Sunday, April 28, 2024

తడిసి ముద్దయిన భాగ్యనగరం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వాయుగుండం ప్రభావంతో భాగ్యనగరంలో కారు మబ్బులు కమ్ముకున్నాయి. హైదరాబాద్‌లో సాయంత్రం 4 గంటలకే చిమ్మచీకట్లు కమ్ముకున్నాయి. నగరం‌లో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో భాగ్యనగరం తడిసి మద్దయింది. భారీ వరద నీటితో నాలాలు, డ్రైనేజీలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయ మేర్పడుతోంది. బేగంబజార్, కోఠి, బషీర్‌బాగ్, నాంపల్లి, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరడం వల్ల ట్రాఫిక్ నిలిచిపోయింది. గచ్చిబౌలి, మాదాపూర్, రాయదుర్గం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, బోరబండ, మోతీనగర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, ఈఎస్‌ఐ, ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట, మైత్రీవనం, బాలానగర్, జీడిమెట్ల, సుచిత్ర, కుత్బుల్లాపూర్, యూసఫ్‌గూడ, వెంగళరావునగర్, మెహిదీపట్నం, గుడిమల్కాపూర్, పాతబస్తీ, జూపార్క్, బహదూర్‌పురా, పురానాపూల్, గోల్కోండ, లంగర్‌హౌస్, కార్వాన్, జియాగూడ, సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బేగంపేట, చిలకలగూడ, మారేడ్‌పల్లిలో వర్షం పడింది. హిమాయత్‌నగర్‌లో మోకాళ్ల లోతు వర్షం నీరు నిలిచిపోయింది.

అలాగే బషీర్‌బాగ్‌లోని సీపీ కార్యాలయం నుంచి పీజీ న్యాయకళాశాల మీదుగా కింగ్ కోఠి వరకు మోకాళ్ల లోతు వర్షం నీరు చేరింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంగళవారం సాయంత్రం నుంచి హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అవసరమైతే తప్ప బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసి అధికారులు హెచ్చరించారు.
నిండుకుండలా హిమాయత్ సాగర్
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో హిమాయత్ ‌సాగర్ నిండకుండను తలపిస్తోంది. దాదాపు పదేళ్ల తర్వాత హిమాయత్ సాగర్ జలాశయం నిండింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్ట 1763 అడుగులు ఉండగా.. ప్రస్తుతం అత్యధిక స్థాయిలో 1762.176 అడుగులకు నీరు చేరినట్లు అధికారులు స్పష్టం చేశారు. వర్షాల నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం వరకు 833 క్యూసెక్కుల నీరు వచ్చి చేరినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇన్‌ఫ్లో ఇదే స్థాయిలో కొవనసాగితే బుధవారం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశామని అధికారులు ప్రకటించారు.
భారీ వర్ష సూచన
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం ఏపిలోని కాకినాడ వద్ద తీవ్ర వాయుగుండంగా తీరం దాటిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇది వాయుగుండంగా బలహీనపడిందని రాగల 12 గంటల్లో మరింత బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారి రాజారావు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విస్తారంగా వర్షాలతో పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్నారు.

Heavy floods in Telangana due to Rain

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News