Saturday, April 27, 2024

2 వేల నోట్ల రద్దు కేంద్రం అనాలోచిత చర్యకు నిదర్శనం: గుత్తా

- Advertisement -
- Advertisement -

చౌటుప్పల్ : రెండు వేల నోట్ల రద్దు నిర్ణయం కేంద్ర ప్రభుత్వ అనాలోచిత చర్యకు నిదర్శనమని రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం చౌటుప్పల్‌లో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకర్లతో మాట్లాడారు. గతంలో రూ.500,1000 నోట్లను రద్దుచేసి నూతనంగా 2000 నోట్లను తీసుకు రావడం జరిగిందన్నారు. మళ్లీ కొద్ది కాలానికే తిరిగి దానిని కూడా రద్దు చేయడం వెనుక దాగివున్న మర్మం ఏమిటో వారికే తెలియాలన్నారు. తరచూ నోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ కేంద్రంలో తుగ్లక్ పాలన సాగిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇకనైనా ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధానాలకు కేంద్రం స్వస్తి చెప్పి సక్రమంగా పాలన సాగించేలా నిర్ణయాలు తీసుకోవాలని గుత్తా సుఖేందర్‌రెడ్డి సూచించారు.

పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి రెడీ: గుత్తా అమిత్‌రెడ్డి
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్ పార్టీ, సిఎం కెసిఆర్ ఆదేశం మేరకు మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఆశీస్సులతో తాను ఎక్కడి నుంచైనా పోటీకి సిద్దమని గుత్తా సుఖేందర్‌రెడ్డి తనయుడు గుత్తా అమిత్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా ఆదివారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. నల్గొండ లేదా మునుగోడు నియోజకవర్గాల్లో ఎక్కడి నుంచి పోటీకి దిగాలనేది మరో మూడు నెలల్లో తేలనుందని పేర్కొన్నారు.

ఎక్కడ టికెట్ ఇచ్చినా గెలిచి తాను ప్రజాసేవ చేసేందుకు సిద్ధంగా వున్నానని అమిత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, స్థానిక మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, బిఆర్‌ఎస్ మున్సిపల్ శాఖ అధ్యక్షుడు ముత్యాల ప్రభాకర్‌రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, ఇతర నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News