Sunday, May 12, 2024

ఆనందయ్య ఆయుర్వేదంపై అధ్యయనం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కొవిడ్ బాధితులకు ఆనందయ్య ఇచ్చిన మందుపై సిసిఆర్‌ఎఎస్ మంగళవారం పరిశోధన రెండో రోజు కొనసాగుతోంది. జాతీయ ఆయుర్వేద పరిశోధనా సంస్థ ఆదేశాల మేరకు విజయవాడ, తిరుపతి ఆయుర్వేద కళాశాల బృందాలు ఆనందయ్య వద్ద మందు తీసుకున్న వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు. తిరుపతి శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య కళాశాల విద్యార్థులు ఆనందయ్య వద్ద మందు వాడిన 190 మంది నుంచి వివరాలు సేకరించారు. ఫోన్ల ద్వారా సమాచారం సేకరించటంలో సాంకేతిక ఇబ్బందులు ఉంటున్నాయని వైద్యులు తెలిపారు. కొంతమంది రోగులు స్థానిక ఆరోగ్య కార్యకర్తల ఫోన్ నంబర్లు ఇచ్చినట్లు గుర్తించామన్నారు. కరోనా రాకుండా ముందు జాగ్రత్తగా మందు తీసుకున్న వారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఈక్రమంలో కరోనా సోకి మందు తీసుకున్న వారి నుంచి వివరాలు సేకరిస్తే మందు ఫలితం తెలిసే వీలుంటుందని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు. అలాంటి వారిలో కనీసం 500 మంది నుంచి సమాచారం తెలుసుకుని విశ్లేషిస్తేనే ఆనందయ్య మందు ప్రభావంపై ప్రాథమిక నిర్ధారణకు రాగలమని వైద్యులు చెబుతున్నారు. ఇందుకోసం ఔషధం తీసుకున్న మరికొంత మంది ఫోన్ నెంబర్లు సేకరించి పంపించాల్సిందిగా నెల్లూరు జిల్లా అధికారులను వైద్యులు కోరారు.
విచారణకు హైకోర్టు సుముఖత
ఆనందయ్య నాటు మందు పంపిణీపై విచారణకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. పిటిషన్లపై గురువారం హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణ చేపట్టనుంది. నాటు మందు పంపిణీ ఖర్చును ప్రభుత్వమే భరించాలని పిటిషనర్లు కోరిన విషయం తెలిసిందే. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడాలని కోరారు. లోకాయుక్త ఆదేశంతో పంపిణీ నిలిపివేసినట్లు పోలీసులు చెబుతున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. మందు పంపిణీ అడ్డుకునే అధికారం లోకాయుక్తకు లేదన్నారు. పిటిషనర్ల వాదనలు విన్న కోర్టు.. విచారణకు అనుమతి ఇచ్చింది.

HC allows Probe on Andhra man’s herbal covid treatment

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News