Monday, April 29, 2024

గడ్కరీ వ్యాఖ్యలు!

- Advertisement -
- Advertisement -

సంపాదకీయం: కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోడం ఒక పెద్ద సమస్యగా మారిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్య బిజెపి పెద్దలకు, ముఖ్యంగా ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా లకు గట్టిగానే తగిలి వుంటుంది. ప్రజల్లో చీలికలు తెచ్చి మత వైషమ్యాల మందుపాతరలు నెలకొల్పడంలో, ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడంలోనే సమయమంతా వృథా చేస్తున్న వీరిద్దరు, పరిపాలన పరమైన నిర్ణయాలు సకాలంలో ఎలా తీసుకోగలుగుతారు? అందుకే గడ్కరీ వ్యాఖ్యలు వారిని తీవ్ర అసౌకర్యానికి గురిచేసి ఉండాలి.

నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ పెద్దల అనుమతితోనే గడ్కరీని బిజెపి కీలక సంస్థలైన పార్లమెంటరీ బోర్డు నుంచి, సెంట్రల్ ఎలెక్షన్ కమిటీ నుంచి తొలగించారని, వారు ఆయన సంచలన ప్రకటనలతో విసుగెత్తిపోయారనే ప్రచారం తాజాగా ఊపందుకొన్నది. గడ్కరీ మొన్న ముంబయిలో సివిల్ ఇంజినీర్ల జాతీయ సదస్సులో మాట్లాడుతూ సమయం చాలా విలువైనదని, అదే అతిపెద్ద పెట్టుబడి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోడం అతి పెద్ద సమస్యగా తయారైందన్నారు. ఈ సందర్భంగా ఆయన మరికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సమాజం మేలు కోసమా, అధికారంలో కొనసాగడం కోసమా దేని కోసం రాజకీయాలు అని సూటిగా ప్రశ్నించారు.

గత నెల నాగపూర్‌లో ఒక సందర్భంలో మాట్లాడుతూ పార్టీలకు విరాళాలు గుప్పించడానికి పోటీ పడుతున్నారని, తాను పార్టీ అధ్యక్షుడిని కాను కాబట్టి ఆ వ్యవహారాలతో తనకు సంబంధముండే అవకాశం లేదని అన్నారు. గడ్కరీ కూడా గతంలో బిజెపి అధ్యక్షుడుగా చేశారు. అయితే అప్పుడు అది అధికారంలో లేదు. ఆర్‌ఎస్‌ఎస్ కేంద్రమైన నాగపూర్ నుంచి వచ్చిన నేతగా గడ్కరీకి ఆ సంస్థ పెద్దలతో చిరకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. అందుచేతనో ఏమో ఆయన ముక్కుసూటిగా మాట్లాడుతాడు. ఎవరికీ భయపడడు. గడ్కరీ బిజెపి తరపున ప్రధాని పదవికి ప్రత్యామ్నాయ అభ్యర్థి అనే ప్రచారం కూడా గతంలో జరిగింది. ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా తుడిచిపెట్టి కాంగ్రెస్ ముక్త్ భారత్‌ను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఆ పార్టీ బాగా పుంజుకొని బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించాలని గడ్కరీ అభిప్రాయపడ్డారు. బిజెపి ఈ స్థాయికి ఎదగడానికి వాజపేయి, అద్వానీ, దీన్‌దయాల్ ఉపాధ్యాయలే కారణమని ప్రకటించడం ద్వారా మోడీ, అమిత్ షాలదేమీ లేదని పరోక్షంగా గడ్కరీ తేల్చి చెప్పారు.

తమను ఖాతరు చేయకపోగా వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడని భావించిన మోడీ, అమిత్ షాలు ఆయనను కత్తిరించాలని భావించారు. పార్టీ అత్యున్నత స్థాయి నిర్ణాయక వ్యవస్థలు రెండింటి నుంచీ తొలగించారు. ఇది జరిగిన తర్వాతనే కేంద్రంలో నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని గడ్కరీ విమర్శించారు. తాను యే ప్రభుత్వంలో సీనియర్ మంత్రిగా ఉన్నారో దానినే విమర్శించే సాహసం చేశారు. ఒకవైపు గడ్కరీని కత్తిరించి వేస్తూనే నాగపూర్‌కే చెందిన మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను బాగా పైకి లేపారు. ఆయనను పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సభ్యుని చేశారు. అంటే పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కూడా అయినట్టే.

పార్టీలో కీలక నిర్ణయాలు ఈ రెండూ కలిసే తీసుకొంటాయి. మొన్న ఉద్ధవ్ థాకరే ప్రభుత్వాన్ని ఫిరాయింపుల డైనమైట్ పేల్చి కూల్చివేసినప్పుడు తిరిగి ముఖ్యమంత్రి అవుతాడనుకొన్న ఫడ్నవీస్‌కు ఆ పదవి దక్కలేదు. వ్యూహాత్మకంగా ఆయన్ను ఉపముఖ్యమంత్రిని చేశారు. ఆ నష్ట నివారణ చర్యగా ఫడ్నవీస్‌కు పార్టీలో ప్రాధాన్య స్థానం ఇచ్చారు. కాని అది గడ్కరీని తగ్గించడం ద్వారా చేయడం గమనించవలసిన విషయం. ప్రధాని మోడీ ప్రభుత్వం దేశ క్షేమాన్ని, అభివృద్ధిని బొత్తిగా పట్టించుకోడం లేదనే ధ్వని గడ్కరీ వ్యాఖ్యల్లో ప్రతిధ్వనించింది. రూ. రెండు లక్షల కోట్ల భారీ ఖర్చుతో 26 హరిత ఎక్స్‌ప్రెస్ హైవేలు, లాజిస్టిక్ పార్కుల నిర్మాణాన్ని చేపట్టామని, కాంట్రాక్టర్లు ఒక రోజు ముందుగా నిర్మాణం పూర్తి చేయగలిగితే లక్ష రూపాయలు ఆదా చేయగలుగుతారని, ఒక రోజు ఆలస్యమైతే లక్షన్నర రూపాయలు జేబులోంచి పెట్టుకోవలసి వస్తుందని గడ్కరీ అన్నమాటలో అభ్యంతరకరం ఏమీ లేదు.

అలాగే రాజకీయాలు అధికారంలో కొనసాగడానికి కాదని, ప్రజల కోసం, దేశం కోసమేనని గుర్తు చేయడంలో కూడా ఆక్షేపించదగినదేమీ లేదు. కాని వున్న మాట అంటే అధికారంలో వున్నవారికి రుచించదు కదా! తన ప్రకటనల పట్ల ఆర్‌ఎస్‌ఎస్ పెద్దలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఒక ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్త పట్ల గడ్కరీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ ప్రచారం చేస్తున్నవారిపై కోర్టుకు వెళ్తానని గురువారం నాడు ట్విటర్‌లో తీవ్ర హెచ్చరిక చేశారు. దీనిని బట్టి బిజెపిలో ముదురుతున్న అసమ్మతి స్పష్టపడుతున్నది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News