Monday, April 29, 2024

డీజిల్ వాహనాలపై 10% పన్ను ప్రతిపాదన లేదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : కాలుష్యాన్ని తగ్గించేందుకు డీజిటల్ వాహనాలపై అదనంగా 10 శాతం పన్ను విధించే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖమంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. డీజిల్ వాహనాలపై ప్రభుత్వం 10 శాతం పన్ను విధించనున్నట్టు మీడియాలో వార్తలు రావడంతో ఆయన ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చారు. కాలుష్యం స్థాయి పెరగడం ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని, పన్ను పెంచడం వల్ల డీజిల్ వాహన విక్రయాలను అడ్డుకోవచ్చంటూ ఆటోమొబైల్ తయారీ సంస్థ సియామ్ వార్షిక సదస్సులో గడ్కరీ పేర్కొన్నారు.

డీజిల్ ఇంజిన్, వాహనాలపై అదనంగా 10 శాతం జిఎస్‌టి విధించాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను విజ్ఞప్తి చేస్తాను, డీజిల్ వాహనాలను అడ్డుకునేందుకు ఇదొక్కటే మార్గమని అన్నారు. కానీ డీజిల్ వాహనాలపై 10 శాతం అదనపు పన్ను విధించే ప్రతిపాదన ప్రస్తుతం ప్రభుత్వం వద్ద లేదంటూ కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఎక్స్ పోస్ట్‌లో తెలిపారు. హరిత ఇంధనం వైపు వెళ్లాలని, డీజిల్ వాహనాల ఉత్పత్తిని తగ్గించాలని ఆటో పరిశ్రమను గడ్కరీ కోరారు.

అలా చేయడంలో విఫలమైతే ప్రభుత్వం అదనపు పన్నులు విధిస్తుందని హెచ్చరించారు. 2070 నాటికి కార్బన్ నెట్ జీరోను సాధించాలి, డీజిల్ వంటి ప్రమాదకర ఇంధనాల వల్ల కలిగే వాయు కాలుష్య స్థాయిలను తగ్గించాలి. అలాగే ఆటోమొబైల్ అమ్మకాలలో వేగంగా వృద్ధి వంటి నిర్ణయాలకు అనుగుణంగా క్లీన్ అండ్ గ్రీన్‌ను పాటించడం చాలా ముఖ్యమన్నారు. ఈ ఇంధనాలు దిగుమతి ప్రత్యామ్నాయాలుగా ఉండాలి, అలాగే తక్కువ ఖర్చుతో కూడుకున్నవి, దేశీయమైనవి, కాలుష్య రహితంగా ఉండాలని ఆయన సూచించారు.

డీజిల్ వాహనాల అమ్మకాలపై ప్రభావం
డీజిల్ వాహనాలపై 10 శాతం అదనపు పరోక్ష పన్ను విధిస్తే కార్ల తయారీ కంపెనీలు వాహనాల ధరలను పెంచాల్సి ఉంటుంది. ఇది ఆ కంపెనీల అమ్మకాలపై కూడా ప్రభావం చూపుతుంది. దేశంలో దాదాపు అన్ని వాణిజ్య వాహనాలు డీజిల్ ఇంజన్లతోనే నడుస్తున్నాయి. మారుతీ సుజుకీ, హోండాతో పాటు పలు కార్ల తయారీ సంస్థలు ఇప్పటికే డీజిల్ కార్లను నిలిపివేశాయి. కాలుష్యం తగ్గించేందుకు ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలను తయారు చేయాలని మంత్రి అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు బయోఫ్యూయెల్, ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్‌లపై దృష్టిపెట్టాలని సూచించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News