Sunday, April 28, 2024

బుద్ధిజంతోనే సమానత్వం..

- Advertisement -
- Advertisement -

Buddha Purnima 2020

నేడు కరోనా వైరస్ ప్రపంచాన్ని పట్టి పీడిస్తుంది. బుద్ధుని కాలంలో కూడా అంటురోగాలు ప్రబలాయి. జంతువులను వేటాడటం ఎక్కువయ్యింది, అందుకే బుద్ధుడు శాకాహార ఉద్యమాన్ని ప్రారంభించారని అంటారు. తిన్న ఆహారం మనిషిని కలుషితం చేయదని ఆయన అంటారు. కానీ నేడు ప్రజల ఆహారపు అలవాట్లపై ఆంక్షలు పెరిగాయి. హత్య, దొంగతనం, వ్యభిచరించడం, చెడు ఆలోచనలు మాత్రమే మనిషిని కలుషితం చేస్తాయని బుద్ధుడు వివరించారు. ప్రేమతోనే కోపాన్ని జయించవచ్చని ఆయన అంటారు. చేసే పనిని బట్టే ఫలితం ఉంటుందని, ఆత్మలుండవని ఆయన ప్రవచించారు. ఆధునిక ప్రపంచంలో మానవుడు సౌకర్యవంతంగా జీవించడానికి అన్ని రకాల హంగులున్నప్పటికీ అతనికేదో వెలితి కన్పిస్తుంది. మరేదో తెలియని భయం మనిషిని వెంటాడుతుంది.  ఈ భయాన్ని అధిగమించడానికి కొందరు భక్తి మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మరికొందరిలో ఈ భక్తి మూఢ భక్తిగా మారుతుంది. యాంత్రీకరణ, జీవితంలో పెరిగిన వేగం వలన మనిషి ఎలా జీవించాలోనని తర్జనభర్జన పడుతున్నారు. ఒకవైపు ఆధునికతని అనుకరిస్తూనే, మరోవైపు ప్రాచీన సాంప్రదాయాలని వదులుకోలేక ఘర్షణకు గురవుతున్నాడు. ఈ ఘర్షణ వల్ల మనశ్శాంతిని కోల్పోతున్నాడు. తాను పరిశోధించి అభివృద్ధి చేసుకొన్న సాంకేతిక పరిజ్ఞానానికి తానే బందీ అవుతున్నాడు. ఆధునికత, ఆధ్యాత్మికతలని మేళవింపు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ప్రపంచీకరణ పేదవారికి ఒక ప్రపంచాన్ని, ధనికులకు మరొక ప్రపంచాన్ని సృష్టించింది.

ఆధునిక కాలంలో మనమెదుర్కొనే ప్రతి సమస్యకి బుద్ధుడు పలు శాస్త్రీయమైన పరిష్కార మార్గాలు సూచించారు. ఆయన క్రీ .పూ. ఆరవ శతాబ్దంలో జన్మించారు. ఈ శతాబ్దం మేధోపరంగా చాలా ఫలప్రదమైందిగా కన్పిస్తున్నది. ఈ శతాబ్దంలోనే కన్ఫూషియస్, లౌడ్డు, జరాతూష్ట్ర, పైథాగరస్, జెర్మియా, 2వ ఈజయ్య వంటి మహామహులు జన్మించారు. బుద్ధుని కాలంలో వర్ణ వ్యవస్థ రాజ్యం ఏలుతోంది. చిన్నచిన్న రాజులు రాజ్యాలని పరిపాలించేవారు. అనేక భాషలు, అనేక మాండలికాలుండేవి. అగ్రవర్ణాలు అధోవర్గాలని దోపిడీ చేసి పీక్కుతినేవి. ఈ పరిస్థితి బుద్ధుణ్ణి కలవరపెట్టింది. అందుకే చరిత్రలో వర్ణ వ్యవస్థకు మొదటిగా ఎదురు తిరిగిన వ్యక్తిగా బుద్ధుడు నిలిచారు. మనిషి ఔన్నత్యం కులం మీదకాదు, గుణం మీద ఆధారపడుతుందని ఆయన నొక్కి చెప్పారు. నాడు అనేక గందరగోళ సిద్ధాంతాలు, వాదనలు ప్రజలని అయోమయానికి గురిచేశాయి. ఇటువంటి తరుణంలో మనుషులనీ హేతుబద్ధంగా, తర్కబద్ధంగా ఆలోచింపజేయాలనీ బుద్దుడు సంకల్పించారు. మనిషి కేంద్రం గా ఆయన ఆలోచనలు చేశాడు. మనిషి ఎలా ఉండాలో బుద్ధుడు తన అష్టాంగ మార్గంలో వివరించారు. ఆయన ప్రకారం ‘కోరికలని జయించడమంటే వాటిని అదుపులో పెట్టుకోమని కాదు, శారీరక అవసరాల బట్టి సామాజిక సూత్రాల ద్వారా వాంఛలని తీర్చుకోవచ్చు. నైతిక సూత్రాల ద్వారా ధనాన్ని సంపాదించుకోవచ్చు. అలాగని పూర్తిగా విలాసవంతమైన జీవితం మంచిది కాదు. సర్వం త్యజించి సన్యాసాన్ని కూడా తీసుకోనవసరం లేదు. కఠిన ఉపవాసాలతో శరీరాన్ని ఇబ్బందిపెట్టవద్దు. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మంచి ఆలోచనలు వస్తాయి. తినే ఆహారం మనిషి ఆలోచనలని ప్రభావితం చేయలేవు. ఇతరుల మీద దయని చూపడం ద్వారా నీవు మరింత స్వేచ్ఛగా ఉండగల్గుతావు. జంతు, వృక్షరాశులని ప్రేమించాలి. దొంగతనాలకు, మద్యపానానికి, వ్యభిచారానికి దూరంగా ఉండాలి.

కర్మ కంటే కర్తే ముఖ్యం. మనం చేసే పనులు బట్టే ఫలితాలు వస్తాయి. అన్నింటికీ మనసే ప్రధానం’ అని ఆయన ప్రబోధించారు. మరణాంతరం జీవితం లేదని ఆయన తేల్చారు. మానవులంతా సమానమని, దేనిని గుడ్డిగా అనుకరించవద్దని వివరించారు. తన పేరుతో విగ్రహాలు నిర్మించవద్దని చెప్పారు. తనకు అత్యంత ప్రాముఖ్యతని కూడా ఇవ్వనవసరం లేదని బుద్ధుడు తన శిష్యులకు తెలియచేశారు. బుద్ధుని బోధనల ప్రభావం, బైబిల్ పై (కొత్తనిబంధన) కూడా ఉందని పాల్ కారస్ తన ‘ద గాస్పెల్ ఆఫ్ బుద్ధ’లో తెలియజేశాడు. వీటికి సంబంధించిన ఆధారాలు ఇజ్రాయెల్ రాజ్యం అవతరించిన తరువాత జరిపిన త్రవ్వకాలలో లభించాయి. అలెగ్జాండర్ దండయాత్రల వల్ల, ఇతర వ్యాపార సంబంధాల వల్ల సుగంధ ద్రవ్యాలు, నెమళ్ళు, కోతులు, గంధం చెక్కలు మన దేశం నుండి విదేశాలకు ఎగుమతి అయ్యాయి. బౌద్ధ సాహిత్యం కూడా విదేశాలకు వ్యాపించింది. బ్రదర్, సిస్టర్, ఫాదర్ మొదలైన పదాలన్నీ బౌద్ధం నుంచే క్రైస్తవం స్వీకరించిందని జహంగీర్ ఆర్.దూమాసియా రాసిన ‘స్టోరీ ఆఫ్ ద పారలల్ గ్రేట్ రోడ్స్’ లో తెలిపారు. బుద్ధుడు, క్రీస్తులిద్దరూ శాంతిదూతలుగా పేరు పొందారు. వారిద్దరూ బానిసత్వా న్ని ఎదిరించారు.

అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ బౌద్ధ సాహిత్యాన్ని సమగ్రంగా పరిశీలించి బౌద్ధమతాన్ని స్వీకరించారు. ‘బుద్ధిజానికి ఆధునిక రూపంగా అంబేద్కరిజాన్ని వర్ణించవచ్చు.బుద్దుడు ఒక సోషల్ ఇంజనీర్. ఆయన గొప్ప మానవతావాది. మానసిక శాస్త్రంలో జరిగిన పరిశోధనలు కూడా ఆయన బోధనలని బలపర్చాయి. మనమే బుద్ధుడిని దూరం చేసుకున్నాం. అంబేద్కర్‌ని నిర్లక్ష్యం చేస్తున్నాం. బుద్ధుడు జన్మించిన నాటి పరిస్థితులు ఇప్పుడు మన దేశం లో తిరిగి పురుడుపోసుకుంటున్నాయి. అందుకే మన మూలాల్లోకి తిరిగి వెళదాం. బుద్ధుడిని విగ్రహాల్లో గాకుండా ఆయన బోధనలలో దర్శించుకుందాము. బుద్ధుడు బోధించిన స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం సూత్రాల ఆధారంగానే తాను రాజ్యాంగాన్ని రచించానని అంబేద్కర్ స్పష్టం చేశారు. నిమ్న వర్ణాల రక్షణకై రాజ్యాంగంలో పలు నిబంధనలు రూపొందించబడ్డాయి. పాలకులు రాజ్యాంగ స్ఫూర్తిని అర్ధం చేసుకొని నిమ్నవర్గాల హక్కులని కాపాడాల్సిన అవసరం ఉంది. అణగారిన వర్గాల వారు కూడా తమ హక్కుల గురించి తెలుసుకోవడం, తమ రక్షణకై రూపొందించబడ్డ చట్టాలపట్ల అవగాహన కలిగివుండటం, వాటిని సక్రమంగా ఉపయోగించుకోవడం ద్వారానే దేశంలో నిజమైన దళిత సాధికారిత వస్తుంది.

యం. రాంప్రదీప్, 9492712836

Happy Buddha Purnima 2020

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News