగు, జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సిఎం కెసిఆర్ కలెక్టర్‌లకు దిశానిర్ధేశం చేశారు.

కార్యాచరణ ఖరారు చేసి కలెక్టర్లకు మార్గనిర్ధేశం చేస్తారు. పల్లెప్రగతి, పట్టణప్రగతి, హరితహారం, మెడికల్ కాలేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లు, ధరణి సమస్యల వంటి అంశాల గురించి అధికారులు, మంత్రులను సిఎం కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు. దీంతోపాటు దళితబంధు పథకం అమలుపై అధికారులు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇచ్చే అంశంపై కూడా సిఎం కెసిఆర్ అధికారులు, మంత్రులతో చర్చించినట్టుగా తెలిసింది. దీంతోపాటు ఢిల్లీకి వెళ్లే మంత్రులు చేపట్టాల్సిన అంశాల గురించి సిఎం వారితో చర్చించారు.

ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ పథకం ద్వారా వందశాతం సబ్సిడీ కింద అందించే రూ.10లక్షలు దళిత కుటుంబాలను ఆర్థికంగా పరిపుష్టి చేయడమే కాకుండా సామాజిక పెట్టుబడిగా మారి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత వేగవంతంగా పటిష్టం చేయడంలో దోహదపడు తుందని వారితో సిఎం స్పష్టం చేశారు. దళితబంధును ఇప్పటికే ప్రకటించిన పద్ధతిలోనే ప్రభుత్వం అమలు చేస్తుందని, అందుకు సంబంధించిన నిధులను త్వరలోనే విడుదల చేస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు ఇప్పటికే ప్రకటించిన నాలుగు మండలాల పరిధిలో దళితబంధును ముందుగా ప్రకటించిన విధంగా అమలు చేస్తామని సిఎం వారికి వివరించారు.

దళితుల బాధను అర్థం చేసుకోవాలి

తాము ఎప్పుడూ మోసగించబడుతామన్న దుఃఖం దళిత వాడల్లో ఉందని, వారి బాధను అర్థం చేసుకొని పని చేయాల్సిన అవసరం ఉందని అధికారులకు ఆయన సూచించారు. మీకు ఆకాశమే హద్దు, మీరు ఇప్పటివరకు చేసిన ఏ పనిలో లేని తృప్తి ‘దళితబంధు పథకం’ అమల్లో పాల్గొనడంలో దొరుకుతుందని కలెక్టర్లకు సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. దళిత కుటుంబాల ఆర్థికస్థితిని మెరుగుపరిచేందుకు ఉన్న అన్ని అవకాశాలను వ్యాపార ఉపాధి మార్గాలను శోధించాలని, అందుకు దళిత మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, తదితర దళిత సామాజిక అభివృద్ధికి ఉపయోగపడే వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని సిఎం కెసిఆర్ కలెక్టర్లకు సూచించారు.

నాలుగైదు రోజుల్లో పూర్తి చేయాలి

కొత్త జోనల్ విధానం ప్రకారమే ఉద్యోగుల విభజన చేపట్టాలని సిఎం కెసిఆర్ కలెక్టర్లను ఆదేశించారు. స్థానిక యువతకు ఉద్యోగుల కల్పనతో పాటు క్షేత్ర స్థాయిలోకి ప్రభుత్వ పాలన, నూతన జోనల్ వ్యవస్థతో అమల్లోకి వస్తుందని సిఎం కెసిఆర్ తెలిపారు. వెనుకబడిన మారుమూల ప్రాంతాల్లోకి కూడా ప్రభుత్వ ఉద్యోగులు వెళ్లి పనిచేయగలిగితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమని సిఎం పేర్కొన్నాన్నారు. నాలుగైదు రోజుల్లో ఉద్యోగుల విభజన ప్రక్రియను పూర్తి చేసి నివేదికను అందజేయాలని కలెక్టర్‌లను సిఎం ఆదేశించారు. భార్యా,భర్తలిద్దరూ ఉద్యోగులు అయితే (స్పౌస్ కేస్) ఒకే చోట విధులు నిర్వర్తిస్తేనే వారు ప్రశాంతంగా పనిచేయగలుగుతారని సిఎం కలెక్టర్‌లతో పేర్కొన్నారు. స్థానిక యువత ఉద్యోగాలకు విఘాతం కలగకుండా మానవీయ కోణంలో స్పౌస్ కేసులను పరిష్కరించాలని సిఎం సూచించారు.

రైతుల్లో అవగాహన పెంచే బాధ్యత అధికారులు తీసుకోవాలి

రైతులను లాభసాటి పంటలవైపు మళ్లీంచే బాధ్యత అధికారులదేనని సిఎం కెసిఆర్ తెలిపారు. రైతుల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. వచ్చే వానాకాలం పంటలపై ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని సిఎం వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. యాసంగిలో కేంద్రం వడ్లు కొనడం లేదని, ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని సిఎం స్పష్టం చేశారు. ఈ విషయాన్ని రైతులకు అర్థమయ్యేలా చెప్పాలని అధికారులకు ఆయన సూచించారు. వానాకాలంలో ప్రధానంగా పత్తి, వరి, కంది సాగుపై రైతులు దృష్టిపెట్టేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సిఎం ఆదేశించారు.

28వ తేదీ నుంచి రైతుబంధు

రైతుబంధును డిసెంబర్ 28వ తేదీ నుంచి అర్హులైన రైతుల లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నట్టు సిఎం కెసిఆర్ తెలిపారు. ప్రారంభించిన వారం, పదిరోజుల్లో వరుసక్రమంలో అందరి ఖాతాల్లో నిధులు జమ అవుతాయని ఆయన తెలిపారు.

భారత చరిత్రలో ఏ రాష్ట్రం అమలు చేయలేదు

కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర విధనాలనుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడేందుకు క్షేత్ర స్థాయిలోకి వెళ్లి, ధాన్యం కొనబోమనే విషయాన్ని అర్థం చేయించాలని సిఎం కెసిఆర్ కలెక్టర్లను, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టంచేసే దిశగా రాష్ట్రం అమలు చేస్తున్న దార్శనిక వ్యవసాయ విధానాలు స్వతంత్ర భారత చరిత్రలో ఏ రాష్ట్రం అమలు చేయలేదని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

ఒమ్రికాన్ వ్యాప్తిపై జాగ్రత్త

రాష్ట్రంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్ పురోగతిపై కలెక్టర్‌లు, వైద్యారోగ్య అధికారులను సిఎం కెసిఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒమ్రికాన్ వ్యాప్తి వార్తల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సిఎం సమీక్ష జరిపారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని వైద్యాధికారులు సిఎంతో పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు దీనిపై వైద్య అధికారులు అప్రమత్తంగా ఉండాలని సిఎం సూచించారు.

రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని దెబ్బతీసేలా కేంద్రం అనుసరిస్తున్న ప్రమాదకర రైతు వ్యతిరేక విధానాల నుంచి రాష్ట్ర రైతాంగాన్ని కాపాడుకునే బాధ్యత కలెక్టర్లకు, అధికారులకు ఉందని స్పష్టం చేశారు. ఆహార భధ్రత కల్పించడం కోసం రాజ్యాంగబద్దంగా ఏర్పాటైన ఎఫ్‌సిఐ, ఉప్పుడు బియ్యం పేరుతో తెలంగాణ యాసంగి వరి ధాన్యం కొనుగోలును నిలిపివేయడం శోచనీయమన్నారు. భారత ఆహార సంస్థ నిర్లక్ష్యం కారణంగా బియ్యం గోదాముల్లో మగ్గిపోతున్న బియ్యం నిల్వలు పేరుకుపోతున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సిఎం సూచించారు. దీనికి సంబంధించి కేంద్రానికి లేఖలు రాయాలని అధికారులను సిఎం ఆదేశించారు.

ఈ ఉన్నతస్థాయి సమావేశంలో…

ఈ ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, కె.తారక రామారావు, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, గంగుల కమలాకర్, సిహెచ్.మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి.శ్రీనివాస్ గౌడ్, సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. వీరితో పాటు మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, ఎంపి బిబిపాటిల్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, హరిప్రియా నాయక్, రేఖా నాయక్, షిండే, కోరుకంటి చందర్, బాల్క సుమన్, జాజుల సురేందర్, సుంకె రవిశంకర్‌లున్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సిఎంఓ అధికారులు నర్సింగ్ రావు, స్మితా సభర్వాల్, రాహుల్ బొజ్జా, భూపాల్ రెడ్డి, ప్రియాంక వర్గీస్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎస్సీ కార్పొరేషన్ ఎం.డి. అశోక్ కుమార్, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజి శేషాద్రి, సివిల్ సప్లయి కమిషనర్ అనిల్ కుమార్, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, ఎస్సీ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గంగాధర్, శ్రీనివాసరావు, రమేశ్ రెడ్డి, అన్ని జిల్లాల కలెక్టర్లు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News