Monday, April 29, 2024

సింగరేణి కార్మికులకు తీపి కబురు

- Advertisement -
- Advertisement -

నెలలోపు వేజ్‌బోర్డు బకాయిల చెల్లింపునకు సంసిద్ధం
వేజ్‌బోర్డు ఎరియర్స్ రూ.1726 కోట్లు చెల్లింపునకు భారీ కసరత్తు
సిఎండి శ్రీధర్ ఆదేశంపై ముమ్మర ఏర్పాట్లు
ఒక్కో కార్మికుడికి సగటున రూ.4 లక్షల వరకు ఎరియర్స్
అన్ని విభాగాలను సన్నద్ధం చేసిన డైరెక్టర్(పర్సనల్, ఫైనాన్స్) ఎన్.బలరామ్

మన తెలంగాణ / హైదరాబాద్ : సింగరేణి కార్మికులకు చెల్లించాల్సి ఉన్న 23 నెలల 11వ వేజ్‌బోర్డు బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించాలని సంస్థ సిఎండి ఎన్.శ్రీధర్ ఆదేశించిన నేపథ్యంలో డైరెక్టర్(ఫైనాన్స్, పర్సనల్) ఎన్.బలరామ్ సారథ్యంలో ముమ్మర ఏర్పాట్లను చేపట్టారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.1726 కోట్ల ను బకాయిలుగా చెల్లించనున్నామని, సగటున కార్మికుడు సుమారుగా రూ.4 లక్షల వరకు ఎరియర్స్ అందుకుంటాడని ఎన్.బలరామ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. సింగరేణి చరిత్రలో తొలిసారిగా పెద్దమొత్తంలో వేతన బకాయిలను చెల్లిస్తున్న నేపథ్యంలో ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా ఉండేందుకు వీలుగా నెల రోజుల వ్యవధిలో రెండు విడతలుగా బకాయిలను కార్మికుల ఖాతాల్లో జమ చేయనున్నామని తెలిపారు. వేతన బకాయిల లెక్కింపు ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించడానికి పర్సనల్ విభాగం, అకౌంట్స్, ఆడిటింగ్, ఈఆర్పీ, ఎస్‌ఏపీ, ఐటీ తదితర అన్ని విభాగాల సమన్వయంతో శుక్రవారం నుంచి ప్రక్రియ ప్రారంభించామన్నారు.

ముందుగా ఉద్యోగుల వేతన ఎరియర్స్ ఆడిటింగ్ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని, అనంతరం ప్రోగ్రామ్ రూపకల్పన, ఎస్‌ఏపీ టెస్ట్ రన్లను కూడా తక్కువ సమయంలో పూర్తి చేసి చెల్లింపులకు మార్గం సుగమం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఏ దశలోనూ జాప్యం జరగరాదని స్పష్టం చేశారు. నెలరోజులలోపు చెల్లించాలని ప్రాథమికంగా అనుకుంటున్నప్పటికీ అంతకన్నా ముందే చెల్లించడం కోసం కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. 11వ వేజ్ బోర్డు ను వేతనాలను అందరికన్నా ముందే సింగరేణి లో అమలు జరిపామని, ఈ మేరకు కంపెనీకి ఏడాదికి సుమారు రూ.1200 కోట్ల అదనపు వ్యయం అవుతోందని, దీనితోపాటు ప్రస్తుతం చెల్లించే ఎరియర్స్ రూ.1726 కోట్లతో కలిపి మొత్తం దాదాపు 3 వేల కోట్ల చెల్లింపులను చేయనుందని పేర్కొన్నారు. ఈ బకాయిలను ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న కార్మికులకు చెల్లిస్తున్నామని, పదవీ విరమణ చేసిన కార్మికులకు త్వరలో చెల్లిస్తామన్నారు.ఈ సమావేశంలో జీఎం(పర్సనల్) ఐఆర్ అండ్ పీఎం బి.హనుమంతరావు, జీఎం(ఎఫ్ అండ్ ఏ) సుబ్బారావు, జీఎం(ఇంటర్నల్ ఆడిట్) రమణ, పీఎం(ఈఆర్పీ) హర ప్రసాద్ , డీజీఎం(ఎస్‌ఏపీ) వెంకటేశ్వరరావు , మేనేజర్ (ఐటీ) వేణుగోపాల్ , డీజీఎం(పర్సనల్) అజయ్ కుమార్, పర్సనల్ మేనేజర్ వరప్రసాద్ డిప్యూటీ పీఎం ప్రవీణ్, సీనియర్ పీవో సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News