Monday, April 29, 2024

చిందేసిన చినుకు

- Advertisement -
- Advertisement -

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు
తడిసిముద్దయిన రాష్టం
కూలిపోయిన స్తంభాలు, కొట్టుకుపోయిన రోడ్లు
స్తంభించిన రాకపోకలు
నగరంలోని పలు ప్రాంతాలు జలమయం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణతో పాటు పలు జిల్లాల్లో గురువారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పలుజిల్లాలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగగా, కొన్నిచోట్ల చెట్లు నెలకొరిగాయి. పలుచోట్ల రోడ్లు దెబ్బతినడంతో రాకపోకలు స్తంభించాయి. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, లింగంపల్లి, మియాపూర్, సనత్‌నగర్, అమీర్‌పేట, బేగంపేట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, మాదాపూర్, గచ్చిబౌలి, సికింద్రాబాద్, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, జీడిమెట్ల, మల్కాజిగిరి,ఉప్పల్, హయత్‌నగర్, వనస్థలిపురం ఇలా చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈ వానకు లోతట్టు ప్రాంతాలు జలమయంకావడంతో జిహెచ్‌ఎంసి అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. పలు చోట్ల భారీగా వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
జలమయమయిన సికింద్రాబాద్
తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వానకు సికింద్రాబాద్‌లోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ వారాసిగూడ, కంటోన్మెంట్ బోయినపల్లి, బేగంపేట్ తదితర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు చేరుకుంది. భారీ వర్షానికి అంబర్‌పేట్-మూసారాంబాగ్ వద్ద మూసీ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నగర శివారులోని బోడుప్పల్ ప్రాంతంలోని ఒక కాలనీ పూర్తిగా నీట మునిగిపోయింది. వరద నీటితో పాటు డ్రైనేజ్ బ్లాక్ కావడంతో కాలనీలోకి నీరు పొంగి పొర్లుతుంది. మోకాళ్ల లోతు వరకు నీరు ప్రవహించడంతో ఈ ప్రవాహంలో కార్లు, బైకులు కొట్టుకొని పోయాయి.
మోమిన్‌పేటలో పొంగుతున్న చిలుకవాగు, కానల వాగులు
వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి వర్షం కురుస్తోంది. మోమిన్‌పేటలో చిలుకవాగు, కానల వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. తాండూర్ నియోజకవర్గంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు పొంగిపొర్లుతున్నాయి. పెద్దేముల్ మండలంలో గాజీపూర్ వాగు పొంగి పొర్లుతోంది. దీంతో తాండూరు సదాశివపేట్ రోడ్డులో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. తాండూరు మండలం ఐనెల్లి సమీపంలో బండల వాగు పొంగిపొర్లడంతో తాండూర్ -చించోళి రోడ్డు మార్గంలో వందలాది వాహనాలు నిలిచిపోయాయి.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు
ఛత్తీస్‌గడ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం రాత్రి, శుక్ర, శనివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో తేలికపాటి అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.జగిత్యాలలో 96.8 మిల్లీమీటర్ల వర్షపాతం, ఖమ్మం 89, యాదాద్రి భువనగిరి 47.3, కామారెడ్డి 45.5, సూర్యాపేట 44.3, నిజామాబాద్ 42, సంగారెడ్డి 39, నిర్మల్ 44.3, భద్రాద్రి కొత్తగూడెం 38, సిద్దిపేట 36.8, మంచిర్యాల 35.3, నల్లగొండ 34.3, మహబూబాబాద్ 35, రాజన్న సిరిసిల్ల 30.3, హైదరాబాద్ 20, మేడ్చల్ మల్కాజిగిరి 14, రంగారెడ్డి 13 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్టు వాతావరణ శాఖ తెలిపింది.

Heavy rainfall in Several Areas of Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News