Monday, May 6, 2024

అప్పటి కాంగ్రెస్ ఎప్పుడో పోయింది

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దశాబ్దాల అనుబంధం ఉన్న కాంగ్రెస్ పట్ల తనకు ఎటువంటి దురభిప్రాయం లేదని అయితే పార్టీలోని ఇప్పటి గాంధీలు, ప్రస్తుత నాయకత్వ ధోరణి సరిగ్గా లేదని గులాం నబీ ఆజాద్ విమర్శించారు. కాంగ్రెస్‌ను వీడి ఆయన ప్రొగ్రెసివ్ ఆజాద్ పార్టీ (పిఎపి)ని ఏర్పాటు చేశారు. బుధవారం ఆయన వివిధ వార్తాసంస్థలకు ఇంటర్వూ ఇచ్చారు. పార్టీలో తన సేవలు, ఇంతకు ముందటి నేతలతో అనుబంధం , తరువాతి క్రమంలో దిగజారిన సంబంధాల విషయాన్ని ప్రస్తావించారు. తన స్వరాష్ట్రం జమ్మూ కశ్మీర్‌కు సంబంధించి తన వైఖరిని కూడా తెలియచేసుకున్నారు. కాంగ్రెస్ అధినేత్రిగా చిరకాలం పనిచేసిన సోనియా గాంధీపై ఆయన పలు విమర్శలకు దిగారు. ఇందిరా గాంధీ పార్టీ పగ్గాలు చేపట్టినప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి చాలా తేడా ఉందన్నారు. పార్టీలో పనితీరు, నిర్వహణలో కొట్టొచ్చే మార్పులు చోటుచేసుకున్నాయని అన్నారు.

ఇప్పుడు పార్టీలో ఎంపికల సంస్కృతి నెలకొందన్నారు. ఇది అంతర్గత పెత్తనానికి దారితీసిందని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ నియంతగా వ్యవహరించారనే అభిప్రాయంతో తాను ఏకీభవించడం లేదని, ఆమె పూర్తిస్థాయిలో ప్రజాస్వామిక పద్ధతిలో వ్యవహరించడాన్ని తాను గమనించినట్లు పేర్కొన్నారు. తాను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆమెతో ఎక్కువగా కలిసిపనిచేసే అవకాశం వచ్చిందన్నారు. ఆ తరువాత పార్టీ నాయకత్వ ధోరణి మారిందని, బాహ్య ప్రపంచానికి చెప్పేది ఒక్కటి, వారు వ్యవహరించే తీరు మరొక్కటిగా ఉందని, సోనియా దీర్ఘకాలిక నాయకత్వ దశలో ఇటువంటి ధోరణి మరింత ప్రబలిందని విమర్శించారు. రాహుల్ గాంధీ ఓ నాయకుడే కాడని తెలిపారు. ఆయన నాయకత్వ లేమితోనే పార్టీ దెబ్బతిందని తెలిపారు. తాను ఎప్పుడూ ప్రధాని మోడీ విందులకు హాజరుకాలేదని కానీ ప్రధాని మోడీ తనపట్ల ఎంతో ఆదరణ కనబర్చారని, ఇది ఓ విధంగా పార్టీ తనకుఇచ్చిన గౌరవం కంటే ఎక్కువే అన్నారు. తనరాజకీయ అనుభవాన్ని తెలియచేసే పుస్తకాన్ని రాసిన ఆజాద్ ఈ పుస్తకావిష్కరణ నేపథ్యంలో వార్తాసంస్థలకు ఇంటర్వూలు ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News